యమ డేంజర్‌.. ఈ ‘కలుపు’ మందు | Chemical substance Paraquat Danger For Human | Sakshi
Sakshi News home page

పారాక్వాట్‌..ప్రాణం ఫట్‌

Published Thu, Feb 20 2020 12:47 PM | Last Updated on Thu, Feb 20 2020 12:47 PM

Chemical substance Paraquat Danger For Human - Sakshi

పొలాల్లో కలుపు తీయడానికి, దాన్ని నాశనం చేయడానికి ఉపయోగించే పారాక్వాట్‌  (డైపిరిడిలియం) అనే రసాయన పదార్థం ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఇంట్లో, పొలంలో ఈ రసాయనం అందుబాటులో ఉంటుండడంతో క్షణికావేశంలో తాగిన వారు నేరుగా మృత్యుఒడికి చేరుతున్నారు. దీనికి విరుగుడు చికిత్స లేకపోవడమే ఇందుకు కారణమని వైద్యులు         చెబుతున్నారు. దీని బారిన పడిన వారిలో ఏకంగా 99 శాతం మంది చనిపోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇప్పుడు ‘ఓపీ పాయిజన్‌’ కేసులు వస్తే వైద్యులు ముందుగా ‘పారాక్వాట్‌’ తీసుకున్నారా అని అడుగుతున్నారు. దాదాపు అన్ని పంట పొలాల్లో కలుపు తీయడానికి రైతులు దీన్ని వాడుతున్నారు. దీంతో ప్రతి రైతు ఇంట్లోనూ అందుబాటులో ఉంటోంది. క్షణికావేశానికి లోనైన వారు వెంటనే అందుబాటులో ఉన్న ఈ విషపూరిత ద్రావకం తాగి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా  ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ప్రస్తుతం ఈ మందు తాగిన వారు, పొలంలో దీన్ని పిచికారీ చేస్తూ విషప్రభావానికి లోనైన వారు అధికంగా చికిత్స కోసం వస్తున్నారు. ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాసుపత్రి)కే నెలకు 8 –10 కేసులు తగ్గకుండా వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపు మూడేళ్లుగా ఇదే పరిస్థితి. నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, పత్తికొండలోని ప్రభుత్వ ఆసుపత్రులకు సైతం నెలకు ఇద్దరు నుంచి ఐదుగురు  విష ప్రభావానికి లోనై వస్తున్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులకు సైతం నెలకు 20– 30 మంది వస్తున్నారు. వీరిలో 99 శాతం మంది మృత్యువాత పడుతున్నారు. ఇప్పటిదాకా మరణించిన వారిలో కర్నూలు జిల్లాతో పాటు వైఎస్‌ఆర్‌ జిల్లా, అనంతపురం, మహబూబ్‌నగర్‌ జిల్లాల వారూ ఉన్నారు. దీన్నిబట్టి ఆయా జిల్లాల్లోనూ అధికంగానే వాడుతున్నట్లు స్పష్టమవుతోంది.

అనర్థం ఇలా...
పారాక్వాట్‌ పిచికారీ చేసే సమయంలో విష ప్రభావం గాలి ద్వారాఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. మెల్లగా ఊపిరితిత్తులు నాశనమై..ప్రాణాలు పోతాయి. దీన్నే వైద్యపరిభాషలో ‘పారాక్విడ్‌ లంగ్‌’ అని పిలుస్తున్నారు. ఇది ఇంకా చర్మంపై పడటం, కంటి ద్వారానూ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ రసాయనిక మందును నోటి ద్వారా తీసుకుంటే నోరు, గొంతు, ఆహార వాహికలో కాలిన పుండ్లు ఏర్పడతాయి. ఆహార వాహికకు రంధ్రాలు కూడా పడొచ్చు. నోరు, గొంతునొప్పి రావడం, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, ఒక్కోసారి రక్తవిరేచనాలు అవుతాయి. ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, గుండె మెల్లగా పాడయిపోతాయి. కిడ్నీలకు జరిగే నష్టాన్ని వైద్యం ద్వారా కొంచెం వరకు తగ్గించకల్గినా,  ఊపిరితిత్తులు, కాలేయం మాత్రం పూర్తిగా పాడై మనిషి చనిపోతున్నాడు. 

ఈ విషానికి విరుగుడు లేదు..
‘ప్యారాక్వాట్‌’ విషపదార్థానికి ప్రపంచంలో ఎక్కడా  విరుగుడు మందు లేదని వైద్యులు చెబుతున్నారు. దీని ప్రభావానికి లోనైన వారికి లక్షణాలను బట్టి మాత్రమే వైద్యం చేస్తారు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. దీంతో 99 శాతం మంది మరణిస్తున్నారు. 

