వికారాబాద్‌లో17వ వార్డు ఏకగ్రీవం
వికారాబాద్, న్యూస్‌లైన్: వేసవి ఎండలతో పాటు వికారాబాద్ మున్సిపల్ ఎన్నిక ల ఘట్టం రోజురోజుకూ వేడెక్కుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగిసింది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న రెబల్స్ మనసు మార్చుకొని పోటీ నుంచి వైదొలుగుతున్నారు. మంగళవారం పలువురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పట్టణంలోని 17వ వార్డు జనరల్ మహిళ స్థానం నుంచి బరిలో దిగిన అభ్యర్థులంతా నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో.. కాంగ్రెస్ అభ్యర్థి పల్లెగోని అనంతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ కౌన్సిలర్ ఖాజా సతీమణి ఫైమిదా బేగంకు మంత్రి ప్రసాద్‌కుమార్ నచ్చచెప్పడంతో ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో ఎవరు లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి అనంతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అనంతమ్మకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జైత్రామ్ నాయక్ ధ్రుకరణ పత్రాన్ని అందచేశారు.
పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ర్యాలీ నిర్వహించాయి. వికారాబాద్ మున్సిపల్లోని 28 వార్డుల్లో 17వ వార్డు ఏకగ్రీవంగా కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. పట్టణంలోని ప్రధాన వీధుల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతమ్మ మాట్లాడుతూ... తన విజయానికి తోడ్పడిన మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌కు, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇందిరానగర్, గరీబ్‌నగర్ కాలనీల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొండాల శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, శేఖర్‌గౌడ్, బొండాల అశోక్, రాజు, నాగేష్, పాండు, లతీఫ్, రమేష్‌గౌడ్, ఖదీర్, అన్వర్, ప్రశాంత్ గౌడ్ పాల్గొన్నారు.