Palm wine
-
తెలంగాణాలో.. కల్లు రాజకీయం
-
తాటి వనంలో కళ్ళు తాగిన ఎమ్మెల్యే రాజయ్య
-
హైదరాబాద్‌లో నీరా కేఫ్ రెడీ
సాక్షి, హైదరాబాద్: తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన పానీయం నీరా. నగరవాసులకు ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం నెక్లెస్ రోడ్డులో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. మొదట వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా నిర్వహించి ఆ తర్వాత డిసెంబర్ రెండో వారం నుంచి పూర్తి స్థాయిలో నీరా కేఫ్ సేవలను వినియోగంలోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ అధికారులు ఇటీవల కేఫ్‌ను సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో నెక్లెస్ రోడ్డులో రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. నీరాను సురక్షితంగా నిల్వ చేసేందుకు అన్ని రకాల శీతలీకరణ యంత్రాలను సైతం ఏర్పాటు చేశారు. పామ్ ప్రొడక్ట్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ అసోసియేషన్ (పీఆర్డీఏ) ఆధ్వర్యంలో నీరాతో పాటు అనుబంధ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ‘పానీయంలోని స్వచ్ఛతకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తాటిచెట్ల నుంచి నీరాను సేకరించడం మొదలుకొని దానిని వినియోగదారులకు చేర్చడం వరకు పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిని పాటిస్తున్నట్లు’ పీఆర్డీఏ వ్యవస్థాపకుడు వి.సత్యగౌడ్ తెలిపారు. ‘వేదామృత్’ పేరుతో స్వచ్ఛమైన నీరా రుచులను నగరాసులకు పరిచయం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: Dalit Bandhu: అత్యంత పేదలకు జాబితాలో ముందు చోటు! తెలంగాణ రుచులు సైతం.. ఈ కేఫ్‌లో రెస్టారెంట్ సేవలు కూడా లభిస్తాయి. నీరాతో పాటు తెలంగాణ వంటకాలన్నీ లభిస్తాయి. ఒకేసారి సుమారు 3 వేల మందికి పైగా సందర్శించేందుకు అనుగుణంగా కేఫ్‌ను ఏర్పాటు చేశారు. ►పర్యాటక ప్రియులు, నగరవాసులు ఎక్కువగా సేదదీరే హుస్సేన్‌సాగర్ తీరంలోని నెక్లెస్ రోడ్డులో నీరా, తెలంగాణ వంటకాలను ఆస్వాదించవచ్చు. తాటి, ఈత చెట్ల పానీయంలోని సహజత్వాన్ని ప్రతిబింబించేవిధంగా నీరా కేఫ్‌ను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ►భువనగిరి సమీపంలోని నందనం, కడ్తాల్ సమీపంలోని ముద్విన్‌లో ఏర్పాటు చేసిన తాటివనం ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేయనున్నారు. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే నీరా నుంచి తయారయ్యే బెల్లం, సిరప్, బుస్ట్ వంటివి కూడా కేఫ్‌లో విక్రయిస్తారు. పోషకాలు పుష్కలం నీరాలో పోషకాలు పుష్కలం. ప్రొటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్ ఏ, బీ–6, బీ–12 వంటివి సమృద్ధిగా లభిస్తాయి. మొత్తం 20 అమైనో ఆసిడ్స్‌లో 18 అమైనో యాసిడ్స్ నీరా నుంచి లభిస్తాయి. ఈ పానీయం రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. అన్ని విధాలుగా ఇది ఆరోగ్య ప్రదాయిని. –వి. సత్య గౌడ్, పీఆర్డీఏ -
Photo Feature: కల్లు కమ్మగుంది..
ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద ఆదివారం ఓ కోతి కల్లు తాగింది. కల్లు కవర్‌ను తెచ్చుకొని గోడపై కూర్చొని రుచి చూసింది. -
Photo Feature: బొంగులో చికెన్ తెలుసు కానీ.. బొంగులో కల్లు పేరు విన్నారా?
ఇప్పటివరకు బొంగులో చికెన్ విన్నాం. కానీ బొంగులో కల్లు పేరు విన్నారా?! సాధారణంగా తాటిచెట్టుకు మట్టి కుండలు కట్టి కల్లు నిండాక కిందకు దించుతారు. కానీ ఇక్కడ మాత్రం ఒక్కో చెట్టుకు పదుల సంఖ్యలో వెదురు బొంగులు పెట్టారు. చెట్టు నుంచి వచ్చే కల్లు ఈ బొంగుల్లోకి చేరాక కిందకు దించుతారు. మట్టి కుండలతో పోలిస్తే వెదురు బొంగుల్లోని కల్లు రుచి విభిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో ఇలా బొంగులు కట్టిన తాటి చెట్టు కనిపించింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం చదవండి👉 కరక్కాయ’ రిజర్వ్ ధర తగ్గింది! ∙ -
నీళ్లు+రసాయనాలు= కల్లు
సాక్షి, వరంగల్: అచ్చం కల్లు మాదిరిగానే తెల్లటి నురుగు పొంగుతున్నట్టుగా కనిపించి నాలుకకు రుచించే ‘కృత్రిమ కల్లు’ బాగోతాన్ని వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. గతంలో అల్ఫోజోలం, క్లోరల్ హైడ్రేట్, యూరియా వంటి రసాయనాలను కొంతమేర కల్లులో కలిపి విక్రయించిన నేరగాళ్లు.. ఇప్పుడు అసలు ఆ కాస్త కల్లు లేకుండానే నీళ్లలో రసాయనాలు, పేస్టు కలిపి తయారుచేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ తరహా కేసు ఇదే మొదటిదని పోలీసులు చెబుతున్నారు. దసరా వేళ ఈ ముఠా అఘాయిత్యాలు వెలుగులోకి రావడంతో కల్లు ప్రియులు జంకుతున్నారు. వరంగల్‌లోని ఇంతేజార్గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం కల్లు కాంపౌండ్‌పై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. 300 లీటర్ల కృత్రిమ కల్లుతోపాటు ముడి పదార్థాలు అమ్మోనియా, సచారిన్ పౌడర్, సోప్ బెర్రీ, గోబైండా పేస్ట్, నాలుగు సెల్ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏడాది నుంచి గుట్టుగా.. నిజామాబాద్, కామారెడ్డిలలో కల్లు కాం పౌండ్ నిర్వహించిన నరేందర్ గౌడ్ ఎక్సైజ్ కాంట్రాక్టర్‌గా పనిచేశాడు. కరోనా దెబ్బకు వ్యాపారం సజావుగా సాగకపోవడంతో వరంగల్‌లోని రంగశాయిపేటలో గావిచర్ల క్రాస్‌రోడ్డు వద్ద ఉంటున్న బంధువు పరకాల నవీన్ కుమార్ వద్దకు వచ్చాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో కృత్రిమ కల్లు తయారీ విషయాన్ని అతడితో చెప్పా డు. దేశాయిపేటకు చెందిన సారంగపాణికి చెందిన లక్ష్మీపురంలో కాంపౌండ్‌ను అద్దెకు తీసుకున్నాడు. దేశాయిపేటకు చెందిన గోడిశాల ఉగేందర్, జూలూరి రాజుల సహకారం తో రోజుకు 100–150 లీటర్ల వరకు కృత్రిమ కల్లు తయారుచేశాడు. ఇలా ఏడాది నుంచి నగరంలోని కాశీబుగ్గకు చెందిన రామకృష్ణ, ఎల్బీనగర్కు చెందిన సాంబ య్య, గుట్టకు చెందిన కలమ్మ, లక్ష్మీపురంకు చెందిన రవి, వరంగల్ అండర్ బ్రిడ్జిలోని సత్యం దుకాణాలకు లీటర్ కల్లును రూ.30 చొప్పున విక్రయించాడు. రోజుకు రూ.3 వేల నుంచి 4 వేల వరకు గడించాడు. కాం పాండ్ యజమాని సారంగపాణికి ఇదంతా తెలిసినా మిన్నకుండిపోవడంతోపాటు వారి కి సహకరించారన్న ఉద్దేశంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు సీహెచ్ శ్రీనివాస్, ఆర్.సంతోష్ నేతృత్వం లోని బృందం కాంపాండ్‌పై దాడిచేసి నలుగురిని అరెస్టు చేయగా, సారంగపాణి పారి పోయాడు. తదుపరి విచారణ నిమిత్తం వీరిని ఇంతేజార్గంజ్ పోలీసులకు అప్పగించారు. ఈ కల్లు డేంజర్ ఈ కృత్రిమ కల్లు తయారీలో వాడే రసాయన మిశ్రమాలు ప్రాణాంతకం. అమ్మోనియా వల్ల మత్తు, సచారిన్ పౌడర్‌తో తీపి, సోప్‌బెర్రీతో కాస్త తెల్లటి నురుగ, గోబైండా పేస్ట్‌తో పులుపు రుచి వస్తుంది. దీన్ని తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కాళ్లు, చేతులు లాగడం, మతిస్థిమితం కోల్పోవడం జరుగుతాయి. ఒకసారి ఈ కల్లు రుచిచూస్తే మళ్లీ తాగాలనేంతగా అలవాటుపడతారు. ఇది ఆరోగ్యంపై దుష్ఫ్రభావాన్ని చూపుతుంది. బాధితులు త్వరగా చికిత్స పొందితే మంచిది. – డాక్టర్ జి.చంద్రశేఖర్, ఫిజీషియన్. ఎంజీఎం -
కల్లుగీత కార్మికురాలిపై ఎస్ఈబీ సీఐ దాష్టీకం
సాక్షి, పీసీపల్లి: కల్లు అమ్ముకుంటున్న మహిళపై ఎస్ఈబీ సీఐ జులుం ప్రదర్శించారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పీసీపల్లి మండల పరిధిలోని పెదయిర్లపాడులో శనివారం జరిగింది. కనిగిరి ఎస్ఈబీ సీఐ జలీల్ ఖాన్ తన సిబ్బందితో కలిసి గ్రామంలోకి వెళ్లారు. అక్కడ కల్లు విక్రయిస్తున్న పద్మజ, బండ్ల రమేష్, శ్రీనులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రభుత్వ అనుమతితోనే కల్లు విక్రయిస్తున్నామని చెప్పినా వినలేదని, కల్లులో మాదక ద్రవ్యాలు కలిపారంటూ నానా దుర్బాషలాడుతూ రోడ్డు వెంట ఈడ్చుకెళ్లారని పద్మజ అనే కల్లు గీత కార్మికురాలు వాపోయింది. సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన పద్మజను 108లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం శ్రీనును అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారంపై కల్లుగీత కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళ.. అని కూడా చూడకుండా దాడి చేసిన సీఐ జలీల్ఖాన్ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి గ్రామంలో గంజాయి, నాటుసారా విక్రయిస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. కల్లు విక్రయిస్తున్న వారిని విచారించేందుకు వెళ్లాం. కల్లు విక్రయిస్తున్న వారు బాధ్యతాయుతమైన సమాధానం ఇవ్వకుండా దుర్బాషలాడారు. దీంతో చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. మా విచారణలో వారి వద్ద ఎటువంటి మాదక ద్రవ్యాలూ లభించలేదు. – జలీల్ ఖాన్, సెబ్ సీఐ సీఐపై చర్యలు తీసుకోవాలి మహిళ..అని కూడా చూడకుండా విచక్షణా రహితం దాడి చేసిన సీఐ జలీల్‌ఖాన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి. విధుల నుంచి సస్పెండ్ కూడా చేయాలి. ఫిర్యాదులు వస్తే విచారణ చేయాలేగానీ స్వలాభం కోసం విచక్షణా రహితంగా దాడి చేయడం హేయం. – బ్రహ్మంగౌడ్, కల్లు గీత సంఘ అధ్యక్షుడు, కనిగిరి గాయాలు చూపుతున్న పద్మజ -
దేవతలు తాగింది కల్లే: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: కల్లును తక్కువ చేసి చూడటం సరికాదని, అది దేవతలు తాగిన పానీయమని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం శాసనసభలో వెల్లడించారు. దేవతలు సురాపానం చేయటమంటే.. చెట్టు నుంచి గీసిన కల్లు తాగటమేనని ఆయన స్పష్టం చేశారు. కల్లు ఆధారంగా ఎన్నో కులవృత్తుల వారికి లబ్ధి చేకూరుతోందని, అందుకే అది పెద్ద కుటీర పరిశ్రమేనని వెల్లడించారు. కల్లు దుకాణాలను ఆసరా చేసుకుని ఇతర కులవృత్తుల వారి ఉత్పత్తుల వినియోగం జరుగుతోందని, ఫలితంగా వారు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారన్నారు. కల్లు గీసేవారు ఆర్థికంగా బలోపేతమవటాన్ని చూసి ఓర్వలేక గత ప్రభుత్వాల హయాంలో నగరంలో కల్లు దుకాణాలను రద్దు చేశారని, కానీ వాస్తవాలు గుర్తించిన ఈ ప్రభుత్వం మళ్లీ తెరిపించిందని పేర్కొన్నారు. చెట్టు పన్ను పేర అప్పట్లో వేధించేవారని, దాన్ని ఈ ప్రభుత్వం దూరం చేసిందని పేర్కొన్నారు. మంత్రులూ క్లుప్తంగా మాట్లాడండి: స్పీకర్ పద్దులకు సంబంధించి చర్చ అనంతరం మంత్రులు సమాధానం ఇచ్చే సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం పొద్దుపోయేవేళకి కేవలం ఆరుగురు మంత్రులే సమాధానం చెప్పారు. మరో ఐదారుగురు సమాధానం ఇవ్వాల్సి ఉంది. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రులు మాట్లాడాలని స్పీకర్ పదేపదే పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడే ముందు కూడా ఇదే సూచన చేశారు. దీంతో ‘మీరు వ్యవసాయ మంత్రిగా ఉండగా పద్దులపై మాట్లాడటాన్ని మేం ఆసక్తిగా వినేవాళ్లం. కొన్నిసార్లు రాత్రి 12 గంటల సమయంలో కూడా మీరు మాట్లాడారు. మిమ్మల్నే మేం ఆదర్శంగా తీసుకుంటున్నాం. మీ వారసత్వాన్ని కొనసాగిస్తాం’అని అనటంతో స్పీకర్ సహా సభ్యులు గొల్లుమన్నారు. చదవండి: నా పాత్రను పోషించనివ్వడం లేదు -
కల్లుప్రియుల్లారా లొటలొట తాగేసేయండి
సాక్షి, మెదక్: తూప్రాన్-నర్సాపూర్ రోడ్డులోని బ్రాహ్మణపల్లి రైల్వేట్రాక్ పక్కన మూడున్నర ఎకరాల్లో ఏపుగా పెరిగిన ఈతచెట్ల వనం.. అడవిని తలపిస్తున్నా అక్కడంతా కోలాహలంగా ఉంది. అడపాదడపా కార్లు.. మరెంతోమంది బైక్‌లపై అక్కడికి వచ్చిపోతున్నారు. లోపలికి వెళ్తే.. కొంతమంది ఈతచెట్లపై నుంచి కల్లు తీస్తున్నారు. అక్కడికి వచ్చిన వారు అప్పుడే తీసిన కల్లును ఇష్టంగా తాగుతున్నారు. ఇంకొందరు కల్లు తీసుకుని వెళ్తున్నారు. ఈ ఈతవనం యజమాని లచ్చాగౌడ్‌ది వెంకటాపూర్ (పీటీ) గ్రామం. మొదట్లో వ్యవసాయంతోపాటు కల్లు గీసేవాడు. 2007లో కల్లు గీత సొసైటీలో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తే.. దొరకలేదు. పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి. ఈ క్రమంలో బ్రాహ్మణపల్లిలో తన మూడున్నర ఎకరాల భూమిలో ఈతమొక్కలు నాటాలని నిర్ణయించాడు. అటవీ శాఖలో పనిచేసే పరిచయస్తుడైన బాలేశ్‌గౌడ్ సాయంతో సదాశివపేట, తాండూరు, చేవెళ్ల, మరెన్నో ప్రాంతాలు తిరిగాడు. చివరకు నాటి ఉమ్మడి మెదక్ జిల్లాలోని పెద్దాపూర్‌లో ఒక్కోటి రూ.30 చొప్పున.. 2 వేల ఈతమొక్కలు కొన్నాడు. ఒక్కో మొక్కకు ఆరడుగుల దూరం, ఒక్కో వరుస మధ్య పన్నెండు అడుగుల దూరం ఉండేలా నాటాడు. 2012లో కల్లు పారడం మొదలైంది. ఎందరికో జీ‘వన’ ఉపాధి ఈతవనం నాలుగు గీత కార్మిక కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. ఒక్కొక్కరికి నెలకు రూ.12 వేల చొప్పున జీతం ఇస్తుండగా.. రోజుకు రూ.300 కూలీకి మరో ఇద్దరు మహిళలు పనిచేస్తున్నారు. ఖర్చులన్నీ పోను నెలకు రూ.50 వేల వరకు ఆదాయం ఉంటుందని లచ్చాగౌడ్ తెలిపారు. లచ్చాగౌడ్‌కు భార్య బాలమణి, నలుగురు కుమారులు. వారూ తండ్రితో పాటు ఈతవనాన్ని చూసుకుంటున్నారు. ఈతవనం చేతికందిన దశలో ఎక్సైజ్ అధికారులు, కొందరు స్థానికులు అడ్డుతగిలారు. దీంతో లచ్చాగౌడ్ కుమారులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు లచ్చాగౌడ్‌తో పాటు కుమారులకు సైతం లైసెన్స్ జారీచేశారు. ఇక్కడి నుంచే ‘ట్రెండ్’ మొదలు ఒకేచోట ఈతవనాలను పెంచడం.. అక్కడే కల్లు అమ్మడం అనే ట్రెండ్ బ్రాహ్మణపల్లి నుంచి మొదలుకాగా, రాష్ట్రంలోని పలుచోట్ల ఇటువంటివి ఏర్పాటవుతున్నాయి. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పలు గ్రామాల్లో గౌడ కులస్తులే కాకుండా ఇతర వర్గాలు సైతం ఆదాయ మార్గంగా ఈతవనాల పెంపకం చేపట్టాయి. దొంతి, గుండ్లపల్లి, చండి, చిన్నగొట్టుముక్కుల, చెన్నపూర్, నవాబుపేట గ్రామాల్లో వీటి పెంపకం ఊపందుకుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 40 ఎకరాల్లో ఈతచెట్ల పెంపకం సాగుతోంది. చేగుంట మండలం కర్నాల్‌పల్లిలో గౌడ సొసైటీకి చెందిన ఎకరంన్నర స్థలంలో రెండు దఫాలుగా 500 చొప్పున వెయ్యి ఈతచెట్లు పెట్టారు. తొలుత పెట్టిన చెట్లకు కల్లు పారుతోంది. ఏడాదికి పది కుటుంబాల చొప్పున సంరక్షణ, అమ్మకపు బాధ్యతలు తీసుకుంటున్నాయి. అప్పటికప్పుడు స్వచ్ఛమైన కల్లు అప్పటికప్పుడు చెట్ల నుంచి తీసిన కల్లు విక్రయించడం, చుట్టూ అడవిలో ఉన్న భావన.. ఇవి కల్లుప్రియుల్ని ఇక్కడకు రప్పిస్తున్నాయి. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, సిద్దిపేటతోపాటు హైదరాబాద్ నుంచి ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తున్నారు. లీటర్ కల్లు రూ.50కి విక్రయిస్తున్నారు. ఇక, ఒకే చెట్టుకు కట్టిన లొట్టి నుంచి ఆ సమయానికి ఎంత కల్లు లభిస్తే అంత.. రూ.200 పలుకుతోంది. వీకెండ్లో నగరం నుంచి వచ్చే వారితో రద్దీగా ఉంటుంది. ఇక్కడ సీజన్‌తో సంబంధం లేకుండా కల్లు పారుతోంది. ఒక్కో చెట్టు నుంచి రోజుకు 2 నుంచి 5 లీటర్ల కల్లు వస్తోంది. వేసవిలో రోజుకు 300 చొప్పున.. అన్‌సీజన్‌లో 150 చొప్పున చెట్లు గీస్తామని, సీజన్లో రోజూ రూ.20 వేల వరకు అమ్మకాలు సాగుతున్నాయని లచ్చాగౌడ్ చెబుతున్నారు. తలరాత మార్చుకున్నా.. ఈతవనం పెంపును మొదట్లో ఇంటోళ్లు వద్దన్నారు. అయితే, ఈ తరం వాళ్లకు ప్రకృతి వరప్రసాదమైన స్వచ్ఛమైన కల్లు అందించాలనే సంకల్పంతో ఈతవనం పెంచా. అడ్డంకులెదురైనా హైకోర్టు అండగా నిలిచింది. నాకొచ్చిన ఆలోచనతో నా తలరాత మార్చుకున్నా. - లచ్చాగౌడ్ ఎకరంలో ఈతవనం పెట్టా.. ఎకరా పొలంలో మూడేళ్ల క్రితం ఉపాధి హామీ ద్వారా 500 ఈత మొక్కలు నాటాను. ఆరేళ్లకు కల్లు తీసే అవకాశం ఉంటుంది. కులవృత్తిని కాపాడుకోవడానికి ఇదో అవకాశంగా మారింది. - బాలాగౌడ్, చండి, శివ్వంపేట -
లాక్డౌన్: కల్లు అమ్మకాలకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్లు అమ్ముకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఈ మేరకు సీఎం అనుమతితో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, లాక్డౌన్ నిబంధనలకు లోబడి కల్లు అమ్మాలని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగిలిన జిల్లాల్లో కల్లు విక్రయించేందుకు సీఎం కేసీఆర్ అనుమతినిచ్చారని, ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. గీత కార్మిక పక్షపాతిగా కేసీఆర్ మొదటి నుంచీ వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ఇప్పుడు కల్లు అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 2.8 లక్షల మంది లైసెన్స్డ్ గీత వృత్తిదారులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. సమావేశంలో ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, గౌడ సంఘాల నేతలు పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్, బి.బాలరాజ్ గౌడ్, చింతల మల్లేశం గౌడ్, అంబాల నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇపుడిక.. బొంగులో కల్లు!
ములుగు: ఇప్పటి వరకు బొంగు చికెన్ విషయం మాత్రమే మనకు తెలుసు. గొత్తికోయలు విన్నూత్నంగా కంక బొంగులో కల్లును సేకరిస్తున్నారు. విశాఖపట్టణం సమీపంలోని అరకు, భద్రాచలం సమీపంలోని పాపికొండల ప్రాంతాలలో ఆదివాసీలు ఈ విధానం ద్వారా కల్లు తీస్తారు. మేడారానికి వచ్చే దారి మధ్యలో గొత్తికోయలు తాటి చెట్లకు మట్టి కుండలకు బదులు వెదురు బొంగులను ఏర్పాటు చేసి కల్లును సేకరిస్తున్నారు. పర్యాటకులు ఈ కల్లును సరికొత్తగా ఆస్వాదిస్తున్నారు. రెట్టింపు ధర.. సాధారణంగా తాటి చెట్టు నుంచి సేకరించిన కల్లును గీత కార్మికులు రెండు లీటర్ల బాటిల్‌కు రూ.100 చొప్పున తీసుకుంటున్నారు. కాగా, మేడారానికి వెళ్లే దారి మధ్యలో వెంగళాపురం, మొట్లగూడెం, ప్రాజెక్టునగర్ మధ్యలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన గొత్తికోయలు వినూత్నంగా తాటిచెట్ల గొలలకు కంక బొంగులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్టునగర్ సమీపంలోని సుమారు 20 కుటుంబాలకు చెందిన ఏడుగురు గొత్తికోయలు సమీపంలోని 50 తాటి చెట్లకు వెదురు బొంగులను ఏర్పాటు చేసి 20 రోజులుగా కల్లును సేకరిస్తున్నారు. కల్లు కోసం క్యూ.. పట్టణాల నుంచి ఏజెన్సీలోని పలు ప్రాంతాల సందర్శనకు వస్తున్న పర్యాటకులు బొంగు కల్లు కోసం క్యూ కడుతున్నారు. కంక బొంగు ద్వారా సేకరిస్తున్న రెండు లీటర్ల తాటి కల్లుకు రూ.200 ధర పలుకుతోంది. రెట్టింపు ధర డిమాండ్ చేస్తున్నా కల్లును కొనుగోలు చేస్తున్నారు. కంక బొంగులో సేకరించిన కల్లు సాఫ్ట్‌గా ఉంటుందని వారు చెబుతున్నారు. ఆస్వాదిస్తున్నారు.. 15 సంవత్సరాల నుంచి మొట్లగూడెం సమీపంలో నివసిస్తున్నాం. స్థానికంగా ఉన్న తాటి చెట్లు కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉన్నాయి. ఈ విషయమై గ్రామస్తులను సంప్రదించి కల్లు గీయడానికి ఒప్పించాం. ప్రస్తుతం 20 కుటుంబాలకు చెందిన ఏడుగురం 50 తాటి చెట్లను కల్లు గీయడానికి ఒప్పదం కుదుర్చుకున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో మాదిరిగా ఎక్కువ పొడవు, లోతైన కంక బొంగులను తయారు చేసుకొని తాటి గొలలకు అమరుస్తున్నాం. కుండల ద్వారా సేకరించే కల్లుకు, మేము సేకరించే కంక బొంగు కల్లుకు వ్యత్యాసం ఉంది. రెండు లీటర్ల బాటిల్‌కు రూ.200 చొప్పున తీసుకుంటున్నాం. ప్రస్తుతం చెట్లన్నీ లేత దశలో ఉన్నాయి. మరో పది రోజుల్లో పూర్తి స్థాయిలో కల్లు అందుతుంది. ప్రజలు, పర్యాటకులు కంకబొంగు కల్లుపై ఆసక్తి చూపడంతో రోజుకు రూ.500 నుంచి 1000 మేర ఆదాయం వస్తోంది. మడక గంగయ్య, గొత్తికోయవాసి, మొట్లగూడెం -
వేపచెట్టుకు కల్లు..!
రఘునాథపాలెం : మండలంలోని వీవీ.పాలెంలో టి.దానయ్య అనే వ్యక్తి ఇంటి పెరడులోని వేపచెట్టుకు కల్లు పారుతోంది. సహజంగా తాటి, ఈత చెట్లకు కల్లును గీత కార్మికులు గీస్తారు. అయితే..ఇక్కడ వేపచెట్టు కాండం నుంచి కొన్ని రోజులుగా ద్రవం కారుతుండడంతో..ఇది కల్లు అని గుర్తించి ఇంటి యజమాని లొట్టిలోకి ఆ కల్లు చేరేలా ఏర్పాట్లు చేశాడు. ఇది తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, వేపచెట్టుకు కల్లు కారుతున్న వింతను స్థానికులు ఆసక్తిగా పరిశీలించి వెళుతున్నారని దానయ్య తెలిపాడు. -
నూతన కల్లు విధానం రూపొందించాలి
-గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ హన్మకొండ(వరంగల్ జిల్లా) రాష్ట్రంలో నూతన కల్లు విధానం రూపొందించాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న బస్సుయూత్ర సన్నాహక సమావేశం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ఎక్సైజ్ విధానమే ఇప్పటికీ ఉందని, దీన్ని మార్పు చేయూలని అన్నారు. గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సర్వాయి పాపన్న పాలించిన ఖిలాషాపురం కోట నుంచి ఆగస్టు 1న బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తుందన్నారు. 1న ఖిలాషాపురంలో ప్రారంభమై 2న వరంగల్‌కు చేరుకుంటుందని, 3న భువనగిరి, 4న నల్లగొండ, 5న ఖమ్మం, 6న కరీంనగర్, అదిలాబాద్, 7న నిజామాబాద్, 8న మెదక్, 9వ తేదీన మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో యాత్ర కొనసాగుతుందని, 10వ తేదీన హైదరాబాద్‌లోని గోల్కొండ కోట వద్ద ముగుస్తుందని వివరించారు. ఆగష్టు 18న సర్వాయి పాపన్న జయంతిని గ్రామగ్రామాన జరపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.