పారాక్వాట్‌ బారిన పడకుండా ఉండాలంటే..
ఈ రసాయనాన్ని విక్రయించే వారు రైతులకు సరైన సమాచారం ఇవ్వాలి. దీనివల్ల కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి పూర్తిస్థాయిలో తెలియజేయాలి.  
పిల్లలకు, మానసిక స్థితి సరిగా లేని వారికి అందుబాటులో ఉంచకూడదు.
పొలాల్లో పిచికారీ చేసే సమయంలో రక్షణ దుస్తులు, పరికరాలు (కళ్లద్దాలు, నోటికి గుడ్డ, చర్మంపై పడకుండా ప్లాస్టిక్‌ దుస్తులు ధరించడం) ఉపయోగించాలి. æ ఈ రసాయనం వల్ల నీరు (బావులు, చెరువులు, వంకలు, కుంటలు)తో పాటు ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్త వహించాలి.
 ఈ రసాయనాన్ని వాడిన తర్వాత చేతులు, శరీరం శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఖాళీ డబ్బాలు, సంచులను పొడి ప్రాంతంలో కాల్చి వేయాలి.

తక్షణం ఏం చేయాలంటే..
మొదట శరీరంపై ఉన్న దుస్తులను తొలగించాలి. శరీరం మొత్తం శుభ్రమైన సబ్బు నీటితో 15 నిమిషాలు కడగాలి. కళ్లను కూడా శుభ్రమైన నీటితో 15 నిమిషాలు కడగాలి. దుస్తులు జాగ్రత్తగా, చేతికి తగలకుండా కత్తిరించి తీసేయాలి. తర్వాత వాటిని తగులబెట్టాలి.  
వీలైనంత త్వరగా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

అది తాగితే బతకడం కష్టం
పారాక్వాట్‌ అతి ప్రమాదకర రసాయనం. దీన్ని తాగితే బతకడం కష్టం. ఒడిశాలోని బుర్లా ప్రాంతంలో  రెండేళ్ల వ్యవధిలోనే 177 మంది దీని బారిన పడ్డారు. వారిలో ముగ్గురు మాత్రమే బతికారు. 2019 సెప్టెంబర్‌లో అక్కడి వైద్యులు నిరసన తెలపడంతో ఒడిశా ప్రభుత్వం దీన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చింది. కేరళలో దీన్ని పూర్తిగా నిషేధించారు. అభివృద్ధి చెందిన 32 దేశాల్లోనూ, దీని జన్మస్థానమైన స్విట్జర్లాండ్‌లోనూ నిషేధం విధించారు. దీన్ని మన దేశంలో 25 రకాల పంటలకు వాడుతున్నారు. మన జిల్లాలోనూ దీని వాడకం పెరగడం ఆందోళన కల్గించే అంశం. దీన్ని కేవలం తొమ్మిది రకాల పంటలకు  వాడాలని సెంట్రల్‌ ఇన్‌సెక్టిసైడ్‌ బోర్డు, రిజిస్ట్రేషన్‌ కమిటీ పేర్కొన్నప్పటికీ అవగాహన లేమితో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు.   –డాక్టర్‌ రవికళాధర్‌రెడ్డి, జనరల్‌ ఫిజీషియన్, కర్నూలు

కర్నూలు పెద్దాసుపత్రికి ప్రతి నెలా 8 నుంచి 10 మంది దాకా కర్నూలు, వైఎస్సార్‌ జిల్లా, అనంతపురం, తెలంగాణ జిల్లాల నుంచి పారాక్వాట్‌ మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసిన వారు, విష ప్రభావానికి గురైన వారు చికిత్స కోసం వస్తున్నారు. వారిని ఆసుపత్రిలోని ఏఎంసీ విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వచ్చిన వారిలో 99 శాతం మంది మృత్యువాత పడుతున్నారు. ఏఎంసీలో చికిత్స పొందుతూ గత నవంబర్‌లో వెంకటసుబ్బారెడ్డి, రుక్మిణి, చిట్టెమ్మ, డిసెంబర్‌లో ఆర్‌.ఆనంద్, మహమ్మద్‌ రఫి, జనవరిలో మహేశ్వరమ్మ, భరత్‌కుమార్, ఫిబ్రవరిలోఎన్‌.తనూజా చనిపోయారు. మరికొందరు ఏఎంసీ విభాగానికి రాకముందే క్యాజు వాలిటీకి వచ్చిన గంటలోపే మరణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement