'అమ్మ ఓడిపోతే మీ అంతు చూస్తా'
అనంతపురం : ‘ఈ ఎన్నికల్లో అమ్మను గెలిపించాలి.. అమ్మ గెలవాలి.. ఓడిపోతే మీ అంతు చూస్తా.. గ్రామాలను తగులబెడతానంటూ' రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు. పోలీసుల సమక్షంలోనే ఆయన ప్రజల్ని ఈ తరహాలో బెదిరిస్తున్నాడు. గురువారం యర్రగుంట గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే... పరిటాల సునీత తరఫున ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ రాప్తాడు మండలంలోని బుక్కచెర్ల, జీ,కోత్తపల్లి, గాండ్లపర్తి, యర్రగుంట, బండమీదపల్లి, తదితర గ్రామాల్లో గురువారం ప్రచారం చేశాడు. ఈ క్రమంలో తన తల్లిని గెలిపించేందుకు ఆయన అనేక జిమ్మిక్కులు చేస్తున్నాడు. అందులో భాగంగానే గత 21న చెన్నేకొత్తపల్లి మండలంలో ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తుండగా పరిటాల శ్రీరామ్ వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. వాటిలో అనుమతి లేని రెండు వాహనాల్లో మారణాయుధాలు, నంబర్ ప్లేట్లు, వాకీటాకీలు, మందు బాటిళ్లు బయట పడిన విషయం తెలిసిందే.
ఆ వాహనాల్లోనే తగరకుంట కొండారెడ్డి హత్య కేసులో నిందితుడు తరగకుంట విజయ్‌కుమార్ పాటు కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, మరో ఇద్దరు నిందితులు ఆ రోజు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. ఆ రెండు వాహనాలను సీజ్ చేసి చెన్నేకొత్తపల్లి స్టేషన్‌కు తరలించారు. ఆ సంఘటను మరువక ముందే గత నెల 30న కనగానపల్లి మండలంలోని ఎలకుంట్ల గ్రామంలో ప్రచారానికి వెళ్లిన పరిటాల శ్రీరామ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న ఏడుగురిపై రాళ్ల వర్షం కురిపించి తీవ్రంగా గాయపరిచాడు. మళ్లీ గురువారం ఆయన రాప్తాడు మండలంలో కూడా దాదాపుగా 50 వాహనాలు, 200 ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వెళ్లి గ్రామాల్లో నానాహంగామా సృష్టించాడు.
రానున్నది టీడీపీ పార్టీయేనని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సహకరించే వారి అంతు చూస్తామంటూ పలు గ్రామాల ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. అమ్మ ఎన్నికల్లో గెలవాలని, ఒకవేళ ఓడిపోతే గ్రామాల్లో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను ఉచకోత కోస్తానని బెదిరించాడు. అమ్మ ఎన్నికల్లో గెలిస్తే.. ప్రభుత్వం వస్తే అమ్మకు మంత్రి పదవి దక్కుతుందని, మంత్రి అయిన వెంటనే నియోజకవర్గంలోని 6 మండలాల్లోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను గ్రామాల్లో నుంచి బయటకు గెంటి వేస్తామని బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ విషయంపై యర్రగుంట గ్రామస్తులు కొందరు సీఐ, ఎస్సై, ఆర్వోకు ఫిర్యాదు చేసినా, వారు కూడా టీడీపీ నాయకులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎన్నికల ముందే ఆయన ఇలా హంగామా సృష్టిస్తే, ఎన్నికల్లో గెలినట్లయితే పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని పలు గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.