సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కే గ్రామం పల్లెప్రగతి విజయవంతంగా అమలు చేసి స్వయం సమృద్ధి గ్రామంగా అభివృద్ధి చెందుతోందని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. పల్లెప్రగతి ద్వారా సమకూర్చిన ట్రాక్టర్, అమలు చేస్తున్న తడి చెత్త, పొడి చెత్త విధానం, డంపింగ్ యార్డు నిర్వహణ, కంపోస్ట్ ఎరువు తయారీ ఇప్పుడు ఆ గ్రామానికి ఆదాయ మార్గంగా మారిందన్నారు.
ఈమేరకు ఆదివారం మంత్రిని కలిసి సర్పంచ్ దంపతులు తమ గ్రామంలో తయారు చేసిన వర్మీకంపోస్ట్‌ను అందజేశారు. ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ, దాన్ని వర్మీకంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా ఈ గ్రామ సర్పంచ్ గాడిగె మీనాక్షి ఏడాదిన్నరలో రూ.7 లక్షల ఆదాయం సంపాదించారు. ఇందులో రూ.4 లక్షలతో సోలార్ లైట్లు, రూ.2 లక్షలతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు.
ఆర్గానిక్ కంపోస్ట్ తయారు చేయడమే కాకుండా దానిద్వారా వచ్చే లాభాలను రైతులకు వివరించడం ద్వారా వంద మంది ఆ గ్రామంలో ఆర్గానిక్ పంటలు పండిస్తున్నట్లు సర్పంచ్ వివరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి గ్రామ సర్పంచ్‌ను అభినందించారు. పల్లెప్రగతి స్ఫూర్తిని అర్థం చేసుకుని ప్రతి పల్లె స్వయం సమృద్ధంగా మారాలని, పరిశుభ్రంగా ఉంటూ, పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment