in palkol
-
ముగిసిన నాటక పోటీలు
పాలకొల్లు టౌ న్ : సమాజంలోని రుగ్మతలను పోగొట్టి ప్రజలను చైతన్య వంతులను చేసే శక్తి నాటక రంగానికి ఉందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం రాత్రి డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ జాతీయ స్థాయి నాటిక పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటక రంగం కనుమరుగవకుండా భావితరాలకు అందించడానికి కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆ నాటి కళాకారుడు, ప్రముఖ సినీ, నాటక దర్శకుడు పినిశెట్టి శ్రీరామమూర్తి దగ్గరి నుంచి నేటి తరం గజల్ శ్రీనివాస్ వరకు ఎందరో ప్రముఖ కళాకారులను అందించి కళలకు పుట్టినిల్లుగా పాలకొల్లు భాసిల్లుతోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కళాపరిషత్‌లు నిర్వహించడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, విన్నకోట వేంకటేశ్వరరావు, డాక్టర్ కేఎస్పీఎ న్ వర్మ, మేడికొండ శ్రీనివాసచౌదరి, కేవీ కృష్ణవర్మ, మానాపురం సత్యనారాయణ, రంగ స్థల వృత్తి కళాకారుల సంఘ జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి అప్పారావు, గుండా రామకృష్ణ, రాయప్రోలు భగవాన్, బుద్దాల వెంకట రామారావు, జీవీబీఎస్ మూర్తి, జి.రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనగా ‘చాలు.. ఇక చాలు’ ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా శ్రీ సాయి ఆర్ట్స్–కొలకలూరి వారి ‘చాలు..ఇక చాలు’ నాటిక మొదటి బహుమతిని గెలుచుకుంది. అభినందన ఆర్ట్స్–గుంటూరు వారి ‘కేవలం మనుషులం’, అరవింద ఆర్ట్స్–తాడేపల్లి వారి ‘స్వర్గానికి వంతెన’ నాటికలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. జ్యూరీ ప్రదర్శనగా ‘నాన్నా.. నువ్వో సున్నా’ నిలిచింది. దిష్టిబొమ్మలు నాటక రచయిత తాళాబత్తుల వేంకటేశ్వరరావు ఉత్తమ రచయితగా, నాన్నా నువ్వో సున్నా నాటిక దర్శకుడు పి.బాలాజీనాయక్ ఉత్తమ దర్శకుడిగా అవార్డులు సొంతం చేసుకున్నారు. చాలు–ఇక చాలులో నీలకంఠం పాత్రధారి కేవీ సుబ్బారాయుడు ఉత్తమ నటుడిగా, దిష్టిబొమ్మలు నాటికలో జానకమ్మ పాత్రధారిణి ఎం.లక్ష్మీ తులసి ఉత్తమ నటిగా, గోవు మాలచ్చిమిలో గోవిందయ్య పాత్రధారి జానా రామయ్య ఉత్తమ ప్రతినాయకుడిగా, సందడే..సందడి నాటికలో దొంగ పాత్రధారి కె.జోగారావు ఉత్తమ హాస్య నటుడిగా, కేవలం మనుషులం నాటికలో మీర్జా ఆలీఖా న్ పాత్రధారి వీసీహెచ్‌కే ప్రసాద్ ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంపికయ్యారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రసాదరెడ్డి (హైదరాబాద్), కేకేఎల్ స్వామి (విజయనగరం), విన్నకోట వేంకటేశ్వరరావు (పాలకొల్లు) వ్యవహరించారు. -
షార్ట్‌ఫిల్మ్స్‌పై ఆసక్తి చూపండి
పాలకొల్లు సెంట్రల్ : విదేశాల్లో ఇద్దరు తెలుగువాళ్లు కలిస్తే ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటారు.. అదే ఇద్దరు తమిళులు కలిస్తే తమిళంలోనే మాట్లాడుకుంటారు.. ఇది తెలుగు భాషకు మనవాళ్లు ఇచ్చే గౌరవమని దర్శకుడు వీరశంకర్ అన్నారు. శనివారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో క్షీరపురి అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవ కమిటీ, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సినిమా రంగంపై విద్యార్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. యువత తెలుగు భాషను మర్చిపోతే భవిష్యత్‌లో తెలుగు సినిమాలు చూడలేమని, సంకరజాతి సినిమాలే వస్తాయని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సినిమా రంగంలో 25 శాతం మంది కళాకారులు పాలకొల్లు నుంచి వచ్చినవారే ఉన్నారని, కళారంగానికి క్షీరపురి పుట్టినిల్లు వంటిదన్నారు. యువత షార్ట్‌ఫిల్మ్స్‌పై ఆసక్తి చూపాలని, దీనిలోనూ మంచి ఆదాయం వస్తుందని సూచించారు. యూ ట్యూబ్‌లో రోజుకు 200 షార్ట్ ఫిల్్మలు అప్లోడ్ అవుతున్నాయని చెప్పారు. దర్శకులు సముద్రాల రఘునా«థ్, ఆకుమర్తి బాబూరావు దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, కథా రచనలపై విద్యార్థులకు వివరించారు. కెమెరామెన్ ధనిశెట్టి రాంబాబు ఫొటోగ్రఫీలోని మెలకువల తెలిపారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దర్శకులకు సన్మానం చేశారు. చిత్రోత్సవ కమిటీ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్, కన్వీనర్ డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ, క్లబ్ సభ్యులు కొమ్ముల ముర ళి, రేపాక ప్రవీణ్‌భాను, చాంబర్స్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
ఘనంగా లఘ చలన చిత్రోత్సవం
పాలకొల్లు అర్బన్ : కళలకు ప్రసిద్ధి చెందిన పాలకొల్లులో క్షీరపురి అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ క్షీరపురికి కళవచ్చిందన్నారు. లఘు చిత్రాలు వినోదాత్మకంగా, సందేశాత్మకంగా ఉంటున్నాయని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ మానవుల నడతను లఘు చలన చిత్రాలు మంచిగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సభకు అధ్యక్షత వహించగా మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామ జోగయ్య, మునిసిపల్ ప్రతిపక్షనేత యడ్ల తాతాజీ, బీజేపీ నాయకులు బుంగా సారథి, ఏఎంసీ చైర్మన్లు చెరుకూరి సత్యవర్మ, ఉన్నమట్ల కబర్థి, ఉత్సవ కమిటీ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేశిరాజు రాంప్రసాద్, సభ్యులు రావూరి వెంకట అప్పారావు, ఎం ఎస్ వాసు, ఖండవల్లి వాసు, గొర్ల శ్రీనివాస్, యాతం రమేస్, కేసీహెచ్ పెద్దిరాజు, జక్కంపూడి కుమార్ పాల్గొన్నారు. విజేతల ఎంపిక క్షీరపురి అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఉత్తమ చిత్రంగా విజయ్‌కుమార్(బెంగుళూర్) చిత్రీకరించిన ‘అద్దిల్లు’ ఎంపికై రూ.60వేలు నగదు, జ్ఙాపిక, ప్రశంసాపత్రం అందుకున్నారు. అలాగే ద్వితీయ ఉత్తమ చిత్రంగా రాజ్‌కుమార్‌స్వామి (భీమవరం) చిత్రించిన ‘యూ ఆర్ నాట్ ఎలోన్’ ఎంపికై రూ.40 వేలు నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకున్నారు. తృతీయ ఉత్తమ చిత్రంగా శంకర్రాజు (హైదరాబాద్) చిత్రించిన ‘రైతు’ లఘుచిత్రం ఎంపికై రూ.20వేలు నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకున్నారు. దీంతో పాటు ఉత్తమ కథ రచయితగా తోలేటి సతీష్ చిరునవ్వుల్లో లఘుచిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లేగా అద్దిల్లు, జోడి లఘుచిత్రాలు, ఉత్తమ దర్శకుడుగా విజయ్‌కుమార్ అద్దిల్లు లఘచిత్రం, బెస్ట్ ఫొటోగ్రఫీగా అద్దిల్లు, యూఆర్ నాట్ ఎలోన్, ఉత్తమ నటుడుగా ఉత్తరం.కామ్‌లో హీరో ఆదిత్య కిరణ్, ఉత్తమ నటిగా చిరునవ్వుల్లో పాప పాత్రధారి నందిని ఎంపికై ప్రోత్సాహక నగదు బహుమతులు అందుకున్నారు. జ్యూరీ సభ్యులుగా పీఎన్ ఆదిత్య, జనార్దన మహర్షి, వీర శంకర్, పద్మిని, ఎంవీ రఘు, ఎస్.రఘునాథ్ వ్యవహరించారు. -
‘భూభ్రమణ కాంక్ష’ పుస్తకావిష్కరణ
పాలకొల్లు సెంట్రల్ : మీరు ఆరోగ్యంగా ఉంటారు.. ప్రతి రోజూ వాకింగ్ చేయండి అంటే చాలామంది బద్ధకిస్తున్నారు. అటువంటిది భారతీయ ఔన్నత్యాన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేస్తూ పాదయాత్ర చేయడం అభినందనీయమని స్వచ్ఛభారత్ రాష్ట్ర కన్వీనర్ డా.బాబ్జి అన్నారు. గురువారం స్థానిక ముచ్చర్ల శ్రీరామ్ అతిథిగృహంలో రచయిత, ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.ఆదినారాయణ ’భూభ్రమణ కాంక్ష’ పుస్తకావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబ్జి మాట్లాడుతూ దేశం విశిష్టతను తెలియపర్చడానికి ప్రపంచంలో 14 దేశాల్లో 35 వేల కిలోమీటర్లు నడవడం సామాన్య విషయం కాదన్నారు. ప్రొఫెసర్ ఆదినారాయణ మాట్లాడుతూ అన్నీ తెలుçసు అనుకునేకన్నా అనుభవించడం ద్వారా నిజమైన వాస్తవాలను తెలుసుకోగలమన్నారు. పాదయాత్రలో అనేక విషయాలను తెలుసుకుని పుస్తక రూపంలో అందరికీ పరిచయం చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ సహస్రావధాని, డాక్టర్ రెడ్డప్ప ధవేజీ, వారణాసి శ్రీనివాసరావు, పీర్‌సాహెబ్, వంగా నరసింహరావు, వీకే సత్యనారాయణ, ముచ్చర్ల శ్రీరామ్ పాల్గొన్నారు. -
వెండిచీర అలంకరణలో శ్రీముఖధారమ్మ
పాలకొల్లు సెంట్రల్ : శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా స్థానిక అచ్చుగట్లపాలెం చిత్రావి చెరువు గట్టున కొలువై ఉన్న శ్రీ ముఖధారమ్మను అర్చకులు వెండి చీరతో అలంకరించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరై రజత కాంతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. దాతలు బొడ్డు సూర్యారావు, కొల్లంశెట్టి సత్యనారాయణ భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు దాసరి కృష్ణ, రేలంగి సుధాకర్, పేర్ల గుర్నాథం ఏర్పాట్లను పర్యవేక్షించారు.