స్కెచ్ గీసి ...భార్యను హతమార్చిన సీఐ
అనంతపురం : అనంతపురం జిల్లా నల్లమాడ మండలం అవరవాండ్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాద మిస్టరీని పోలీసులు చేధించారు. కడప సీఐ అర్జున్ నాయక్...భార్య పద్మలతను పథకం ప్రకారం హతమార్చినట్లు పోలీసులు తేల్చారు. పద్మలత మృతిపై అర్జున్ నాయక్‌తో సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వారిపై 490, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే సీఐ అర్జున్ నాయక్, అతని భార్య పద్మలత మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. తమ వ్యవసాయ పొలంలోని కంది పంటను గ్రామ సమీపంలోని రోడ్డుపైనే నూర్పిడి చేసి, దాని కాపలా కోసం రోడ్డు పక్కన భార్యాభర్తలు నిద్రించారు. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వాహంన ఢీకొన్నట్లు తెలియటంతో అక్కడకు చేరుకున్నారు.
పద్మలతను నల్లమాడ ఆస్పత్రిలో చేర్పించగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. గాయపడిన అర్జున్ నాయక్‌ను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా తమ కుమార్తెను భర్తే హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడంటూ పద్మలత తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.