పంచలోహ విగ్రహాల చోరీ
ఐలూరు రామేశ్వర ఆలయానికి కన్నం
ఆలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కల్పన
ఐలూరు(తోట్లవల్లూరు) :
దక్షిణకాశీగా పేరుగాంచిన రామేశ్వరస్వామి ఆలయానికి దొంగలు కన్నం వేశారు. స్వామి పంచలోహ విగ్రహాలను అపహరించుకుపోయారు. వివరాలు.. రామేశ్వరస్వామి ఆలయంలో పూజల అనంతరం శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో అర్చకుడు లీలాప్రసాద్ తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. శనివారం వేకువజామున 5 గంటల సమయంలో ఆలయ పరిసరాలను శుభ్రపరిచేందుకు వచ్చిన లోయ శివాజీ ఆలయానికి తాళాలు లేకపోవటాన్ని గమనించి అర్చకునికి సమాచారం అందించారు. ఆలయ తాళాలు పగులకొట్టటం, విగ్రహాల అపహరణ విషయం తెలుసుకున్న ఆలయ మేనేజర్ జయశ్రీ ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మూడు విగ్రహాల అపహరణ..
ఆలయ ప్రధాన ద్వారం తాళం పగులకొట్టి గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. గర్భగుడికి ఎడమవైపుగా సుమారు 400 సంవత్సరాల క్రితం నాటి రామేశ్వరస్వామి, పార్వతీ అమ్మవారు, చండేశ్వరస్వామి పంచలోహ విగ్రహాలను తీసుకెళ్లారు. 24.700 కిలోల బరువున్న ఈ విగ్రహాల విలువ రూ.2 లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఘటనా ప్రాంతాన్ని ఏసీపీ వినయభాస్కర్, ఉయ్యూరు సీఐ సత్యనారాయణ, ఎస్ఐ ప్రసాద్ పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ ఆధారాల సేకరించింది.
ఆలయానికి రక్షణేది : ఎమ్మెల్యే కల్పన
రామేశ్వరస్వామి ఆలయాన్ని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, జెడ్పీఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి, ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, సర్పంచి పిడుగు రాఘవులు పరిశీలించారు. దేవాదాయశాఖ అధికారుల వైఫల్యం కారణంగానే ఆలయంలో దొంగతనం జరిగిందని ఎమ్మెల్యే కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. చోరీపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.