పాటతోనే కిక్కు
పేరు: ఆనెం సాయిరాం
చదువు: బీఎస్సీ, ఎంబీఏ
వదులుకున్న ఉద్యోగం: ‘ధనుష్ ఇన్ఫోటెక్’ సేల్స్ విభాగం జాతీయ అధిపతి
జీతభత్యాలు: నెలకు దాదాపు లక్ష రూపాయల నికర వేతనం. ఇతర సౌకర్యాలు, ప్రోత్సాహకాలు
ఎందుకు వదిలేశాడంటే..: జేబు శాటిస్‌ఫాక్షన్ ఉన్నా, జాబులో కిక్కు లేదు. పైగా అభిరుచులకు ఆటంకంగా మారింది. అందుకే మూడేళ్ల కిందటే ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశాడు.
అభిరుచులు: సంగీతం, సేవా కార్యక్రమాలు
ఉద్యోగం వదిలేశాక: తెలుగులో ‘భజనామృతం’, ‘హరోం హర’ భక్తి ఆల్బంల విడుదల. హిందీలో
‘హరిఓం తత్సత్’ విడుదలకు సిద్ధంగా ఉంది.
అభిరుచి మేరకు ఒకవైపు స్వరార్చనలో, మరోవైపు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవడం కోసం ఆకర్షణీయమైన కెరీర్‌ను సైతం తృణప్రాయంగా విడిచిపెట్టేసిన ఆనెం సాయిరాం పుట్టిపెరిగింది ఒడిశాలోని బరంపురంలో. చదువు సంధ్యలన్నీ అక్కడే సాగాయి. స్కూల్ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో విరివిగా పాడేవాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగపర్వంలో చాలా చోట్ల తిరిగాడు. ఉద్యోగ బాధ్యతల కారణంగా కొంతకాలం సంగీతానికి దూరమయ్యాడు. బెంగళూరులో పనిచేస్తుండగా పరిచయమైన ప్రముఖ గాయకుడు టీవీ హరిహరన్ ప్రోత్సాహంతో స్వరసాధనను మళ్లీ ప్రారంభించాడు. ఉద్యోగంలో భాగంగానే 2003లో హైదరాబాద్ చేరుకున్నాడు. అయినా, పూర్తిగా సంగీతానికి సమయం కేటాయించలేకపోతున్నాననే అసంతప్తి ఉండేది.
అలాగే, సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని ఉన్నా, ఉద్యోగ బాధ్యతలతో సమయం చిక్కేది కాదు. పాత బోయిన్‌పల్లిలో స్థిరపడ్డ సాయిరాం... పూర్తి సమయం సంగీతానికి, సేవా కార్యక్రమాలకే అంకితం చేయాలనుకున్నాడు. అంతే... ఉద్యోగాన్ని వదిలేశాడు. సాయిరాం భజన మండలిని నెలకొల్పి, మనసుకు నచ్చిన విధంగా సంగీతంలో మునిగి తేలుతున్నాడు. భజన కార్యక్రమాలు, కచేరీలు, ఆల్బంల ద్వారా వచ్చిన ఆదాయంతో అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. భార్య యెర్ని (ఈశ్వరి) కూడా గాయని కావడంతో ఆమెతో పాటు మరికొందరు కొత్త గాయకులను కలుపుకొని ఇప్పటికే రెండు ఆల్బంలు విడుదల చేసి స్వరకల్పనలో సత్తా నిరూపించుకున్నాడు. తాజాగా హిందీలో ‘హరిఓం తత్సత్’ పేరిట మూడో ఆల్బం రూపొందిస్తున్నాడు. బహు భాషల్లో ఆల్బంలు రూపొందించడంతో పాటు కొత్త కళాకారులను ప్రోత్సహించడమే తన లక్ష్యమని సాయిరాం చెబుతున్నాడు.
- పన్యాల జగన్నాథదాసు