palle pragati
-
ముఖరా కే గ్రామం పల్లెలకు ఆదర్శం కావాలి: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కే గ్రామం పల్లెప్రగతి విజయవంతంగా అమలు చేసి స్వయం సమృద్ధి గ్రామంగా అభివృద్ధి చెందుతోందని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. పల్లెప్రగతి ద్వారా సమకూర్చిన ట్రాక్టర్, అమలు చేస్తున్న తడి చెత్త, పొడి చెత్త విధానం, డంపింగ్ యార్డు నిర్వహణ, కంపోస్ట్ ఎరువు తయారీ ఇప్పుడు ఆ గ్రామానికి ఆదాయ మార్గంగా మారిందన్నారు. ఈమేరకు ఆదివారం మంత్రిని కలిసి సర్పంచ్ దంపతులు తమ గ్రామంలో తయారు చేసిన వర్మీకంపోస్ట్‌ను అందజేశారు. ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ, దాన్ని వర్మీకంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా ఈ గ్రామ సర్పంచ్ గాడిగె మీనాక్షి ఏడాదిన్నరలో రూ.7 లక్షల ఆదాయం సంపాదించారు. ఇందులో రూ.4 లక్షలతో సోలార్ లైట్లు, రూ.2 లక్షలతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఆర్గానిక్ కంపోస్ట్ తయారు చేయడమే కాకుండా దానిద్వారా వచ్చే లాభాలను రైతులకు వివరించడం ద్వారా వంద మంది ఆ గ్రామంలో ఆర్గానిక్ పంటలు పండిస్తున్నట్లు సర్పంచ్ వివరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి గ్రామ సర్పంచ్‌ను అభినందించారు. పల్లెప్రగతి స్ఫూర్తిని అర్థం చేసుకుని ప్రతి పల్లె స్వయం సమృద్ధంగా మారాలని, పరిశుభ్రంగా ఉంటూ, పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. -
ఉత్సాహంగా పల్లె, పట్టణ ప్రగతి
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మున్సిపాలిటీల్లో సభలతో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. సభల్లో గత నాలుగు విడతలుగా చేపట్టిన ప్రగతి నివేదికలను చదవడంతోపాటు.. చేపట్టిన పనులు, వాటి పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. పల్లెప్రగతి కార్యక్రమం కింద నియమించిన కమిటీలు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి అభివృద్ధిపై ప్రణాళికలను సిద్ధం చేశాయి. చేపట్టాల్సిన పనులకు సంబంధించి గ్రామసభల్లో తీర్మానాలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. త్వరలోనే పెండింగ్ బిల్లులకు మోక్షం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంఛనంగా ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత రాయపర్తిలో, జనగామ జిల్లా కడవెండిలో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ పాల్గొని.. గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ప్రారంభించి మాట్లాడారు. ‘‘2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా స్థానిక సంస్థలకు రూ.9,560.32 కోట్ల నిధులు విడుదలయ్యాయి. పెండింగ్‌లో ఉన్న రూ.474 కోట్లకు సంబంధించి త్వరలో టోకెన్/బిల్లులు/చెక్కులను క్లియర్ చేస్తాం.. వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 57 ఏళ్లకు కుదించే ప్రక్రియ తుది దశకు చేరిందని.. త్వరలోనే రాష్ట్రంలో 8 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. స్థానిక ప్రజాప్రతినిధుల నిరసనలతో.. ♦భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం గుండాల, మామకన్ను, పడుగోనిగూడెం, ముత్తాపురం సర్పంచులు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరించారు. నిధుల్లేక ఇబ్బంది పడుతున్నామంటూ వార్డు సభ్యులతో కలిసి జోలె పట్టుకుని భిక్షాటన చేశారు. ట్రాక్టర్ల రుణం కిస్తీ, డీజిల్, బ్లీచింగ్ కొనుగోలు బిల్లులు రావడం లేదని వాపోయారు. ♦హనుమకొండ జిల్లా ధర్మపురంలో, వరంగల్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో, జఫర్ఘడ్ మండలం రఘునాథపల్లిలో పల్లె ప్రగతి గ్రామసభలో గ్రామస్తులు పాల్గొనకుండా నిరసన తెలిపారు. ♦‘4వ విడత పల్లెప్రగతి పనుల నిమిత్తం రూ.8లక్షల అప్పులు తెచ్చిన. ఏడాదైనా బిల్లులు వత్తలెవ్వు. చేతిలో చిల్లిగవ్వ లేదు. చేసేది లేక ఉపాధి పనులకు పోతున్న. ఇప్పటికైనా బిల్లులు ఇప్పించండి సారూ’ అంటూ హనుమకొండ జిల్లా విశ్వనాథకాలనీ సర్పంచ్ వల్లెపు అనిత కలెక్టర్‌కు మొరపెట్టుకుంది. ♦పల్లె ప్రగతి తొలిరోజు కార్యక్రమానికి నల్లగొండ జిల్లాలో 59 మంది సర్పంచ్‌లు హాజరుకాలేదు. పెం డింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. గుర్రంపోడు మండలంలోని 37 గ్రామాలు, అనుముల మండలంలోని 11 గ్రామాలు, చండూరు మండలంలోని 11 గ్రామాల సర్పంచులు గ్రామసభలను బహిష్కరించారు. పట్టణ ప్రగతి తీరు ఇదీ.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పట్టణప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీల్లో నాలుగో విడత పట్టణ ప్రగతి మొదలైంది. మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బస్తీలు, కాలనీల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. గతంలో చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించి, కొత్త పనులపై చర్చించారు. ♦ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. కలెక్టర్ గౌతమ్‌తో కలిసి ఉదయం ఆరు గంటల నుంచే సైకిల్‌పై తిరుగుతూ.. 53, 52, 41, 37 డివిజన్లలో పర్యటించారు. 41వ డివిజన్ డ్రైనేజీలో పిచ్చిమొక్కలను స్వయంగా తొలగించారు. -
ఈ ప్రభుత్వం సర్పంచ్‌లను జీతగాళ్లుగా మార్చింది
అక్కన్నపేట (హుస్నాబాద్): గ్రామాల్లో ఇదివరకే చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలంటూ సర్పంచ్‌లు మరోసారి గళం ఎత్తారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశనాయక్‌తండా సర్పంచ్ బానోతు రవీందర్‌నాయక్ గురువారం జరిగిన పల్లెప్రగతి అవగాహన కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యపాల్‌రెడ్డిని భిక్షం వేయాలంటూ జోలె పట్టి అడగటంతో అందరూ అవాక్కయ్యారు. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు పంచాయతీలో ట్రాక్టర్ కిస్తీ, కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతాలకే సరిపోతోందని, గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎలా చేపట్టాలంటూ భిక్షం అడుగుతూ ఆయన ఆవేదన వెళ్లగక్కారు. అక్కన్నపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాలోతు లక్ష్మి అధ్యక్షతన పల్లెప్రగతి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ.. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రావడంలేదని, మళ్లీ పల్లెప్రగతి పనులు ఎలా చేయాలని అధికారులను నిలదీశారు. గ్రామ అభివృద్ధి కోసం చేసిన పనులకు బిల్లులు రాక భార్య మెడలో పుస్తెలతాడు, బంగారు ఆభరణాలు తనఖా పెట్టి అప్పు కడుతున్నామంటూ ఆవేదన చెం దారు. బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్య లు చేసుకుంటున్నారని, మళ్లీ నక్సలైట్లు రా వాలని కోరుకుంటున్నామని అన్నారు. పెం డింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాకే పనులు చేస్తామని, అప్పటివరకు పల్లెప్రగతిని బహిష్కరిస్తున్నామని సర్పంచులు ముత్యాల సంజీవ్‌రెడ్డి, అన్నాడి దినేశ్‌రెడ్డి, బొమ్మగాని రాజేశం, గద్దల రమేశ్, జిల్లెల అశోక్‌రెడ్డి, కుమారస్వామి తదితరులు సృష్టం చేశారు. సమావేశం బహిష్కరణ.. సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వొద్దని పంచాయతీరాజ్ చట్టంలో ఏమైనా రాసి ఉందా? అని సర్పంచ్‌లు అధికారులను ప్రశ్నించారు. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తేనే సరి, లేదంటే పల్లెప్రగతి పనులు చేయబోమని సర్పంచ్‌లంతా కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలన సర్పంచ్‌లను జీతగాళ్లుగా మార్చేసిందని ఆరోపిస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. వీరంతా అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లే కావడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. దీంతో మాజీ జెడ్పీటీసీ మాలోతు భీలునాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు సర్పంచ్‌లను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అనంతరం ఎంపీపీ మాలోతు లక్ష్మి మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతం చేయడానికి సర్పంచ్‌లందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మంగ, ఎంపీడీఓ కొప్పల సత్యపాల్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేకు బాల్యం గుర్తొచ్చిందేమో?
