పట్టణాలకే ఉల్లి..
⇒గ్రామాలను విస్మరించిన ప్రభుత్వం
⇒రైతుబజార్లలో కుటుంబానికి 3 కిలోలే
⇒సరిపోవంటూ వినియోగదారుల ఆందోళన
⇒జిల్లాలో ప్రోత్సాహం లేకపోవడంతో కనుమరుగైన ఉల్లిసాగు
నెల్లూరు: రాష్ట్రప్రభుత్వం సబ్సిడీపై అందించే ఉల్లిపాయలను కేవలం పట్టణాలకే పరిమితం చేసింది. అది కూడా నెల్లూరు, కావలి, గూడూరు పట్టణాల్లో అరకొరగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల వారికి సబ్సిడీ ఉల్లిని పూర్తిగా దూరం చేయగా, పట్టణాల్లోనూ కొందరికే అందుతున్నాయి. కేవలం రైతుబజార్లలో మాత్రమే విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఉల్లిపాయలు పట్టణవాసులకూ అందని ద్రాక్షగా ఊరిస్తున్నాయి. రేషన్ కార్డు, ఆధార్ కార్డులను తెచ్చుకున్నవారికే ఉల్లిపాయలను సబ్సిడీపై అందజేస్తున్నారు.
రేషన్ కార్డు ఉన్న వారందరికీ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, రైతుబజార్లలోని సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆధార్ కావాలని మెలిక పెడుతుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో కుటుంబానికి 3 కిలోలు మాత్రమే ఇస్తున్నారు. హోల్ సేల్ మార్కెట్లో మేలు రకం ఉల్లిగడ్డలు 10 కిలోలు రూ.400 పలుకుతుండగా, రిటైల్ మార్కెట్లో కిలో రూ.45 నుంచి 50 వరకు విక్రయిస్తున్నారు.
ప్రోత్సాహం కరువు
ఉల్లిసాగుకు ప్రోత్సాహం కరువైంది. ఏటా విస్తీర్ణం తగ్గుతోంది. ఉల్లి ధరలు పెరుగుతున్నా ఉద్యానశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014-15 ఖరీఫ్‌లో 200 ఎకరాలు సాగు చేయగా, గత రబీలోనూ, ప్రస్తుత ఖరీఫ్‌లోనూ ఒక్క ఎకరం కూడా రైతులు సాగు చేయలేదంటే, ఉల్లిసాగుకు గడ్డు పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఉద్యాన పంటల అభివద్ధి కోసం రైతులకు విత్తనాలపై 50 శాతం రాయితీపై ఇవ్వటానికి 2013-14లో రూ.20లక్షలు కేటాయించారు. అప్పట్లో వీటిని ఆశాఖ పరిధిలో ఉన్న మిర్చిపంటకు మినహా ఏ పంటకైనా ఇవ్వచ్చని ప్రభుత్వం సడలింపు ఇచ్చింది.
సక్రమంగా పంపిణీ చేస్తున్నాం..
పెరిగిన ధరలు దృష్టిలో ఉంచుకొని రైతుబజార్లలో సబ్సిడీపై కిలో ఉల్లిపాయలు రూ.20కే అందిస్తున్నాం. నెల్లూరు, గూడూరు, కావలి రైతుబజార్లలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఒక్కో కుటుంబానికి 3 కిలోలు మాత్రమే. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు రైతు బజార్లలో విక్రయింస్తాం. -పి.అనితాకుమారి, ఏడీఎం, నెల్లూరు.