దిగజారుతున్న టీడీపీ గ్రాఫ్‌.. 'పరిటాల' ఓవరాక్షన్‌కు బ్రేక్‌..! | - | Sakshi
Sakshi News home page

దిగజారుతున్న టీడీపీ గ్రాఫ్‌.. 'పరిటాల' ఓవరాక్షన్‌కు బ్రేక్‌..!

Published Tue, Jan 2 2024 12:10 AM | Last Updated on Tue, Jan 2 2024 12:19 PM

- - Sakshi

సాక్షి, అనంతపురం: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష టీడీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు విభేదాలతో తమ్ముళ్లు బాహాబాహీకి దిగుతున్నారు. ఎవరికి వారు గ్రూపులుగా ఏర్పడి వేరు కుంపట్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతున్న వారిని బరిలో దింపితే సహకరించే ప్రసక్తే లేదని ప్రతి నియోజకవర్గంలోనూ వ్యతిరేక వర్గం తేల్చి చెబుతోంది. దీంతో ఎవరిని పోటీలో నిలపాలో తెలియక టీడీపీ పెద్దలు నానా తంటాలు పడుతున్నారు.

దిగజారుతున్న టీడీపీ గ్రాఫ్‌..
టీడీపీ పెద్దలు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థిపై ఇప్పటికే పలు కోణాల్లో రహస్యంగా సర్వేలు చేసినట్లు సమాచారం. అయినా ఎక్కడా అనుకున్న ఫలితం రానట్లు తెలుస్తోంది. మరోవైపు ఫ్లెక్సీల ఏర్పాటు నుంచి ప్రతి విషయంలో పబ్లిసిటీ పిచ్చితో ‘తమ్ముళ్ల’ మధ్య వివాదం రాజుకుంటుండగా టీడీపీ గ్రాఫ్‌ రోజురోజుకూ తగ్గుతోంది. కదిరి, పెనుకొండ, ధర్మవరం, మడకశిర, పుట్టపర్తిలో ఇదే తంతు కొనసాగుతోంది. వర్గ విభేదాలతో పాటు కుల ప్రస్తావన, పెత్తందారీ వ్యవస్థ కారణంగా టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఉన్న ఒక్క సీటు (హిందూపురం) కూడా ఈసారి గెలుస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. రెండు (అనంతపురం, శ్రీసత్యసాయి) జిల్లాల్లో భాగంగా ఉన్న రాప్తాడులో అధికంగా బీసీ ఓటర్లు వైఎస్సార్‌సీపీ మొగ్గు చూపుతున్నారు. దీంతో అక్కడ ‘పరిటాల’ కుటుంబానికి ఈసారి కూడా ఓటమి తప్పేలా లేదు.

పెనుకొండలో కురు‘బల పోరు’
టీడీపీకి 1994 నుంచి అనుకూలంగా ఉన్న పెనుకొండలో 2019లో భిన్న ఫలితాలు వచ్చాయి. ఈసారి కూడా అదే ఊపు కొనసాగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మూడోసారి ఓడిపోయిన బీకే పార్థసారథి పోటీకి ముందుకు రావడం లేదని సమాచారం. మరోవైపు బీకే పార్థసారథి సామాజిక వర్గానికి చెందిన సవితమ్మ బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బీకే పార్థకు తెలియకుండా.. కార్యక్రమాలు చేయడం విభేదాలకు ఆజ్యం పోసినట్లు అవుతోంది. అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపినా మరో వర్గం పని చేయదనే క్లారిటీ ఉండటంతో పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది.

కదిరిలో కుల రాజకీయం..
గత నాలుగు ఎన్నికలను పరిశీలిస్తే కదిరిలో టీడీపీ ఒకసారి మాత్రమే గెలిచింది. అయినా.. ఇక్కడ కుల రాజకీయం మాత్రం తగ్గలేదు. ముస్లిం ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ.. పరిటాల కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కందికుంట వెంకట ప్రసాద్‌కు పగ్గాలు ఇవ్వడంతో చాలామంది తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ముస్లిం ఓటర్లు వ్యతిరేకిస్తే గెలవడం కష్టమన్న భావనలో కందికుంట వెంకట ప్రసాద్‌ ఉన్నారు. మరోవైపు నకిలీ డీడీల కుంభకోణం కేసుసైతం అతన్ని వెన్నాడుతోంది. ఈ నేపథ్యంలోనే పోటీ చేయాలా, వద్దా అనే సందేహంలో పడ్డారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు అత్తార్‌ చాంద్‌బాషా ప్రయత్నిస్తున్నారు.

పుట్టపర్తిలో ఇంటిగోల..
పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. సొంత పార్టీ నేతలు వడ్డే వెంకట్‌, మల్లెల జయరామ్‌, పెదరాసు సుబ్రమణ్యం, పీసీ గంగన్న...ఇలా ఎవరికి వారుగా పల్లె రఘునాథరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ‘‘ఈ సారి పరిస్థితి బాగోలేదు.. వద్దులే నాన్న’’ అని ఆయన తనయుడు సూచించినట్లు సమాచారం. దీంతో సొంత కులం, సొంత ఇల్లు, సొంత పార్టీ నుంచి వ్యతిరేకత రావడంతో పల్లె రఘునాథరెడ్డి కూడా పునరాలోచనలో పడినట్లు సమాచారం.

‘పరిటాల’ ఓవరాక్షన్‌కు బ్రేక్‌..
రాప్తాడు, ధర్మవరంలో ‘పరిటాల’ కుటుంబ పెత్తనం ఎక్కువైంది. రాప్తాడులో ఓటమితో పరిటాల శ్రీరామ్‌ ఈసారి ధర్మవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నా...పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. అక్కడ శ్రీరామ్‌కు సొంత సామాజిక వర్గానికి చెందిన వరదాపురం సూరి నుంచి రాజకీయంగా ప్రమాదం పొంచి ఉంది. కాగా.. రాప్తాడు ఇన్‌చార్జ్‌గా ఉన్న సునీతను కాదని.. శ్రీరామ్‌ అక్కడి నుంచే బరిలో దిగుతారనే ప్రచారం మరోవైపు సాగుతోంది. దీంతో పరిటాల కుటుంబానికి మరోసారి పరాభవం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మడకశిరలో పెత్తందారీ వ్యవస్థ..
ఎస్సీలకు రిజర్వు చేసిన మడకశిర నియోజకవర్గంలోనూ పెత్తందారు గుండుమల తిప్పేస్వామికి పెత్తనం ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్నను ప్రతి సందర్భంలోనూ గుండుమల అవమానిస్తూ వస్తున్నారు. ఈరన్నకు కాకుండా మరెవరికై నా టికెట్‌ ఇప్పించాలని గుండుమల ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎస్సీ వర్గమంతా అధిష్టానంపై గుర్రుగా ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రెండు – మూడు గ్రూపులుగా విడిపోయారు. ఎవరు పోటీ చేసినా.. సమన్వయం చేసుకోవడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఫలితంగా ఏ వర్గం బరిలో దిగినా.. ఓడించాలనే ఉద్దేశంతో మిగతా వర్గాలు నిప్పు రాజేస్తున్నాయి.

హిందూపురంలోనూ మారని తీరు..
సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే హోదాలో చుట్టపుచూపుగా హిందూపురం వస్తుంటారు. ఈసారి పోటీ చేస్తారో, లేదో తెలీదు. నారా లోకేశ్‌ హిందూపురం వస్తారనే ప్రచారం సాగుతోంది. స్థానికంగా నాయకత్వం లేక.. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారుగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఫలితంగా ఓ వర్గం ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తే మారోవర్గం వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడ ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయమని టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు.

ఇవి చ‌ద‌వండి: అది చంద్రబాబు మనస్తత్వం.. వాళ్ల అరాచకం ఇలాగే ఉంటుంది: మంత్రి అంబటి ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement