paraquat
-
విరుగుడు లేని విషం!
⇒కాగజ్‌నగర్‌కు చెందిన యువకుడు (35) కుటుంబ గొడవలతో గడ్డి మందు తాగాడు. చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లారు. అప్పటికే కిడ్నీలు దెబ్బతినడంతో ప్రత్యేక డయాలసిస్ చేశారు. అయినా పరిస్థితి విషమించి నాలుగు రోజుల్లోనే మృత్యువాత పడ్డాడు. ⇒ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన యువకుడు (21) స్నేహితుల మధ్య విభేదాలతో గడ్డి మందు తాగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. పరిస్థితి చేయి దాటిపోయింది. చికిత్స ప్రారంభించిన వైద్యులు ఆ యువకుడు బతకడం కష్టమని తేల్చి చెప్పారు. రెండు రోజులకే అతడి ప్రాణాలు పోయాయి.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పంట చేన్లలో కలుపు నివారణకు వాడే గడ్డి మందు మనుషుల ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకు రెండు, మూడు చోట్ల ‘పారాక్వాట్’ గడ్డి మందు తాగి మరణిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో ఈ మందును తాగిన వారిని కాపాడుకునేందుకు విరుగుడు కూడా లేక నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అత్యంత విషపూరితమైన ఈ మందును పొలాల్లో పిచికారీ చేసే సమయంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలు సమస్యలు వస్తున్నాయి. అది పర్యావరణానికి, జీవజాతులకూ ప్రమాదకరమని వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికిత్సకు లొంగని మందు! పారాక్వాట్ గడ్డి మందు కేవలం పది మిల్లీలీటర్లు (ఎంఎల్) శరీరంలోకి వెళ్లినా ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెప్తున్నారు. అది శ్వాస వ్యవస్థ, కిడ్నీలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని... గుండె, కాలేయం సహా అన్ని అవయవాలను దెబ్బతీస్తుందని అంటున్నారు. గత ఏడాది ఈ గడ్డిమందు తాగిన ఓ యువకుడికి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఊపిరితిత్తుల మారి్పడి చేయాల్సి వచి్చందని గుర్తు చేస్తున్నారు. చాలా క్రిమిసంహాకర మందులకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని.. వాటి తయారీ కంపెనీలే విరుగుడు ఫార్ములా ఇస్తుంటాయని చెబుతున్నారు. కానీ ఈ గడ్డి మందుకు మాత్రం ఇప్పటికీ సరైన విరుగుడు చికిత్స లేక.. ఎన్నో పేద, మధ్య తరగతి జీవితాలు అర్ధంతరంగా ముగుస్తున్నాయని పేర్కొంటున్నారు. ఏమిటీ పారాక్వాట్? పారాక్వాట్ డైక్లోరైడ్గా పిలిచే గడ్డిమందు వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఇది అత్యంత విషపూరితమైనా.. కూలీల కొరత ఓవైపు, సులువుగా కలుపు నివారణ అవుతుందనే ఉద్దేశంతో మరోవైపు రైతులు ఈ మందును వాడుతున్నారు. కేవలం రూ.200 ఖర్చుతో ఎకరం చేనులో కలుపు నివారణ చేయవచ్చని.. అధిక గాఢత కారణంగా 24 గంటల్లోనే మొక్కలు మాడిపోతాయని అంటున్నారు. పిచికారీ చేసే సమయంలోనూ తలనొప్పి, వికారం, ఒంటిపై దద్దుర్లు వస్తుంటాయని చెబుతున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు సరైన చికిత్స లేని ఈ మందు దుష్ప్రభావాలపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని గమనించిన కొందరు వైద్యులు ప్రభుత్వానికి విన్నవించేందుకు ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మంచిర్యాల పరిధిలోని ప్రతినిధులు పారాక్వాట్ తీవ్రతపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం ఇచ్చారు కూడా. పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పారాక్వాట్ తీవ్రతపై పరిశోధనలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఆత్మహత్య నిరోధక కమిటీలు ఈ మందు విషయంలో అవగాహన కలి్పస్తున్నాయి. తయారు చేసే దేశంలోనే ఆంక్షలు పారాక్వాట్‌ను చాలా దేశాలు నిషేధించాయి. ఈ మందు తయారీ కంపెనీ ఉన్న స్విట్జర్లాండ్‌లో, ఉత్పత్తి చేసే చైనాలోనూ ఆంక్షలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశాలోని బుర్లా జిల్లాలో రెండేళ్లలో 170 మంది వరకు ఈ గడ్డి మందు తాగి చనిపోవడంతో నిషేధించాలంటూ ఒత్తిళ్లు వచ్చాయి. అక్కడి సర్కారు పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలపై ఆంక్షలు విధించింది. కానీ రాష్ట్రాలకు 60రోజులు మాత్రమే అమ్మకాలను నిలిపేసే అధికారం ఉండటంతో.. శాశ్వతంగా నిషేధించాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాసింది. ఈ క్రమంలో కలుపు గడ్డి నివారణ కోసం మరో మందును ప్రత్యామ్నాయంగా చూపాలనే డిమాండ్లు వస్తున్నాయి. కిడ్నీలపై తీవ్ర ప్రభావం ఎవరైనా పారాక్వాట్ తాగిన వెంటనే ఆస్పత్రికి వస్తే బతికే చాన్స్ ఉంటుంది. కిడ్నీలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యేక డయాలసిస్ చేస్తాం. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే ప్రాణాలు కోల్పోయినట్టే. అందుకే ఈ మందు తీవ్రతను సర్కారుకు తెలియజేయాలని అనుకుంటున్నాం. – రాకేశ్ చెన్నా, నెఫ్రాలాజిస్టు, మంచిర్యాల నిషేధం విధించాలి గడ్డిమందుతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్దిమోతాదులో శరీరంలోకి వెళ్లినా బతకడం కష్టమవుతోంది. చికిత్సకు కూడా లొంగకుండా ఉన్న ఈ మందును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాలి. సమాజ శ్రేయస్సు కోసం కొంతమంది వైద్యులం కలసి ప్రభుత్వానికి నివేదించనున్నాం. – సతీశ్ నారాయణ చౌదరి, ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రాక్టిషనర్, ఖమ్మంచాలా కేసుల్లో మరణాలే.. పారాక్వాట్‌కు ఇప్పటికీ సరైన చికిత్స లేదు. మా వద్దకు వస్తున్న చాలా కేసుల్లో మరణాలే సంభవిస్తున్నాయి. ఈ మందు రోగి పెదవులు మొదలు శరీరంలో అన్ని అవయవాలను వేగంగా దెబ్బతిస్తుంది. తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం చాలా కష్టం. – ఆవునూరి పుష్పలత, అసిస్టెంట్ ప్రొఫెసర్, కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
యమ డేంజర్.. ఈ ‘కలుపు’ మందు
పొలాల్లో కలుపు తీయడానికి, దాన్ని నాశనం చేయడానికి ఉపయోగించే పారాక్వాట్ (డైపిరిడిలియం) అనే రసాయన పదార్థం ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఇంట్లో, పొలంలో ఈ రసాయనం అందుబాటులో ఉంటుండడంతో క్షణికావేశంలో తాగిన వారు నేరుగా మృత్యుఒడికి చేరుతున్నారు. దీనికి విరుగుడు చికిత్స లేకపోవడమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. దీని బారిన పడిన వారిలో ఏకంగా 99 శాతం మంది చనిపోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇప్పుడు ‘ఓపీ పాయిజన్’ కేసులు వస్తే వైద్యులు ముందుగా ‘పారాక్వాట్’ తీసుకున్నారా అని అడుగుతున్నారు. దాదాపు అన్ని పంట పొలాల్లో కలుపు తీయడానికి రైతులు దీన్ని వాడుతున్నారు. దీంతో ప్రతి రైతు ఇంట్లోనూ అందుబాటులో ఉంటోంది. క్షణికావేశానికి లోనైన వారు వెంటనే అందుబాటులో ఉన్న ఈ విషపూరిత ద్రావకం తాగి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ప్రస్తుతం ఈ మందు తాగిన వారు, పొలంలో దీన్ని పిచికారీ చేస్తూ విషప్రభావానికి లోనైన వారు అధికంగా చికిత్స కోసం వస్తున్నారు. ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాసుపత్రి)కే నెలకు 8 –10 కేసులు తగ్గకుండా వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపు మూడేళ్లుగా ఇదే పరిస్థితి. నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, పత్తికొండలోని ప్రభుత్వ ఆసుపత్రులకు సైతం నెలకు ఇద్దరు నుంచి ఐదుగురు విష ప్రభావానికి లోనై వస్తున్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులకు సైతం నెలకు 20– 30 మంది వస్తున్నారు. వీరిలో 99 శాతం మంది మృత్యువాత పడుతున్నారు. ఇప్పటిదాకా మరణించిన వారిలో కర్నూలు జిల్లాతో పాటు వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల వారూ ఉన్నారు. దీన్నిబట్టి ఆయా జిల్లాల్లోనూ అధికంగానే వాడుతున్నట్లు స్పష్టమవుతోంది. అనర్థం ఇలా... పారాక్వాట్ పిచికారీ చేసే సమయంలో విష ప్రభావం గాలి ద్వారాఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. మెల్లగా ఊపిరితిత్తులు నాశనమై..ప్రాణాలు పోతాయి. దీన్నే వైద్యపరిభాషలో ‘పారాక్విడ్ లంగ్’ అని పిలుస్తున్నారు. ఇది ఇంకా చర్మంపై పడటం, కంటి ద్వారానూ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ రసాయనిక మందును నోటి ద్వారా తీసుకుంటే నోరు, గొంతు, ఆహార వాహికలో కాలిన పుండ్లు ఏర్పడతాయి. ఆహార వాహికకు రంధ్రాలు కూడా పడొచ్చు. నోరు, గొంతునొప్పి రావడం, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, ఒక్కోసారి రక్తవిరేచనాలు అవుతాయి. ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, గుండె మెల్లగా పాడయిపోతాయి. కిడ్నీలకు జరిగే నష్టాన్ని వైద్యం ద్వారా కొంచెం వరకు తగ్గించకల్గినా, ఊపిరితిత్తులు, కాలేయం మాత్రం పూర్తిగా పాడై మనిషి చనిపోతున్నాడు. ఈ విషానికి విరుగుడు లేదు.. ‘ప్యారాక్వాట్’ విషపదార్థానికి ప్రపంచంలో ఎక్కడా విరుగుడు మందు లేదని వైద్యులు చెబుతున్నారు. దీని ప్రభావానికి లోనైన వారికి లక్షణాలను బట్టి మాత్రమే వైద్యం చేస్తారు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. దీంతో 99 శాతం మంది మరణిస్తున్నారు. పారాక్వాట్ బారిన పడకుండా ఉండాలంటే.. ♦ ఈ రసాయనాన్ని విక్రయించే వారు రైతులకు సరైన సమాచారం ఇవ్వాలి. దీనివల్ల కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి పూర్తిస్థాయిలో తెలియజేయాలి. ♦ పిల్లలకు, మానసిక స్థితి సరిగా లేని వారికి అందుబాటులో ఉంచకూడదు. ♦ పొలాల్లో పిచికారీ చేసే సమయంలో రక్షణ దుస్తులు, పరికరాలు (కళ్లద్దాలు, నోటికి గుడ్డ, చర్మంపై పడకుండా ప్లాస్టిక్ దుస్తులు ధరించడం) ఉపయోగించాలి. æ ఈ రసాయనం వల్ల నీరు (బావులు, చెరువులు, వంకలు, కుంటలు)తో పాటు ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్త వహించాలి. ♦ ఈ రసాయనాన్ని వాడిన తర్వాత చేతులు, శరీరం శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఖాళీ డబ్బాలు, సంచులను పొడి ప్రాంతంలో కాల్చి వేయాలి. తక్షణం ఏం చేయాలంటే.. ♦ మొదట శరీరంపై ఉన్న దుస్తులను తొలగించాలి. శరీరం మొత్తం శుభ్రమైన సబ్బు నీటితో 15 నిమిషాలు కడగాలి. కళ్లను కూడా శుభ్రమైన నీటితో 15 నిమిషాలు కడగాలి. దుస్తులు జాగ్రత్తగా, చేతికి తగలకుండా కత్తిరించి తీసేయాలి. తర్వాత వాటిని తగులబెట్టాలి. ♦ వీలైనంత త్వరగా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అది తాగితే బతకడం కష్టం పారాక్వాట్ అతి ప్రమాదకర రసాయనం. దీన్ని తాగితే బతకడం కష్టం. ఒడిశాలోని బుర్లా ప్రాంతంలో రెండేళ్ల వ్యవధిలోనే 177 మంది దీని బారిన పడ్డారు. వారిలో ముగ్గురు మాత్రమే బతికారు. 2019 సెప్టెంబర్‌లో అక్కడి వైద్యులు నిరసన తెలపడంతో ఒడిశా ప్రభుత్వం దీన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చింది. కేరళలో దీన్ని పూర్తిగా నిషేధించారు. అభివృద్ధి చెందిన 32 దేశాల్లోనూ, దీని జన్మస్థానమైన స్విట్జర్లాండ్‌లోనూ నిషేధం విధించారు. దీన్ని మన దేశంలో 25 రకాల పంటలకు వాడుతున్నారు. మన జిల్లాలోనూ దీని వాడకం పెరగడం ఆందోళన కల్గించే అంశం. దీన్ని కేవలం తొమ్మిది రకాల పంటలకు వాడాలని సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు, రిజిస్ట్రేషన్ కమిటీ పేర్కొన్నప్పటికీ అవగాహన లేమితో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. –డాక్టర్ రవికళాధర్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్, కర్నూలు కర్నూలు పెద్దాసుపత్రికి ప్రతి నెలా 8 నుంచి 10 మంది దాకా కర్నూలు, వైఎస్సార్ జిల్లా, అనంతపురం, తెలంగాణ జిల్లాల నుంచి పారాక్వాట్ మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసిన వారు, విష ప్రభావానికి గురైన వారు చికిత్స కోసం వస్తున్నారు. వారిని ఆసుపత్రిలోని ఏఎంసీ విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వచ్చిన వారిలో 99 శాతం మంది మృత్యువాత పడుతున్నారు. ఏఎంసీలో చికిత్స పొందుతూ గత నవంబర్‌లో వెంకటసుబ్బారెడ్డి, రుక్మిణి, చిట్టెమ్మ, డిసెంబర్లో ఆర్.ఆనంద్, మహమ్మద్ రఫి, జనవరిలో మహేశ్వరమ్మ, భరత్‌కుమార్, ఫిబ్రవరిలోఎన్.తనూజా చనిపోయారు. మరికొందరు ఏఎంసీ విభాగానికి రాకముందే క్యాజు వాలిటీకి వచ్చిన గంటలోపే మరణించారు. -
సాగు తీరు మారాలిక
నిజామాబాద్ వ్యవసాయం : ఆరు తడి పంటలు సాగు చేయుడం వల్ల అధిక విస్తీర్ణాన్ని సాగు చేయగలగటమే కాక ఎక్కువ లాభాన్ని కూడా పొందవచ్చు. రబీ కాలంలో వరికి బదులు గా ఆరుతడి పైర్లు సాగు వల్ల కలిగే ప్రయోజనాలు... వరి కన్నా ఆరుతడి పంటల సాగుకు అవసరమయ్యే నీరు, విద్యుత్ శక్తి, పెట్టుబడులు తక్కువ. ఒక ఎకరం వరి సాగుకు కావాల్సిన నీటితో కనీసం 2-8 ఎకరాల విస్తీర్ణంలో ఆరుతడి పైర్లను సాగు చేయవచ్చు. ఆరుతడి పైర్లు వేయడం వల్ల నిత్యావసరాలైన పప్పుదినుసులు, నూనె గింజల కొరత తగ్గుతుంది. పంట మార్పిడి వల్ల పైర్లను ఆశించే చీడపీడలు, తెగుళ్లు తగ్గుతాయి. పప్పు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల భూసారం వృద్ధి చెందుతుంది. {పస్తుతం మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుగుడు, ఆముదం పంటలను వరి కోసిన తర్వాత దుక్కి చేయకుండా ‘‘జీరోటిల్లేజి’’ విధానం ద్వారా విత్తే పద్ధతి వచ్చింది. వరి కోసిన తర్వాత దుబ్బులు మళ్లీ చిగురించకుండా ఉండేందుకు, అప్పటికే మొలచి ఉన్న కలుపును నివారించేందుకు ‘‘పారాక్వాట్’’ అనే కలుపు నివారణ మందును పిచికారి చేయాలి. లీటరు నీటికి 8 మి.లీ.ల కలుపు మందును(పారాక్వాట్) వరి దుబ్బులు, కలుపు మొక్కలు బాగా తడిసేలా పిచికారి చేయాలి. పారాక్వాట్ మందు వాడిన తర్వాత వెంటనే విత్తనాలు వేసుకోవచ్చు. భూమిలో సరైన తేమ ఉన్నట్లయితే వెంటనే విత్తుకోవాలి. లేదా పలుచని తడి ఇచ్చి విత్తుకోవాలి. లేదా విత్తే యంత్రాల సహాయంతో విత్తుకోవాలి. అవసరాన్ని బట్టి కలుపు నివారణ మందులను వాడాలి. మొక్కజొన్నలో అయితే అట్రజిన్ (లీటరు నీటికి 4-5 గ్రాములు) పొద్దుతిరుగుడు, శనగ, ఆముదం అయితే పెండిమిథాలిన్ (లీటరు నీటికి 5-6 మి.లీ.) కలుపు నివారణ మందులను విత్తిన 1-2 రోజులలోపు పిచికారి చేయాలి. రబీ కాలంలో వివిధ పంటలకు కావాల్సిన నీటి పరిమాణం, నీరు పెట్టడానికి ఖర్చయ్యే విద్యుత్చ్చక్తి యూనిట్లు, ఎకరం వరికి ఇచ్చే నీటితో సాగు చేయగలిగే ఆరుతడి పంటల విస్తీర్ణం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త వివరించారు.