Panchayati Raj officials
-
ఇదేం చోద్యం..!
♦ ప్రభుత్వ పనుల కోసమని చెప్పి సిమెంట్ తెప్పించిన కాంట్రాక్టర్ ♦ సొంత పనుల కోసం గోదాంకు తరలించే యత్నం ♦ విషయం తెలిసి గోదాం వద్దకు వెళ్లిన మీడియా ♦ లోడు దించకుండా నిలిపేసిన లారీ ♦ మేము ఇండెంట్ పెట్టలేదంటున్న పంచాయతీరాజ్ అధికారులు విజయనగరం ఫోర్ట్: ఆయన ఓ కాంట్రాక్టర్. ప్రభుత్వ పనులు చేయిస్తానని చెప్పి ఆ రేటుకు దాదాపు 700 బస్తాల సిమెంట్‌ను తెప్పించుకున్నాడు. కానీ ప్రభుత్వ పనులకు వినియోగించేందుకు కాకుండా సొంత గోదాములో దించేందుకు ప్రయత్నిస్తుంటే విషయం మీడియాకు తెలిసి పలువురు మీడియా ప్రతినిధులు ఆ ప్రాంతానికి వెళ్లారు. దీంతో సిమెంట్‌ను దించకుండా అలాగే లారీల్లో వదిలేశారు. లారీ సిబ్బందిని లోడుకు సంబంధించిన బిల్లులు చూపించాలని అడిగితే గుమస్తా పట్టుకెళ్లి పోయినట్లు బదులిచ్చారు. ఈ తతంగం అంతా శనివారం, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు నివాసం ఎదురుగా ఉన్న రైల్వే క్వార్టర్స్ ఎదురుగా ఉన్న గోదాం వద్ద జరిగింది. గుంకలా, ద్వారపూడి గ్రామాల్లో సీసీ రోడ్ల కోసమని..! సదరు కాంట్రాక్టర్ మండలంలోని గుంకలా, ద్వారపూడి గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం కోసమని నాగార్జున కంపెనీ చెందిన దాదాపు 700 సిమెంట్ బస్తాలను తెప్పించారు. వాస్తవానికి ప్రభుత్వ పనుల కోసమైతే కంపెనీలు రూ.240కే సిమెంట్ బస్తాను ఇవ్వాలి. స్లాగ్ సిమెంట్‌ను రూ.230కు, ఓపీసీ గ్రేడ్ సిమెంట్ అయితే రూ.240కు ప్రభుత్వ పనులకు కంపెనీలు ఇస్తున్నాయి. కానీ బహిరంగ మార్కెట్లో మాత్రం సిమెంట్ బస్తా ధర రూ.330 నుంచి రూ.340గా ఉంది. ఈ పరిస్థితుల్లో దాదాపు బస్తా సిమెంట్‌కు రూ.100 వరకు మిగులుతుంది. దాదాపు 700 బస్తాలకు రూ.70వేల వరకు ఆ కాంట్రాక్టర్ మిగిలించుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఇలా ఉండడంతో కొన్ని సిమెంట్ కంపెనీలకు చెందిన సిబ్బందితో, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రభుత్వ పనుల పేరు చెప్పి తక్కువ ధరకే సిమెంట్‌ను తెప్పించుకుంటున్నారు. అసలు నిబంధన ఇదీ.. ప్రభుత్వ పనులకు సిమెంట్ కావాలంటే స్థానిక సర్పంచ్ ఎన్ని బస్తాల సిమెంట్ అవసరమో వాటికి డీడీ తీసీ పంచాయతీరాజ్ ఈఈకు ఇవ్వాలి. ఈఈ ఇన్ని బస్తాల సిమెంట్ అవసరం అని ఇండెంట్ పెడతారు. సంబంధిత కంపెనీలు సిమెంట్‌ను సరఫరా చేస్తారు. సిమెంట్ వచ్చిన తర్వాత డెలివరీ బిల్లుపై మండల ఇంజినీర్ సంతకం చేయాలి. కానీ శనివారం జిల్లాకు వచ్చిన సిమెంట్ లోడు అసలు పంచాయతీ రాజ్ అధికారులు ఇండెంటే పెట్టకుండా వచ్చింది. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. -
జిల్లా అభివృద్ధికి సహకరించాలి
విశాఖ రూరల్ : జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరూ సహకరించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవాని కోరారు. జిల్లా పరిషత్ ద్వారా చేపట్టే అన్ని కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలయ్యేలా చూడాలని పంచాయతీరాజ్ అధికారులు, ఇంజినీర్లకు సూచించారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా తొలిసారిగా బాధ్యతలు చేపట్టానని, జెడ్పీ ద్వారా అమలు పరుస్తున్న కార్యక్రామలపై ఇప్పుడిప్పుడే అవగాహన ఏర్పరుచుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అనే బేధభావం లేకుండా అందరూ సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికారులు, ఉద్యోగులకు సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే సామరస్య పూర్వకంగా పరిశీలిస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న రోడ్లు, తాగునీటి పథకాలు, పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎం.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ జెడ్పీ, పంచాయతీరాజ్ వ్యవస్థలు అనే తేడా లేకుండా అందరూ పంచాయతీరాజ్ ఉద్యోగులనే భావనతో కలిసిమెలసి ముందుకు వెళ్లాలని సూచించారు. జిల్లా పరిషత్ ద్వారా అమలు పరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో సమర్ధవంతంగా అమలుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ కె.రవీంధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.