మా కుటుంబాన్ని వేధిస్తున్నారు
పోలీసులపై ‘వ్యాపమ్’ను బయటపెట్టిన పాండే ఆరోపణ
ఇండోర్: మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వ్యాపమ్ స్కామ్‌ను బయటపెట్టి, సుప్రీం కోర్టుకు వెళ్లిన ప్రశాంత్ పాండే భార్య మేఘనా పాండేను పోలీసులు హవాలా ఆరోపణలపై కొద్దిసేపు నిర్బంధించి తర్వాత వదిలిపెట్టారు. ఆమె నుంచి రూ.9.96 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పాండే మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు.
వ్యాపమ్ స్కామ్‌పై సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత తమపై వేధింపులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే లక్ష్మీ మోటార్స్ అనే సంస్థలో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్టు తమకు సమాచారం అందడంతో శనివారం అక్కడ నిఘా పెట్టామని, అదే సమయంలో మేఘన ఓ బ్యాగ్‌తో సంస్థనుంచి బయటకు వస్తుండగా ఆపి తనిఖీ చేయడంతో ఆమె వద్ద రూ.9.96 లక్షల నగదు లభించిందని ఎస్పీ త్రిపాఠీ తెలిపారు.
మేఘన ఆ డబ్బుకు సంబంధించి సరైన వివరాలు చెప్పకపోవడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించామని, డబ్బును స్వాధీనం చేసుకుని ఆమెను వదలిపెట్టామని వివరించారు. అయితే తన భార్య లక్ష్మీ మోటార్స్ సంస్థలో ఉద్యోగం చేస్తోందని, ఆ డబ్బు తమ సొంతమని, ఫ్లాట్‌ను కొనుగోలు చేయడంకోసం బిల్డర్‌కు ఆ డబ్బు ఇవ్వాల్సి ఉందని ప్రశాంత్ పాండే వెల్లడించారు.