లెక్క చూపాల్సిందే !
ఇందూరు,న్యూస్‌లైన్ : జిల్లాకు మంజూరవుతున్న ఆర్థిక సంఘం నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడం ఇక ముందు కుదరదు. పనులు చేయకున్నా.. చేసినట్లు తప్పుడు బిల్లులు పెడితే దొరికిపోవడం ఖాయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ ఇనిస్ట్యూషన్ అకౌంటింగ్ పేరిట ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెచ్చింది. ఇక మీదట జిల్లాలోని గ్రామీణ, మండల స్థాయిలో అభివృద్ధి పనులకు, మరమ్మతుల కోసం ఆర్థిక సంఘం నిధులను ఏ విధంగా ఖర్చు చేశారు? దేనికి ఎంత ఖర్చు చేశా రు? వివరాలను ఖచ్చితంగా కేంద్రానికి తెలుపా ల్సి ఉంటుంది.
ఈ మేరకు ఆర్థిక సంఘం నిధులు ఎప్పటి నుంచి వస్తున్నాయో ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కేంద్రం జిల్లా పంచాయతీ అధికారులకు సూచించింది. దీంతో పాత లెక్కలను ఎలా చూపాలోనని మండల పరిషత్ కార్యాలయా ల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా పాత లెక్కలను అడగటంతో 2011-12, 2012-13 సంవత్సరాలకు సంబంధించిన రికార్డులు ఎక్కడున్నాయోనని కట్టి పెట్టిన ఫైళ్లను వెతకడం మొదలు పెట్టారు. ఈ ఖర్చుల వివరాలు ఆన్లైన్లో పెడితే కానీ ఇప్పుడు మం జూరు చేసిన 2013-14 ఆర్థిక సంఘం నిధులు రూ.12 కోట్ల 61లక్షల 71 వేల 900, 2014-15 ఆర్థిక సంఘం నిధులు రూ. 13 కోట్ల 88 లక్షల 45 వేల 200ల వినియోగానికి అనుమతివ్వబోమని కేం ద్రం హెచ్చరించింది.
జిల్లాకు మంజురు చేసిన ఆర్థిక సంఘం నిధుల వివరాలను జూన్ 1లోగా ఆన్లైన్లో నమోదు చేసి తీరాలని కేంద్ర ప్రభుత్వం జిల్లా పంచాయతీ అధికారులకు గడువు కూడా విధించింది. దీంతో అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో పాటు మండలాల ఉద్యోగులను అలర్ట్ చేశారు. డీఎల్పీఓ కార్యాలయాల్లో, మండల కార్యాలయాల్లో కంప్యూటర్లు పెట్టి ఏర్పాట్లు చేసి ఆపరేటర్లతో నిధుల ఖర్చుల వివరాలను ఆన్లైన్ చేయించాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
అక్రమాలకు అడ్డుకట్ట
ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలలో జిల్లాకు మంజూరు చేస్తూ వచ్చింది. అయితే ఇన్నాళ్లూ ఆ నిధుల వినియోగంపై వివరాలు తెలుసుకోలేదు. ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఖర్చు చేసిన నిధులకు సంబంధిం చిన గ్రామం పంచాయతీల నుండి ధ్రువీకరణ పత్రాలను దాదాపు జిల్లాలోని 718 పంచాయతీల్లో ఎవరు కూడా ఇంత వరకు జిల్లా పంచాయతీ కా ర్యాలయంలో సమర్పించలేదు.
ఎందుకంటే నిధు లు పక్కదారిపట్టాయని, దీనికి తోడు ఆన్లైన్ వ్యవస్థ లేకపోవడం కూడా కలిసి వచ్చిందని సం బంధిత వర్గాలు చెబుతున్నాయి. పాత, కొత్త లెక్క లు తీస్తే ఎక్కడ దొరికిపోతామోనని ఉద్యోగులు, పాలకులు జంకుతున్నారు. ఇక మీదట ఆర్థిక సం ఘం నిధుల్లోంచి నయా పైసా ముట్టాలన్నా.. పని చేసినట్లుగా సాక్ష్యాలు చూపి ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అభివృద్ధి నిధుల్లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లయిందని పలువురు పేర్కొంటున్నారు.