కొల్చారం(నర్సాపూర్): ఆయన ఎమ్మెల్యే పల్లె ప్రగతి అభివృద్ధి పనులు పరిశీలించడానికి వచ్చారు. అక్కడ ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన ఉయ్యాలను చూసి ఒక్కసారిగి బాల్యం గుర్తొచ్చిందేమో? ఉయ్యాలలో ఊగి ఆనందపడ్డారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి గురువారం కొల్చారం మండలంలో పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు పర్యటించారు. అక్కడ కొంగోడ్ గ్రామంలోని పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించి ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన ఉయ్యాలపై కూర్చుని సరదాగా ఉయ్యాల ఊగి ఆనంద పడ్డారు. -
Telangana: 16 మంది మంత్రులు.. రూ.32 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకోసం ఒక్కో మంత్రికి రూ.2 కోట్ల చొప్పున 16 మంది మంత్రులకు రూ.32 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఈ మొత్తానికి అనుమతి ఇచ్చింది. మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలు, వాటి పరిధిలోని నియోజకవర్గాల్లో చేపట్టే కార్యక్రమాలకు నిధులు విడుదల చేసేందుకు అధికారం ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద జిల్లాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటికి ఆమోదం, అమలు, నిర్వహణ, పద్దుల తదితరాలకు నోడల్ అధికారిగా జిల్లా కలెక్టర్ ఉంటారని.. అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తారన్నారు. చదవండి: మరియమ్మ కుమారుడికి ఉద్యోగం, రూ.35 లక్షల చెక్కు -
యాదాద్రి కలెక్టర్ అనితా రామచంద్రన్ బదిలీ
సాక్షి, యాదాద్రి: కలెక్టర్ అనితా రామచంద్రన్ బదిలీ అయ్యారు. పల్లె, పట్టణ ప్రగతిలో అలసత్వం చేసినందుకు ఆమెను వేరే చోటికి బదిలీ చేసినట్లు తెలిసింది. కాగా అనితా రామచంద్రన్ స్థానంలో యాదాద్రి కొత్త కలెక్టర్‌గా పమేలా సత్పతి నియామకం అయ్యారు. కాగా అంతకముందు పల్లె ప్రగతి, పట్టణ పురోగతిపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త కలెక్టర్‌గా పమేలా సత్పతి -
'గ్రామ సభలు నిర్వహించకుంటే కఠిన చర్యలు తీసుకుంటా'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పల్లె ప్రగతి, పట్టణ పురోగతిపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. '' ఈనెల 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతా. ఈనెల 21న వరంగల్ జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి పనులపై తనిఖీలు చేస్తా. 10 రోజులు సమయం ఇచ్చి తనిఖీలకు వస్తా. గ్రామ సభలు నిర్వహించకుంటే సర్పంచ్‌లు, కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని తెలిపారు. -
వార్ కాకి.. వార్ కాక...!
సాక్షి, కురవి: గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (బుధవారం) మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో పల్లె నిద్ర చేశారు. గురువారం తెల్లవారుజామునే నిద్ర లేచిన మంత్రి... వేప పుల్లతో పండ్లు తోముకుంటూ సొంతూరులో జరిగిన పల్లెప్రగతి పనులను పరిశీలించారు. జనం వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. వార్ కాకి.. వార్ కాకా... వార్ బాబు.. వార్ బాయి..(ఎలా ఉన్నావు చిన్నమ్మ, చిన్నాయన, బాపు, అక్కా) అని పలకరిస్తూ వాడవాడలా కలియ తిరిగారు. ఊరిలోని నర్సరీని పరిశీలించి మొక్కలు బాగా పెరగడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’ పనులతో గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తోందని చెప్పారు. 30 ఏళ్లుగా గ్రామస్తులతో తనకు అనుబంధం ఉందన్నారు. పెద్ద తండాలో పల్లెప్రగతిని పరిశీలిస్తున్న మంత్రి సత్యవతి -
మార్పు రాకుంటే ఉపేక్షించం : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుతో పరిపాలనా విభాగాలు చిన్నవయ్యాయి. పల్లెల అభివృద్ధికి నిధుల కొరత ఏర్పడకుండా ప్రతినెలా రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నాం. అన్ని గ్రామాలకు గ్రామ కార్యదర్శులను నియమించాం. ఎంపీఓ, ఎంపీడీవో, డీఎల్పీవో, డీపీఓ, జడ్పీ సీఈఓ వంటి పోస్టులన్నింటినీ భర్తీ చేశాం. ఇంకా ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే అక్కడ వేరొకరిని నియమించే అధికారం కలెక్టర్లకు ఇస్తున్నాం. పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాం. ప్రతీ గ్రామంలో ట్రాక్టర్లను సమకూర్చుకునే అవకాశం కల్పించాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చాం. నేరుగా కోర్టుకు వెళ్లకుండా ట్రైబ్యునల్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వం కలెక్టర్లపై నమ్మకంతో తన అధికారాలను వారికి బదిలీ చేసింది. ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. ఇంత చేసినా గ్రామాల్లో మార్పు రాకుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చే విధంగా పనిచేయించే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు. ప్రగతిభవన్‌లో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 11 గంటలపాటు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ మారథాన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి, పజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప.. ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని స్పష్టంచేశారు. అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం ఉండాలని, రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ప్రాధాన్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ‘విస్తృత మేధోమథనం, అనేక రకాల చర్చోప చర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ– విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవలంభిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలి. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలి. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం మంత్రులు, కలెక్టర్ల బాధ్యత. వారి పనితీరుకు ఇదే గీటురాయి. మొక్కలు నాటి, సంరక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించే సమస్యే లేదు’అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డుల నిర్వహణను సరిదిద్దాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు. ‘రెవెన్యూ అజమాయిషీ కలెక్టర్ల చేతిలోనే ఉంటుంది. భూ సంబంధ రికార్డులు పక్కాగా ఉండాలి. కచ్చితంగా సంస్కరణలు రావాలి. 