paritala sreeram
-
దిగజారుతున్న టీడీపీ గ్రాఫ్.. 'పరిటాల' ఓవరాక్షన్‌కు బ్రేక్..!
సాక్షి, అనంతపురం: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష టీడీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు విభేదాలతో తమ్ముళ్లు బాహాబాహీకి దిగుతున్నారు. ఎవరికి వారు గ్రూపులుగా ఏర్పడి వేరు కుంపట్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతున్న వారిని బరిలో దింపితే సహకరించే ప్రసక్తే లేదని ప్రతి నియోజకవర్గంలోనూ వ్యతిరేక వర్గం తేల్చి చెబుతోంది. దీంతో ఎవరిని పోటీలో నిలపాలో తెలియక టీడీపీ పెద్దలు నానా తంటాలు పడుతున్నారు. దిగజారుతున్న టీడీపీ గ్రాఫ్.. టీడీపీ పెద్దలు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థిపై ఇప్పటికే పలు కోణాల్లో రహస్యంగా సర్వేలు చేసినట్లు సమాచారం. అయినా ఎక్కడా అనుకున్న ఫలితం రానట్లు తెలుస్తోంది. మరోవైపు ఫ్లెక్సీల ఏర్పాటు నుంచి ప్రతి విషయంలో పబ్లిసిటీ పిచ్చితో ‘తమ్ముళ్ల’ మధ్య వివాదం రాజుకుంటుండగా టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ తగ్గుతోంది. కదిరి, పెనుకొండ, ధర్మవరం, మడకశిర, పుట్టపర్తిలో ఇదే తంతు కొనసాగుతోంది. వర్గ విభేదాలతో పాటు కుల ప్రస్తావన, పెత్తందారీ వ్యవస్థ కారణంగా టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఉన్న ఒక్క సీటు (హిందూపురం) కూడా ఈసారి గెలుస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. రెండు (అనంతపురం, శ్రీసత్యసాయి) జిల్లాల్లో భాగంగా ఉన్న రాప్తాడులో అధికంగా బీసీ ఓటర్లు వైఎస్సార్సీపీ మొగ్గు చూపుతున్నారు. దీంతో అక్కడ ‘పరిటాల’ కుటుంబానికి ఈసారి కూడా ఓటమి తప్పేలా లేదు. పెనుకొండలో కురు‘బల పోరు’ టీడీపీకి 1994 నుంచి అనుకూలంగా ఉన్న పెనుకొండలో 2019లో భిన్న ఫలితాలు వచ్చాయి. ఈసారి కూడా అదే ఊపు కొనసాగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మూడోసారి ఓడిపోయిన బీకే పార్థసారథి పోటీకి ముందుకు రావడం లేదని సమాచారం. మరోవైపు బీకే పార్థసారథి సామాజిక వర్గానికి చెందిన సవితమ్మ బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ బీకే పార్థకు తెలియకుండా.. కార్యక్రమాలు చేయడం విభేదాలకు ఆజ్యం పోసినట్లు అవుతోంది. అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపినా మరో వర్గం పని చేయదనే క్లారిటీ ఉండటంతో పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. కదిరిలో కుల రాజకీయం.. గత నాలుగు ఎన్నికలను పరిశీలిస్తే కదిరిలో టీడీపీ ఒకసారి మాత్రమే గెలిచింది. అయినా.. ఇక్కడ కుల రాజకీయం మాత్రం తగ్గలేదు. ముస్లిం ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ.. పరిటాల కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కందికుంట వెంకట ప్రసాద్‌కు పగ్గాలు ఇవ్వడంతో చాలామంది తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ముస్లిం ఓటర్లు వ్యతిరేకిస్తే గెలవడం కష్టమన్న భావనలో కందికుంట వెంకట ప్రసాద్ ఉన్నారు. మరోవైపు నకిలీ డీడీల కుంభకోణం కేసుసైతం అతన్ని వెన్నాడుతోంది. ఈ నేపథ్యంలోనే పోటీ చేయాలా, వద్దా అనే సందేహంలో పడ్డారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు అత్తార్ చాంద్‌బాషా ప్రయత్నిస్తున్నారు. పుట్టపర్తిలో ఇంటిగోల.. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. సొంత పార్టీ నేతలు వడ్డే వెంకట్, మల్లెల జయరామ్, పెదరాసు సుబ్రమణ్యం, పీసీ గంగన్న...ఇలా ఎవరికి వారుగా పల్లె రఘునాథరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ‘‘ఈ సారి పరిస్థితి బాగోలేదు.. వద్దులే నాన్న’’ అని ఆయన తనయుడు సూచించినట్లు సమాచారం. దీంతో సొంత కులం, సొంత ఇల్లు, సొంత పార్టీ నుంచి వ్యతిరేకత రావడంతో పల్లె రఘునాథరెడ్డి కూడా పునరాలోచనలో పడినట్లు సమాచారం. ‘పరిటాల’ ఓవరాక్షన్‌కు బ్రేక్.. రాప్తాడు, ధర్మవరంలో ‘పరిటాల’ కుటుంబ పెత్తనం ఎక్కువైంది. రాప్తాడులో ఓటమితో పరిటాల శ్రీరామ్ ఈసారి ధర్మవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నా...పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. అక్కడ శ్రీరామ్‌కు సొంత సామాజిక వర్గానికి చెందిన వరదాపురం సూరి నుంచి రాజకీయంగా ప్రమాదం పొంచి ఉంది. కాగా.. రాప్తాడు ఇన్చార్జ్గా ఉన్న సునీతను కాదని.. శ్రీరామ్ అక్కడి నుంచే బరిలో దిగుతారనే ప్రచారం మరోవైపు సాగుతోంది. దీంతో పరిటాల కుటుంబానికి మరోసారి పరాభవం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మడకశిరలో పెత్తందారీ వ్యవస్థ.. ఎస్సీలకు రిజర్వు చేసిన మడకశిర నియోజకవర్గంలోనూ పెత్తందారు గుండుమల తిప్పేస్వామికి పెత్తనం ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్నను ప్రతి సందర్భంలోనూ గుండుమల అవమానిస్తూ వస్తున్నారు. ఈరన్నకు కాకుండా మరెవరికై నా టికెట్ ఇప్పించాలని గుండుమల ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎస్సీ వర్గమంతా అధిష్టానంపై గుర్రుగా ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రెండు – మూడు గ్రూపులుగా విడిపోయారు. ఎవరు పోటీ చేసినా.. సమన్వయం చేసుకోవడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఫలితంగా ఏ వర్గం బరిలో దిగినా.. ఓడించాలనే ఉద్దేశంతో మిగతా వర్గాలు నిప్పు రాజేస్తున్నాయి. హిందూపురంలోనూ మారని తీరు.. సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే హోదాలో చుట్టపుచూపుగా హిందూపురం వస్తుంటారు. ఈసారి పోటీ చేస్తారో, లేదో తెలీదు. నారా లోకేశ్ హిందూపురం వస్తారనే ప్రచారం సాగుతోంది. స్థానికంగా నాయకత్వం లేక.. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారుగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఫలితంగా ఓ వర్గం ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తే మారోవర్గం వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడ ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయమని టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. ఇవి చదవండి: అది చంద్రబాబు మనస్తత్వం.. వాళ్ల అరాచకం ఇలాగే ఉంటుంది: మంత్రి అంబటి ఫైర్ -
మహాతల్లి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా..? పరిటాల సునీతకి కౌంటర్
-
మంత్రి పరిటాల సునీత దాష్టీకం
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సహకరించని వారిని మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ టార్గెట్ చేశారు. మంత్రి అండతో చెన్నెకొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామంలో పరిటాల వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ రోజున వైఎస్సార్ సీపీకి ఎందుకు ఓట్లు వేశారంటూ రాడ్లు, కర్రలతో దాడి చేశారు.ఈ సంఘటనలో నలుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దాడులు చేసిన వారిలో ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే దాడికి పాల్పడ్డ పరిటాల వర్గీయులను వదిలివేయాలంటూ మంత్రి పరిటాల సునీత... ఎస్ఐ రఫీకి ఫోన్ కాల్ చేశారు. మంత్రి ఆదేశాలతో దాడి చేసినవారిని ఎస్ఐ వదిలివేయడంతో పాటు, పోలీసులు ఓ వర్గంవారికే వత్తాసు పలుకుతున్నారంటూ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఆదేశాలతోనే దాడులు చేశామని నిందితులు చెబుతున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఎన్ఎస్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. -
'అమ్మ ఓడిపోతే మీ అంతు చూస్తా'
అనంతపురం : ‘ఈ ఎన్నికల్లో అమ్మను గెలిపించాలి.. అమ్మ గెలవాలి.. ఓడిపోతే మీ అంతు చూస్తా.. గ్రామాలను తగులబెడతానంటూ' రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు. పోలీసుల సమక్షంలోనే ఆయన ప్రజల్ని ఈ తరహాలో బెదిరిస్తున్నాడు. గురువారం యర్రగుంట గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... పరిటాల సునీత తరఫున ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ రాప్తాడు మండలంలోని బుక్కచెర్ల, జీ,కోత్తపల్లి, గాండ్లపర్తి, యర్రగుంట, బండమీదపల్లి, తదితర గ్రామాల్లో గురువారం ప్రచారం చేశాడు. ఈ క్రమంలో తన తల్లిని గెలిపించేందుకు ఆయన అనేక జిమ్మిక్కులు చేస్తున్నాడు. అందులో భాగంగానే గత 21న చెన్నేకొత్తపల్లి మండలంలో ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తుండగా పరిటాల శ్రీరామ్ వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. వాటిలో అనుమతి లేని రెండు వాహనాల్లో మారణాయుధాలు, నంబర్ ప్లేట్లు, వాకీటాకీలు, మందు బాటిళ్లు బయట పడిన విషయం తెలిసిందే. ఆ వాహనాల్లోనే తగరకుంట కొండారెడ్డి హత్య కేసులో నిందితుడు తరగకుంట విజయ్‌కుమార్ పాటు కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, మరో ఇద్దరు నిందితులు ఆ రోజు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. ఆ రెండు వాహనాలను సీజ్ చేసి చెన్నేకొత్తపల్లి స్టేషన్‌కు తరలించారు. ఆ సంఘటను మరువక ముందే గత నెల 30న కనగానపల్లి మండలంలోని ఎలకుంట్ల గ్రామంలో ప్రచారానికి వెళ్లిన పరిటాల శ్రీరామ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న ఏడుగురిపై రాళ్ల వర్షం కురిపించి తీవ్రంగా గాయపరిచాడు. మళ్లీ గురువారం ఆయన రాప్తాడు మండలంలో కూడా దాదాపుగా 50 వాహనాలు, 200 ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వెళ్లి గ్రామాల్లో నానాహంగామా సృష్టించాడు. రానున్నది టీడీపీ పార్టీయేనని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సహకరించే వారి అంతు చూస్తామంటూ పలు గ్రామాల ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. అమ్మ ఎన్నికల్లో గెలవాలని, ఒకవేళ ఓడిపోతే గ్రామాల్లో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను ఉచకోత కోస్తానని బెదిరించాడు. అమ్మ ఎన్నికల్లో గెలిస్తే.. ప్రభుత్వం వస్తే అమ్మకు మంత్రి పదవి దక్కుతుందని, మంత్రి అయిన వెంటనే నియోజకవర్గంలోని 6 మండలాల్లోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను గ్రామాల్లో నుంచి బయటకు గెంటి వేస్తామని బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై యర్రగుంట గ్రామస్తులు కొందరు సీఐ, ఎస్సై, ఆర్వోకు ఫిర్యాదు చేసినా, వారు కూడా టీడీపీ నాయకులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎన్నికల ముందే ఆయన ఇలా హంగామా సృష్టిస్తే, ఎన్నికల్లో గెలినట్లయితే పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని పలు గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.