Panyala Jagannadha dasu
-
చాంద్ స.. రోషన్ చెహరా..
హైదరాబాదీ: షర్మిలా టాగోర్.. సత్యజిత్ రే ఆమెను పరిచయం చేయకపోయి ఉంటే, వెండితెర కచ్చితంగా ఒక వెలుగును కోల్పోయి ఉండేది. ఇటు బాలీవుడ్‌ను, అటు బెంగాలీ చిత్రసీమను వెలిగించిన ఆ వెలుగు పేరు షర్మిలా టాగోర్. ఆమె పుట్టింది హైదరాబాద్‌లోనే. అప్పట్లో ఆమె తండ్రి గీతీంద్రనాథ్ టాగోర్ ఈస్టిండియా కంపెనీ యాజమాన్యంలోని ఎల్గిన్ మిల్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేసేవారు. గీతీంద్రనాథ్ తాత గగనేంద్రనాథ్ టాగోర్ సుప్రసిద్ధ పెయింటర్. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్‌కు సమీప బంధువు కూడా. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన షర్మిలను సినీరంగంలోకి పంపడం ఆమె తల్లిదండ్రులకు పెద్దగా ఇష్టం లేదు. అయితే, సత్యజిత్ రే స్వయంగా అడగడంతో కాదనలేకపోయారు. అలా షర్మిలా పదిహేనేళ్ల ప్రాయంలోనే తెరంగేట్రం చేసింది. సత్యజిత్ రే బెంగాలీలో రూపొందించిన ‘అపూర్ సంసార్’ ఆమె తొలి చిత్రం. వరుసగా నాలుగు బెంగాలీ చిత్రాలు చేశాక, బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. వైవిధ్యభరితమైన కథానాయికగా దాదాపు రెండు దశాబ్దాలు బాలీవుడ్‌ను ఏలింది. నాటి తరానికి చెందిన దాదాపు అందరు హీరోల సరసనా నటించింది. ఉద్దండ దర్శకులందరి దర్శకత్వంలోనూ తన ప్రతిభను నిరూపించుకుంది. సప్నోంకీ రానీ... ‘ఆరాధన’ చిత్రంలో ‘మేరే సప్నోంకీ రానీ...’ అంటూ రాజేశ్ ఖన్నా హుషారుగా జీపులో రైలును వెంబడిస్తుంటే, రైలులో పుస్తకం చదువుకుంటూ మధ్య మధ్య ఓరచూపులు విసిరే షర్మిలా నటనకు నాటి యువతరం ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. శక్తి సామంతా దర్శకత్వంలో 1969లో విడుదలైన ఈ చిత్రం షర్మిలాకు ఉత్తమ నటిగా ‘ఫిలింఫేర్’ అవార్డు తెచ్చిపెట్టింది. ‘ఆరాధన’ విడుదలకు ఐదేళ్ల ముందే ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టింది. హిందీలో ఆమె తొలిచిత్రం... శక్తి సామంతా దర్శకత్వంలోని ‘కాశ్మీర్ కీ కలీ’. అందులో షమ్మీకపూర్ సరసన నటించి, అందరినీ ఆకట్టుకుంది. ‘యే చాంద్ స రోషన్ చెహరా...’ అంటూ షమ్మీకపూర్ మెలికలు తిరుగుతూ ముసిముసి నవ్వుల షర్మిలాను ‘తారీఫ్’ చేస్తే, ప్రేక్షకులూ ఆమెను తారీఫ్ చేశారు. అయితే, ‘ఆరాధన’ తర్వాతే ఆమె కెరీర్ ఊపందుకుంది. శక్తి సామంతా దర్శకత్వంలోనే ‘యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్’లో టూ పీస్ బికినీతో తెరపై కనిపించి, ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపింది. ఒక భారతీయ నటి టూ పీస్ బికినీతో తెరపై కనిపించడం అదే తొలిసారి. ఆమె బికినీ ఫొటోను ‘ఫిలింఫేర్’ కవర్‌పేజీపై ముద్రించడం అప్పట్లో పెద్ద సంచలనం. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు నటనకు ఆస్కారం ఉన్న ఉదాత్త పాత్రల్లోనూ రాణించింది. సినీ కెరీర్ ఊపందుకుంటున్న దశలోనే భారత జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీని 1969లో పెళ్లాడింది. మతం మారి, బేగం ఆయేషా సుల్తానాగా పేరు మార్చుకుంది. పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు గ్లామర్ తగ్గి, తెరమరుగవుతారు. షర్మిలా మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. పెళ్లి తర్వాత చాలా సూపర్‌హిట్ సినిమాల్లో నటించింది. ‘అమానుష్’, ‘అమర్‌ప్రేమ్’, ‘మౌసమ్’, ‘సఫర్’ వంటి చిత్రాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించి విమర్శకుల మన్ననలు పొందింది. ‘మౌసమ్’ చిత్రంలో నటనకు ఉత్తమనటిగా 1976లో జాతీయ అవార్డు సాధించింది. భారత ప్రభుత్వం గత ఏడాది ఆమెకు ‘పద్మభూషణ్’ అవార్డు ఇచ్చింది. సెన్సార్‌బోర్డు చైర్‌పర్సన్‌గా, యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా సేవలందించిన షర్మిలా టాగోర్, ఇప్పటికీ వయసుకు తగిన పాత్రల్లో రాణిస్తోంది. ఆమె కొడుకు సైఫ్ అలీఖాన్, కూతురు సోహా అలీఖాన్ సినీ రంగంలో రాణిస్తున్నారు. మరో కూతురు సాబా అలీఖాన్ జ్యుయలరీ డిజైనర్‌గా కొనసాగుతోంది. ‘పారో’ పాత్ర... నెరవేరని కల ఎన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషించినా, ‘పారో’ పాత్ర చేయలేకపోవడాన్ని షర్మిలా ఇప్పటికీ తీరని లోటుగానే భావిస్తుంది. ఆమె కెరీర్ ఉజ్వలంగా వెలుగుతున్న కాలంలో ‘దేవదాస్’ సినిమాను మళ్లీ తెరకెక్కించాలని దర్శక, రచయిత గుల్జార్ సంకల్పించాడు. ధర్మేంద్రను దేవదాసుగా, షర్మిలాను పారోగా (పార్వతి), హేమమాలినిని ‘చంద్రముఖి’గా పెట్టి తీయాలనుకున్నాడు. ఎందువల్లనో అది కార్యరూపం దాల్చలేదు. ‘పారో’ పాత్ర షర్మిలాకు నెరవేరని కలగానే మిగిలిపోయింది. - పన్యాల జగన్నాథదాసు -
గోల్కొండ లయన్.. హైదరాబాదీ అజిత్‌ఖాన్
‘సారా షెహర్ ముఝే లయన్ కే నామ్ సే జాన్తా హై’... మూడున్నర దశాబ్దాల కిందట బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన డైలాగ్ ఇది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘కాళీచరణ్’ సినిమాలో ఈ డైలాగ్ పలికిన విలన్ పాత్రధారి అజిత్‌ఖాన్. బాలీవుడ్లో ప్రాణ్ తర్వాత స్టైలిష్ విలన్‌గా ప్రేక్షకాదరణ పొందిన ఖ్యాతి అజిత్ ఖాన్‌కే దక్కుతుంది. అజిత్‌ఖాన్ అసలు పేరు హమీద్ అలీఖాన్. బాలీవుడ్లో వెలుగు వెలిగిన అజిత్ మన హైదరాబాదీనే. నిజాం జమానాలో చరిత్రాత్మకమైన గోల్కొండ ప్రాంతంలో 1922 జనవరి 27న పుట్టాడు. విద్యాభ్యాసమంతా వరంగల్‌లో సాగింది. అజిత్ తండ్రి బషీర్ అలీఖాన్ నిజాం సైన్యంలో పనిచేసే వారు. ఇంటి నుంచి పారిపోయి ముంబైకి... హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో అజిత్ నటనపై మక్కువతో ఇంటి నుంచి పారిపోయి ముంబై చేరుకున్నాడు. ప్రయాణ ఖర్చుల కోసం కాలేజీ పుస్తకాలను అమ్మేశాడు. ముంబైలో చాలా ప్రయత్నాలు చేశాక చివరకు 1946లో ‘షాహే మిశ్రా’లో గీతాబోస్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత సికందర్, హతిమ్తాయ్, ఆప్ బీతీ, సోనేకీ చిడియా, చందాకీ చాంద్నీ వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. హీరోగా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో నెమ్మదిగా విలన్ వేషాలు వేయడం ప్రారంభించాడు. తొలిసారిగా ‘సూరజ్’లో విలన్‌గా కనిపించాడు. బ్లాక్‌బస్టర్ చిత్రం ‘జంజీర్’లో విలన్ పాత్రకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ‘జంజీర్’తో అమితాబ్ బచ్చన్ హీరోగా నిలదొక్కుకుంటే, అజిత్ విలన్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. విలన్లకే విలన్... సినిమాల్లో అజిత్ స్టైలే వేరు. సాఫిస్టికేటెడ్ వేషధారణ, నెమ్మదిగా పలుకుతూనే, ఎదుటివారి వెన్నులో వణుకు పుట్టించేలా డైలాగులు పలికే తీరు అజిత్‌ను విలన్లకే విలన్‌గా నిలిపాయి. ముఖ్యంగా 70వ దశకంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో అజిత్ ఎక్కువగా విలన్ గ్యాంగ్ నాయకుడి పాత్రల్లోనే ప్రేక్షకులను అలరించాడు. అజిత్ గ్యాంగులో జీవన్, ప్రేమ్చోప్రా, రంజీత్, కాదర్ ఖాన్, సుజిత్ కుమార్ వంటి ఛోటా విలన్లు ఉండేవారు. సినిమాల్లో విలన్ అన్నాక వ్యాంప్ తప్పనిసరి. అజిత్ సినిమాల్లోనూ ఒక వ్యాంప్ పాత్రధారిణి ఉండేది. తరచూ వ్యాంప్ పాత్ర పేరు ‘మోనా’గానే ఉండేది. ‘కళాపోషణ’ సన్నివేశాల్లో ‘మోనా! డార్లింగ్...’ అంటూ అజిత్ గోముగా పలికే తీరు అప్పట్లో అభిమానులను విపరీతంగా ఆకట్టుకునేది. వందేళ్ల సినీచరిత్రలో విలన్ పాత్రలకు వన్నె తెచ్చిన వారిలో అజిత్ స్థానం ప్రత్యేకమైనది. ఈ బాలీవుడ్ ‘లయన్’ 1998 అక్టోబర్ 22న హైదరాబాద్‌లోనే కన్నుమూశాడు. మరణానికి మూడేళ్ల ముందు వరకు అంటే, 1995 వరకు సినిమాల్లో నటించాడు. - పన్యాల జగన్నాథదాసు -
పాటతోనే కిక్కు
పేరు: ఆనెం సాయిరాం చదువు: బీఎస్సీ, ఎంబీఏ వదులుకున్న ఉద్యోగం: ‘ధనుష్ ఇన్ఫోటెక్’ సేల్స్ విభాగం జాతీయ అధిపతి జీతభత్యాలు: నెలకు దాదాపు లక్ష రూపాయల నికర వేతనం. ఇతర సౌకర్యాలు, ప్రోత్సాహకాలు ఎందుకు వదిలేశాడంటే..: జేబు శాటిస్ఫాక్షన్ ఉన్నా, జాబులో కిక్కు లేదు. పైగా అభిరుచులకు ఆటంకంగా మారింది. అందుకే మూడేళ్ల కిందటే ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశాడు. అభిరుచులు: సంగీతం, సేవా కార్యక్రమాలు ఉద్యోగం వదిలేశాక: తెలుగులో ‘భజనామృతం’, ‘హరోం హర’ భక్తి ఆల్బంల విడుదల. హిందీలో ‘హరిఓం తత్సత్’ విడుదలకు సిద్ధంగా ఉంది. అభిరుచి మేరకు ఒకవైపు స్వరార్చనలో, మరోవైపు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవడం కోసం ఆకర్షణీయమైన కెరీర్‌ను సైతం తృణప్రాయంగా విడిచిపెట్టేసిన ఆనెం సాయిరాం పుట్టిపెరిగింది ఒడిశాలోని బరంపురంలో. చదువు సంధ్యలన్నీ అక్కడే సాగాయి. స్కూల్ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో విరివిగా పాడేవాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగపర్వంలో చాలా చోట్ల తిరిగాడు. ఉద్యోగ బాధ్యతల కారణంగా కొంతకాలం సంగీతానికి దూరమయ్యాడు. బెంగళూరులో పనిచేస్తుండగా పరిచయమైన ప్రముఖ గాయకుడు టీవీ హరిహరన్ ప్రోత్సాహంతో స్వరసాధనను మళ్లీ ప్రారంభించాడు. ఉద్యోగంలో భాగంగానే 2003లో హైదరాబాద్ చేరుకున్నాడు. అయినా, పూర్తిగా సంగీతానికి సమయం కేటాయించలేకపోతున్నాననే అసంతప్తి ఉండేది. అలాగే, సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని ఉన్నా, ఉద్యోగ బాధ్యతలతో సమయం చిక్కేది కాదు. పాత బోయిన్‌పల్లిలో స్థిరపడ్డ సాయిరాం... పూర్తి సమయం సంగీతానికి, సేవా కార్యక్రమాలకే అంకితం చేయాలనుకున్నాడు. అంతే... ఉద్యోగాన్ని వదిలేశాడు. సాయిరాం భజన మండలిని నెలకొల్పి, మనసుకు నచ్చిన విధంగా సంగీతంలో మునిగి తేలుతున్నాడు. భజన కార్యక్రమాలు, కచేరీలు, ఆల్బంల ద్వారా వచ్చిన ఆదాయంతో అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. భార్య యెర్ని (ఈశ్వరి) కూడా గాయని కావడంతో ఆమెతో పాటు మరికొందరు కొత్త గాయకులను కలుపుకొని ఇప్పటికే రెండు ఆల్బంలు విడుదల చేసి స్వరకల్పనలో సత్తా నిరూపించుకున్నాడు. తాజాగా హిందీలో ‘హరిఓం తత్సత్’ పేరిట మూడో ఆల్బం రూపొందిస్తున్నాడు. బహు భాషల్లో ఆల్బంలు రూపొందించడంతో పాటు కొత్త కళాకారులను ప్రోత్సహించడమే తన లక్ష్యమని సాయిరాం చెబుతున్నాడు. - పన్యాల జగన్నాథదాసు