తండ్రి బాటలో పరిటాల శ్రీరాం
దివంగత టీడీపీ నాయకులు పరిటాల రవి తనయుడు శ్రీరాం తండ్రి బాటలోనే పయనిస్తున్నట్టు కనబడుతున్నాడు. గతంలో ప్రత్యర్థి హత్యకు కుట్రపన్నిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అతడు తాజాగా మరో వివాదంలో ఇరుకున్నాడు. అనంతపురంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు చిరునామాగా మారిన పరిటాల రవి తర్వాత రాజకీయాల్లో చేరి ప్రత్యర్థులను అణగదొక్కారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అరాచకాలు సృష్టించారు. టీడీపీతో అండతో తన శత్రువులను అడ్రస్ లేకుండా చేశారు. ఈ క్రమంలో 2005లో ప్రత్యర్థుల చేతిలో పరిటాల రవి హత్యకు గురయ్యారు.
తండ్రి మరణంతో వెలుగులోకి వచ్చిన శ్రీరాం ఫ్యాక్షన్ దారిలో ముందుకు వెళుతున్నట్టు భావిస్తున్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి హత్యకు కుట్రపన్నిన కేసును పోలీసులు గతేడాది ఛేదించడంతో శ్రీరాం పేరు పతాక శీర్షికలకు ఎక్కింది. సుధాకర్రెడ్డిని చంపించేందుకు శ్రీరాం కుట్ర చేశారని కేసు కూడా పెట్టారు. అతడి తల్లి పరిటాల సునీత పాత్ర కూడా పోలీసులు దర్యాప్తు జరిపారు.
తాజాగా తన వాహనాల్లో మారణాయుధాలు తరలిస్తూ శ్రీరాం పోలీసుల కంటపడడం సంచలనం సృష్టించింది. హత్యకేసులో నిందితులతో కలిసి అతడు ఈ ఆయుధాలు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులు కన్నుగప్పి అతడు పారిపోయాడు. తల్లి తరపున ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీరాం మారణాయుధాలు తరలిస్తుండడం అనుమానాలను తావిస్తోంది. ప్రత్యర్థులను భయపెట్టి తన తల్లిని గెలిపించుకునేందుకే మారణాయుధాలు పట్టుకొస్తున్నారన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇవి ఎక్కడ నుంచి తెచ్చారు, ఎందుకు కోసం తీసుకెళుతున్నారు అనేది తేల్చాల్సింది పోలీసులే.