ముగిసిన నాటక పోటీలు
ముగిసిన నాటక పోటీలు
Published Wed, Mar 15 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM
పాలకొల్లు టౌ న్ : సమాజంలోని రుగ్మతలను పోగొట్టి ప్రజలను చైతన్య వంతులను చేసే శక్తి నాటక రంగానికి ఉందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం రాత్రి డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ జాతీయ స్థాయి నాటిక పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటక రంగం కనుమరుగవకుండా భావితరాలకు అందించడానికి కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆ నాటి కళాకారుడు, ప్రముఖ సినీ, నాటక దర్శకుడు పినిశెట్టి శ్రీరామమూర్తి దగ్గరి నుంచి నేటి తరం గజల్ శ్రీనివాస్ వరకు ఎందరో ప్రముఖ కళాకారులను అందించి కళలకు పుట్టినిల్లుగా పాలకొల్లు భాసిల్లుతోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కళాపరిషత్‌లు నిర్వహించడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, విన్నకోట వేంకటేశ్వరరావు, డాక్టర్ కేఎస్‌పీఎ న్ వర్మ, మేడికొండ శ్రీనివాసచౌదరి, కేవీ కృష్ణవర్మ, మానాపురం సత్యనారాయణ, రంగ స్థల వృత్తి కళాకారుల సంఘ జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి అప్పారావు, గుండా రామకృష్ణ, రాయప్రోలు భగవాన్, బుద్దాల వెంకట రామారావు, జీవీబీఎస్ మూర్తి, జి.రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ప్రదర్శనగా ‘చాలు.. ఇక చాలు’
ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా శ్రీ సాయి ఆర్ట్స్–కొలకలూరి వారి ‘చాలు..ఇక చాలు’ నాటిక మొదటి బహుమతిని గెలుచుకుంది. అభినందన ఆర్ట్స్–గుంటూరు వారి ‘కేవలం మనుషులం’, అరవింద ఆర్ట్స్–తాడేపల్లి వారి ‘స్వర్గానికి వంతెన’ నాటికలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. జ్యూరీ ప్రదర్శనగా ‘నాన్నా.. నువ్వో సున్నా’ నిలిచింది. దిష్టిబొమ్మలు నాటక రచయిత తాళాబత్తుల వేంకటేశ్వరరావు ఉత్తమ రచయితగా, నాన్నా నువ్వో సున్నా నాటిక దర్శకుడు పి.బాలాజీనాయక్ ఉత్తమ దర్శకుడిగా అవార్డులు సొంతం చేసుకున్నారు. చాలు–ఇక చాలులో నీలకంఠం పాత్రధారి కేవీ సుబ్బారాయుడు ఉత్తమ నటుడిగా, దిష్టిబొమ్మలు నాటికలో జానకమ్మ పాత్రధారిణి ఎం.లక్ష్మీ తులసి ఉత్తమ నటిగా, గోవు మాలచ్చిమిలో గోవిందయ్య పాత్రధారి జానా రామయ్య ఉత్తమ ప్రతినాయకుడిగా, సందడే..సందడి నాటికలో దొంగ పాత్రధారి కె.జోగారావు ఉత్తమ హాస్య నటుడిగా, కేవలం మనుషులం నాటికలో మీర్జా ఆలీఖా న్ పాత్రధారి వీసీహెచ్‌కే ప్రసాద్ ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంపికయ్యారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రసాదరెడ్డి (హైదరాబాద్), కేకేఎల్ స్వామి (విజయనగరం), విన్నకోట వేంకటేశ్వరరావు (పాలకొల్లు) వ్యవహరించారు.
Advertisement