హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ రెడీ | Neera Cafe Ready To Open At Necklace Road Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ రెడీ.. రెస్టారెంట్‌ సేవలు, తెలంగాణ వంటకాలు

Published Tue, Nov 29 2022 8:19 AM | Last Updated on Tue, Nov 29 2022 10:05 AM

Neera Cafe Ready To Open At Necklace Road Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన పానీయం నీరా. నగరవాసులకు ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం నెక్లెస్‌ రోడ్డులో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్‌ డిసెంబర్‌ మొదటి వారంలో ప్రారంభం కానుంది. మొదట వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా నిర్వహించి ఆ తర్వాత  డిసెంబర్‌ రెండో వారం నుంచి పూర్తి స్థాయిలో నీరా కేఫ్‌ సేవలను వినియోగంలోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ అధికారులు ఇటీవల కేఫ్‌ను సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.  

దాదాపు రూ.10 కోట్ల  వ్యయంతో నెక్లెస్‌ రోడ్డులో రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. నీరాను సురక్షితంగా నిల్వ చేసేందుకు అన్ని రకాల శీతలీకరణ యంత్రాలను సైతం ఏర్పాటు చేశారు. పామ్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ (పీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో నీరాతో పాటు అనుబంధ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. 

‘పానీయంలోని స్వచ్ఛతకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తాటిచెట్ల నుంచి నీరాను సేకరించడం మొదలుకొని దానిని వినియోగదారులకు చేర్చడం వరకు పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిని పాటిస్తున్నట్లు’ పీఆర్‌డీఏ వ్యవస్థాపకుడు వి.సత్యగౌడ్‌ తెలిపారు. ‘వేదామృత్‌’ పేరుతో స్వచ్ఛమైన నీరా రుచులను నగరాసులకు పరిచయం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.  
చదవండి: Dalit Bandhu: అత్యంత పేదలకు జాబితాలో ముందు చోటు!

తెలంగాణ రుచులు సైతం.. 
ఈ కేఫ్‌లో రెస్టారెంట్‌ సేవలు కూడా లభిస్తాయి. నీరాతో పాటు తెలంగాణ వంటకాలన్నీ లభిస్తాయి. ఒకేసారి సుమారు 3 వేల మందికి పైగా సందర్శించేందుకు అనుగుణంగా కేఫ్‌ను ఏర్పాటు చేశారు.  

►పర్యాటక ప్రియులు, నగరవాసులు ఎక్కువగా సేదదీరే  హుస్సేన్‌సాగర్‌ తీరంలోని నెక్లెస్‌ రోడ్డులో నీరా, తెలంగాణ వంటకాలను ఆస్వాదించవచ్చు. తాటి, ఈత చెట్ల పానీయంలోని సహజత్వాన్ని ప్రతిబింబించేవిధంగా నీరా కేఫ్‌ను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.  

►భువనగిరి సమీపంలోని నందనం, కడ్తాల్‌ సమీపంలోని ముద్విన్‌లో ఏర్పాటు చేసిన తాటివనం ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేయనున్నారు. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే నీరా నుంచి తయారయ్యే బెల్లం, సిరప్, బుస్ట్‌ వంటివి కూడా కేఫ్‌లో విక్రయిస్తారు. 

పోషకాలు పుష్కలం   
నీరాలో పోషకాలు పుష్కలం. ప్రొటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్‌ ఏ, బీ–6, బీ–12 వంటివి  సమృద్ధిగా లభిస్తాయి. మొత్తం 20 అమైనో ఆసిడ్స్‌లో 18 అమైనో యాసిడ్స్‌ నీరా నుంచి లభిస్తాయి. ఈ పానీయం రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. అన్ని విధాలుగా ఇది ఆరోగ్య ప్రదాయిని. 
 –వి. సత్య గౌడ్, పీఆర్‌డీఏ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement