‘పారాక్వాట్’ గడ్డి మందుతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు
క్షణికావేశంలో ఈ మందు తాగుతున్న రైతులు
ఏ చికిత్సకూ లొంగని ‘విషం’తో దక్కని ప్రాణాలు
రాష్ట్రంలో ఇటీవల పెరిగిన ‘పారాక్వాట్’ మరణాలు
పొలాల్లో పిచికారీ సమయంలోనూ ఆరోగ్య సమస్యలు
పర్యావరణానికి, జీవ జాతులకూ ప్రమాదకరం
నిషేధించాలంటున్న వైద్య నిపుణులు
⇒కాగజ్‌నగర్‌కు చెందిన యువకుడు (35) కుటుంబ గొడవలతో గడ్డి మందు తాగాడు. చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లారు. అప్పటికే కిడ్నీలు దెబ్బతినడంతో ప్రత్యేక డయాలసిస్ చేశారు. అయినా పరిస్థితి విషమించి నాలుగు రోజుల్లోనే మృత్యువాత పడ్డాడు.
⇒ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన యువకుడు (21) స్నేహితుల మధ్య విభేదాలతో గడ్డి మందు తాగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. పరిస్థితి చేయి దాటిపోయింది. చికిత్స ప్రారంభించిన వైద్యులు ఆ యువకుడు బతకడం కష్టమని తేల్చి చెప్పారు. రెండు రోజులకే అతడి ప్రాణాలు పోయాయి.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పంట చేన్లలో కలుపు నివారణకు వాడే గడ్డి మందు మనుషుల ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకు రెండు, మూడు చోట్ల ‘పారాక్వాట్’ గడ్డి మందు తాగి మరణిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో ఈ మందును తాగిన వారిని కాపాడుకునేందుకు విరుగుడు కూడా లేక నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అత్యంత విషపూరితమైన ఈ మందును పొలాల్లో పిచికారీ చేసే సమయంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలు సమస్యలు వస్తున్నాయి. అది పర్యావరణానికి, జీవజాతులకూ ప్రమాదకరమని వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చికిత్సకు లొంగని మందు!
పారాక్వాట్ గడ్డి మందు కేవలం పది మిల్లీలీటర్లు (ఎంఎల్) శరీరంలోకి వెళ్లినా ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెప్తున్నారు. అది శ్వాస వ్యవస్థ, కిడ్నీలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని... గుండె, కాలేయం సహా అన్ని అవయవాలను దెబ్బతీస్తుందని అంటున్నారు. గత ఏడాది ఈ గడ్డిమందు తాగిన ఓ యువకుడికి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఊపిరితిత్తుల మారి్పడి చేయాల్సి వచి్చందని గుర్తు చేస్తున్నారు. చాలా క్రిమిసంహాకర మందులకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని.. వాటి తయారీ కంపెనీలే విరుగుడు ఫార్ములా ఇస్తుంటాయని చెబుతున్నారు. కానీ ఈ గడ్డి మందుకు మాత్రం ఇప్పటికీ సరైన విరుగుడు చికిత్స లేక.. ఎన్నో పేద, మధ్య తరగతి జీవితాలు అర్ధంతరంగా ముగుస్తున్నాయని పేర్కొంటున్నారు.
ఏమిటీ పారాక్వాట్?
పారాక్వాట్ డైక్లోరైడ్‌గా పిలిచే గడ్డిమందు వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఇది అత్యంత విషపూరితమైనా.. కూలీల కొరత ఓవైపు, సులువుగా కలుపు నివారణ అవుతుందనే ఉద్దేశంతో మరోవైపు రైతులు ఈ మందును వాడుతున్నారు. కేవలం రూ.200 ఖర్చుతో ఎకరం చేనులో కలుపు నివారణ చేయవచ్చని.. అధిక గాఢత కారణంగా 24 గంటల్లోనే మొక్కలు మాడిపోతాయని అంటున్నారు. పిచికారీ చేసే సమయంలోనూ తలనొప్పి, వికారం, ఒంటిపై దద్దుర్లు వస్తుంటాయని చెబుతున్నారు.
ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు
సరైన చికిత్స లేని ఈ మందు దుష్ప్రభావాలపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని గమనించిన కొందరు వైద్యులు ప్రభుత్వానికి విన్నవించేందుకు ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మంచిర్యాల పరిధిలోని ప్రతినిధులు పారాక్వాట్ తీవ్రతపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం ఇచ్చారు కూడా. పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పారాక్వాట్ తీవ్రతపై పరిశోధనలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఆత్మహత్య నిరోధక కమిటీలు ఈ మందు విషయంలో అవగాహన కలి్పస్తున్నాయి.
తయారు చేసే దేశంలోనే ఆంక్షలు
పారాక్వాట్‌ను చాలా దేశాలు నిషేధించాయి. ఈ మందు తయారీ కంపెనీ ఉన్న స్విట్జర్లాండ్‌లో, ఉత్పత్తి చేసే చైనాలోనూ ఆంక్షలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశాలోని బుర్లా జిల్లాలో రెండేళ్లలో 170 మంది వరకు ఈ గడ్డి మందు తాగి చనిపోవడంతో నిషేధించాలంటూ ఒత్తిళ్లు వచ్చాయి. అక్కడి సర్కారు పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలపై ఆంక్షలు విధించింది. కానీ రాష్ట్రాలకు 60రోజులు మాత్రమే అమ్మకాలను నిలిపేసే అధికారం ఉండటంతో.. శాశ్వతంగా నిషేధించాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాసింది. ఈ క్రమంలో కలుపు గడ్డి నివారణ కోసం మరో మందును ప్రత్యామ్నాయంగా చూపాలనే డిమాండ్లు వస్తున్నాయి.
కిడ్నీలపై తీవ్ర ప్రభావం
ఎవరైనా పారాక్వాట్ తాగిన వెంటనే ఆస్పత్రికి వస్తే బతికే చాన్స్ ఉంటుంది. కిడ్నీలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యేక డయాలసిస్ చేస్తాం. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే ప్రాణాలు కోల్పోయినట్టే. అందుకే ఈ మందు తీవ్రతను సర్కారుకు తెలియజేయాలని అనుకుంటున్నాం. – రాకేశ్ చెన్నా, నెఫ్రాలాజిస్టు, మంచిర్యాల
నిషేధం విధించాలి
గడ్డిమందుతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్దిమోతాదులో శరీరంలోకి వెళ్లినా బతకడం కష్టమవుతోంది. చికిత్సకు కూడా లొంగకుండా ఉన్న ఈ మందును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాలి. సమాజ శ్రేయస్సు కోసం కొంతమంది వైద్యులం కలసి ప్రభుత్వానికి నివేదించనున్నాం. – సతీశ్ నారాయణ చౌదరి, ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రాక్టిషనర్, ఖమ్మం
చాలా కేసుల్లో మరణాలే..
పారాక్వాట్‌కు ఇప్పటికీ సరైన చికిత్స లేదు. మా వద్దకు వస్తున్న చాలా కేసుల్లో మరణాలే సంభవిస్తున్నాయి. ఈ మందు రోగి పెదవులు మొదలు శరీరంలో అన్ని అవయవాలను వేగంగా దెబ్బతిస్తుంది. తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం చాలా కష్టం. – ఆవునూరి పుష్పలత, అసిస్టెంట్ ప్రొఫెసర్, కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీ
Comments
Please login to add a commentAdd a comment