95 శాతం భూముల విషయంలో ఎలాంటి పేచీ లేదు. మిగతా వాటిని పరిష్కరించాలి’ అని సూచించారు. ఇంకా పలు అంశాలపై సీఎం ఏమన్నారంటే... అదనపు కలెక్టర్లకు వేరే పనులు వద్దు... అదనపు కలెక్టర్లలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థలకు కేటాయించాం. వారికి మరో పని అప్పగించవద్దు. ఒక అడిషనల్ కలెక్టర్ కేవలం స్థానిక సంస్థలను సమర్థవంతంగా పని చేయించే బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాలి. వారి కంప్యూటర్లో అన్ని గ్రామాలు, పట్టణాల చరిత్ర, సంపూర్ణ వివరాలు ఉండాలి. అదనపు కలెక్టర్లందరికీ రెండు రోజుల పాటు ‘గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి’పై శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఈ తరగతులకు కలెక్టర్లను కూడా ఆహ్వానించాలి. రాబోయే పదిహేను రోజుల్లో జిల్లా స్థాయిలో ‘పంచాయతీ రాజ్ సమ్మేళనం’నిర్వహించాలి. సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలను ఆహ్వానించాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లను ముఖ్య అతిథులుగా పిలవాలి. సమావేశం తర్వాత పది రోజుల గడువు ఇవ్వాలి. ఆలోగా గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పాలి. మొత్తంగా 25 రోజుల్లో గ్రామాల పరిస్థితిలో మార్పు రావాలి. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ఫ్లయింగ్ స్క్వాడ్లు పర్యటిస్తాయి. ముఖ్యమంత్రిగా నేను కూడా ఆకస్మిక పర్యటనలు చేస్తాను. ఏ గ్రామం అనుకున్న విధంగా లేకపోయినా చర్యలు తప్పవు. గ్రామాలను బాగా ఉంచుకునే వారికి అవార్డులు, ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. అన్ని విషయాలపై అవగాహన ఉండాలి... సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు కలెక్టర్లుగా పని చేస్తున్న యువ ఐఏఎస్ అధికారులే రేపు రాష్ట్రానికి కార్యదర్శులుగా, శాఖాధిపతులుగా వివిధ హోదాల్లో పనిచేస్తారు. అందువల్ల మంచి విధానాలు అమలవుతున్న ఇతర దేశాల పర్యటనలకు వెళ్లాలి. అన్ని రంగాల్లో ఉత్తమ పద్ధతులు, విధానాలను వారు అధ్యయనం చేసి తెలంగాణలో అమలు చేయాలి. మున్సిపల్ శాఖలో ఖాళీల భర్తీ.. పంచాయతీ రాజ్ శాఖ మాదిరిగానే మున్సిపల్ శాఖలో కూడా అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్ని ఖాళీలున్నాయి. ఎక్కడెక్కడ ఏ పోస్టులు భర్తీ చేయాలో మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. మొత్తం 141 పట్టణ స్థానిక సంస్థలకు నిధులు కూడా సమకూరుస్తాం. హైదరాబాద్ నగరానికి నెలకు రూ.78 కోట్ల చొప్పున.. మిగతా పట్టణాలు, నగరాలకు రూ.70 కోట్ల చొప్పున విడుదల చేస్తాం. ఈ నిధులతో పాటు, స్థానికంగా సమకూరే నిధులతో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. గ్రామాలు, పట్టణాల్లో వందకు వంద శాతం పన్నులు వసూలు చేయాలి. గ్రామాల్లో ట్రాక్టర్లు కొనుగోలు చేసినట్లే పట్టణాల్లో చెత్త సేకరణకు వాహనాలు కొనుగోలు చేయాలి’అని కేసీఆర్ ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంతో పాటు పట్టణ పరిపాలనకు సంబంధించి వ్యవహరించాల్సిన తీరుపై మంత్రులు కె.తారకరామారావు, శ్రీనివాస్‌గౌడ్ కలెక్టర్లకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం సహా ఇతర అంశాలపై సీనియర్ అధికారులు, కలెక్టర్లు తమ అభిప్రాయాలు తెలిపారు. పీసీసీఎఫ్ శోభ హరితహారం, అడవుల పునరుద్ధరణపై వివరించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సత్యనారాయణ కొత్త మున్సిపల్ చట్టంపై వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లో డీజిల్ వాహనాలు తగ్గించాలి ‘సముద్రం ఒడ్డున లేని నగరాల్లో కాలుష్యం పెరగడానికి అవకాశాలెక్కువ. ఇప్పుడు హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేస్తే కాలుష్య కాసారం కాక తప్పదు. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త వహించాలి. హైదరాబాద్ నగరం లోపల, చుట్టూ కలిపి లక్షా 60వేల ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో అడవులు పెం చాలి. వనస్థలిపురంలోని హరిణి వనస్థలిని కేబీఆర్ పార్కులాగా తయారు చేయాలి. హైదరాబాద్‌లో కాలుష్యం నివారించడానికి అనుగుణమైన ప్రణా ళిక రూపొందించి అమలు చేయాలి. డీజిల్ వాహనాలు తగ్గించి, ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్య పెంచే చర్యలు తీసుకోవాలి. ఈ నగరాన్ని కాలుష్యమయం కాకుండా చూసుకోవాలనే స్పృహ కలిగిలా తీసుకోవాలి’ అని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉండాలి.. ‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత తక్కువ వ్యవధిలోనే అద్భుత ప్రగతి సాధించాం. విద్యుత్, తాగునీటి సమస్యలు పరిష్కారమయ్యాయి. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి వసతి ఏర్పడుతోంది. ఇప్పుడు మన ముందున్న అత్యంత ప్రాధాన్యతతో కూడిన పని.. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియడమే. ఇక కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, కంటివెలుగు వంటి కార్యక్రమాలు పేదల కష్టాలు, కన్నీళ్లను దూరం చేయాలనే సమున్నత ఆశయం నుంచి పుట్టుకొచ్చిన పథకాలు. ఎంతో మేధోమథనం చేసి, ప్రజల అవసరాలకు అనుగుణంగా వాస్తవిక దృక్పథంతో ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తుంది. అలాంటి కార్యక్రమాలను జిల్లా స్థాయిలో కలెక్టర్లు అమలు చేయాలి. కలెక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా పరిపాలనను క్రమబద్ధం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కలెక్టర్లకు అండగా ఉండడం కోసం అదనపు కలెక్టర్లను నియమించాం. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్లు వ్యవహరించాలి. కలెక్టర్లపై ప్రభుత్వం ఎంతో నమ్మకం, బాధ్యతలు ఉంచింది. కొత్తగా తెచ్చిన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాల అమలులో కలెక్టర్ల బాధ్యత పెరిగింది. గతంలో 112 కమిటీలకు కలెక్టర్లు చైర్మన్‌గా వ్యవహరించేవారు. ఇప్పుడు వాటిని 26 విభాగాలుగా మార్చాం. దీనివల్ల కొంత పనిఒత్తిడి తగ్గుతుంది. కలెక్టర్లు ఇతర అధికారులతో సంప్రదింపులు జరపడానికి వీలుగా వైర్లెస్ సెట్లు సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నాం. ‘పట్టణ ప్రగతి’పై శిక్షణ ఇవ్వాలి.. పల్లె ప్రగతి తరహాలోనే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఇందులో భాగంగా పట్టణాలు, నగరాల్లో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో మున్సిపల్ సమ్మేళనం నిర్వహించాలి. మేయర్లు, చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కమిషనర్లను ఈ సమావేశానికి పిలిచి శిక్షణ ఇవ్వాలి. పట్టణ ప్రగతి కార్యక్రమం కన్నా ముందే అన్ని వార్డుల్లో కమిటీలు నియమించాలి. ఈ కార్యక్రమానికి పట్టణా ల్లోని వార్డును యూనిట్‌గా చూడాలి. ఆ వార్డులోని ప్రజాప్రతినిధు లు, ప్రభుత్వం నియమించే ప్రజాకమిటీలోని సభ్యులు పట్టణ ప్రగ తి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణంలో పాదయాత్రలు చేసి, వార్డులవారీగా సమస్యలు గుర్తించాలి. పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని పార్కులు, ఇతర అవసరాలకు వినియోగించాలి. అన్ని పట్ట ణాలకు 2 కిలోమీటర్ల దూరంలో వాకింగ్‌కు అనుకూలంగా పార్కులను అభివృద్ధి చేయాలి. గుట్టలు, కొండల మీద గుడిసెలు, ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి పట్టాలివ్వాలి. పట్టణాల్లో రూ.5లక్షల వరకు వ్యయం చేసే పనులను కలెక్టర్ అనుమతితో చేపట్టవచ్చు. ఇళ్లపై వేలాడే కరెంట్ వైర్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. గ్రామానికి ఒక నర్సరీ పెట్టినట్టే, పట్టణాల్లో కూడా అక్కడి జనాభాను బట్టి అవసరమైనవన్ని నర్సరీలు ఏర్పాటు చేయాలి. పట్టణాల్లో స్థలం దొరకకపోతే సమీప గ్రామంలో పట్టణానికి సంబం ధించిన నర్సరీ ఏర్పాటు చేయాలి. అన్ని పట్టణాల్లో వెజ్/నాన్ వెజ్ మార్కెట్లు నిర్మించాలి. మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం మూడు చొప్పున, పట్టణాల్లో కనీసం ఒకటి చొప్పున ఈ మార్కెట్లను నిర్మించాలి. వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చే ప్రజలు, మరీ ముఖ్యం గా మహిళలు టాయిలెట్లు లేక చెప్పరాని అవస్థలు పడుతున్నారు. అన్ని పట్టణాల్లో విధిగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలి. ఇందుకు ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వినియోగించాలి. ముందుగా కలెక్టరేట్లలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి. ప్రత్యామ్నాయం చూపించకుండా వీధుల వెంట షాపులు నిర్వహించేవారిని, టాక్సీ స్టాండ్లను, ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునేవారిని బలవంతంగా తరలించొద్దు. మెదడువాపుతో పాటు ఇతర వ్యాధులకు కారణమవుతున్న పందుల నివారణకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పందులను పోషిస్తూ జీవించే వారికి ప్రత్యేక ఉపాధి చూపించాలి. దట్టంగా అడవులు పెంచాలి... పల్లె ప్రగతి కొద్దికాలం చేసి ఊరుకునే కార్యక్రమం కాదు. నిరంతరం సాగాలి. దేశం లో ఆదర్శ పల్లెలు ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఉన్నాయనే పేరు రావాలి. గ్రామాల్లో ఎవరు చేయాల్సిన పనిని వారితోనే చేయిం చాలి. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవస్థతో పనిచేయిం చాలి. ప్రతి గ్రామంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను కచ్చితంగా బతికించాలి. గ్రామం లో స్మశాన వాటికలు, ఖనన వాటికలు, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలి. చెట్లకు నీళ్లు పోయడానికి, చెత్త ఎత్తివేయడానికి ట్రాక్టర్ కొనుగోలు చేయాలి. గ్రామాల్లో పర్యటించినప్పుడు మీ దృష్టికి వచ్చిన అత్యవసర, అత్యంత ప్రా ముఖ్యత కలిగిన పనులు చేయడానికి ప్రతి కలెక్టర్ వద్ద రూ.కోటి అందుబాటులో ఉంచుతాం. గ్రామాల్లో మొక్కలు నాటడం మాత్రమే కాదు. అడవుల్లో కలప అక్రమ రవాణాను అరికట్టడానికి కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. చెట్లు నరకకుండా చూడాలి. అటవీ భూముల్లో దట్టమైన అడవులు పెంచాలి. పదెకరాల అటవీభూమిలో అడవిని అభివృద్ధి చేయడం పదివేల ఎకరాల్లో సామాజిక అడవులు పెంచడంతో సమానం. కాబట్టి అడవిని పునరుద్ధరించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి. గ్రీన్ ప్లాన్ అమలుకు నిధుల కొరత రాకుండా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తాం. సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాలి.. ఏ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమమైనా ముందుగా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల నుంచే ప్రారంభం కావాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలు సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్నాయి. దళితవాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించాలి. కార్యక్రమాల అమలును అక్కడి నుంచే ప్రారంభించాలి. అక్షరాస్యతలో వెనకబడిన రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రతినబూనాలి. గ్రామంలో ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చే బాధ్యతను సర్పంచులకు అప్పగించాలి. జిల్లాను పూర్తి అక్షరాస్యత సాధించిన జిల్లాగా మార్చే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. వారు సాధించిన అక్షరాస్యతను జనాభా లెక్కల్లో కూడా నమోదు చేయించాలి. ఎస్సీ, ఎస్టీల్లో అక్షరాస్యత పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. -
‘కేటీఆర్‌కు సీఎం అయ్యే అన్ని అర్హతలున్నాయి’
-
కేటీఆర్ అన్ని విధాల సమర్థుడు: ఎర్రబెల్లి
సాక్షి, వరంగల్ రూరల్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలున్నాయని.. ఆయన అన్నివిధాల సమర్థుడని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేటీఆర్ నాయకత్వంలో జరిగిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించామని.. ఆయన సీఎం ఎప్పుడవుతారో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారని దయాకర్ రావు తెలిపారు. జిల్లాలోని వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమన్ని మంత్రి ఎర్రబెల్లి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన నెహ్రూ కుటుంబం ప్రభుత్వాన్ని నడపలేదా, రాష్ట్రానికి స్వాతంత్ర్యం తెచ్చిన కేసీఆర్ కుటుంబం ఎందుకు పాలించవద్దని ప్రశ్నించారు. కేటీఆర్.. చంద్రబాబు కొడుకు లోకేష్, సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీలా అసమర్థుడు కాదని వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో విఫలమైందని ఎర్రబెల్లి విమర్శించారు. గతంలో అసెంబ్లీ చర్చల సందర్భంలో తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని కాంగ్రెస్ నేతలు విమర్శించారని ఆయన మండిపడ్డారు. అయితే నేడు రాష్ట్రంలో 24 గంటల కరెంట్, తాగునీరు, సాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెందుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారని కొనియాడారు. గ్రామల్లో ఉన్న యువత ప్రత్యేక చొరవ తీసుకోవాలని.. దాతల సహాయం కూడా తీసుకొని అభివృద్ధి చేసుకోలని ఆయన తెలిపారు. అదేవిధంగా చెడు అలవాట్లు ఉన్నవారిని మహిళ సంఘలు నిలదీయాలని సూచించారు. చెత్త బయట వేసిన వ్యక్తుల పట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భాద్యత వహించి చర్యలు తీసుకొని జరిమానా విధించాలన్నారు. ‘పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఎవరూ నన్ను గురించలేదు. కానీ ముఖ్యమంత్రి కేసిఆర్ నన్ను గుర్తించి మంత్రి పదవి కట్టబెట్టారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 12లక్షలతో ప్రతి గ్రామంలో స్మశాన వాటిక, డంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా గ్రామాలు పచ్చదనంతో కళకళడుతున్నాయని ఎర్రబెల్లి తెలిపారు. త్వరలోనే జాఫర్ఘాడ్ చెరువులోకి దేవదుల ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు వస్తాయని ఆయన చెప్పారు. మహిళ సంఘలకు ప్రత్యేకంగా రూ. 5కోట్ల రుణాలు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లితోపాటు స్థానిక ఎమ్మెల్యే ఆరురి రమేష్, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత వరదరెడ్డి పాల్గొన్నారు. -
పల్లె ప్రగతి పథకానికి రూ.642 కోట్లు
మెదక్ : పల్లె ప్రగతి పథకానికి రూ.642 కోట్లు ఖర్చు చేస్తామని పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ పల్లెప్రగతి పథకానికి 150 మండలాలను ఎంపిక చేశామని, ఈ పథకం ద్వారా 75 లక్షల నిరుపేదలను దారిద్య్ర రేఖ నుంచి పైకి తెస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ గత రెండురోజులుగా మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.