parkal
-
మీసం మెలేసిన కొండా.. తొడగొట్టిన ఇనగాల
సాక్షి, హనుమకొండ: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మీసం మెలేయగా.. మరో నేత ఇనగాల వెంకట్రామ్రెడ్డి తొడకొట్టడం.. ఇరువర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు...వెరసి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ఆత్మకూర్ మండలం అగ్రంపహాడ్‌లోని జరిగిన సమావేశానికి పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జ్ రవీంద్ర ఉత్తమ్‌రావు దల్వీ హాజరయ్యారు. సమావేశం ప్రారంభంకాగానే మాజీ ఎమ్మెల్సీ కొండా, పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి వర్గీయులు.. పోటాపోటీ నినాదాలు చేశారు. పీసీసీ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ శోభారాణి కలగజేసుకుని వ్యక్తిగత నినాదాలు చేయొద్దని.. పార్టీ నినాదాలు, జాతీయ నేతల నినాదాలు చేయాలని చెప్పినా ఫలితం కనిపించలేదు. నినాదాలు చేస్తే పంపిస్తామని చెప్పినా కార్యకర్తలు శాంతించలేదు. దీంతో మధ్యలోనే దల్వీ కార్యకర్తలను ఉదేశించి మాట్లాడి వెళ్లిపోయారు. ఆయనతో పాటు వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య బయటికి వెళ్లిపోవడంతో సమావేశం ముగిసింది. సమావేశప్రాంగణం బయట కొండా, ఇనగాల ఒకరినొకరు ఎదురు పడ్డారు. ఆ సమయంలో కొండా మీసం మెలేయడం, ఇనగాల తొడ గట్టడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. వెలుగులోకి అసలు నిజాలు? -
నన్నపునేని నరేందర్‌కు షాక్.. కేటీఆర్ ఎందుకలా మాట్లాడారు!
సాక్షి , వరంగల్: వరంగల్ జిల్లాలో శనివారం జరిగిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ఆసక్తికర రాజకీయ చర్చకు దారి తీసింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మరో మారు భారీ మెజారిటీతో గెలిపించి మూడోసారికి అసెంబ్లీకి పంపాలంటూ సభికుల సాక్షిగా మాట్లాడిన కేటీఆర్... అదే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన బహిరంగసభలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు టికెట్‌పై మాత్రం అంతే క్లారిటీగా మాట్లాడలేకపోయారు. ఆయా సభల్లో స్థానిక ఎమ్మెల్యేలను మరోసారి ఆశీర్వదించాలని చెబుతూ వస్తున్న మంత్రి కేటీఆర్ శనివారం వేర్వేరుగా జరిగిన సభల్లో రెండు రకాలుగా మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. గీసుకొండ మండలం కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ‘పరకాలలో ధర్మారెడ్డికి ఎదురు లేదు.. మళ్లీ ఆయననే గెలిపించాలి’ అని పిలుపునిచ్చిన కేటీఆర్.. వరంగల్ సభలో మాత్రం కేసీఆర్ ఆశీర్వాదం ఉంటే.. ప్రజల అండదండలుంటే మరోసారి మంచి మెజారిటీతో గెలిచిరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మాట్లాడారు. ఈ మాటలతో సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్‌కు ‘టికెట్’ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. బహిరంగ సభ వేదిక మీద తన పేరును ప్రకటిస్తారని భావించిన నరేందర్, ఆయన అనుచరులు కేటీఆర్ మాటలతో సందిగ్ధంలో పడినట్లయ్యింది. . ఆసక్తి రేపుతున్న ఎర్రబెల్లి వ్యాఖ్యలు... రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన ప్రసంగంలో కేసీఆర్, కేటీఆర్‌ల ఆశీర్వాదంతో వరంగల్ పట్టణం బాగుపడిందని చెప్పారు. వరంగల్ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని పొగిడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఇంకోవైపు ఆయన పేరు ప్రస్తావించకుండా వరంగల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తామని చేసిన వ్యాఖ్యలు నరేందర్ అనుచరుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వరంగల్ తూర్పులో వర్గ పోరు ఉండడం.. కేటీఆర్ క్లారిటీ ఇవ్వకపోవడంతో వచ్చే ఎన్నికల్లో నరేందర్ అభ్యర్థిత్వం చర్చనీయాంశంగా మారింది. -
మాజీ ఎమ్మెల్యే శారారాణి కన్నుమూత
పరకాల: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారారాణి (55) శనివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాస గృహంలో సాయంత్రం ఆమెకు గుండెనొప్పి రాగా.. ఆస్పత్రికి తరలించేలోగానే తుదిశ్వాస వదిలారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అసమ్మతి ఎమ్మెల్యేల్లో శారారాణి ఒకరు. ఆ తర్వాత టికెట్ లభించకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాగా, శారారాణి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని తెలిసింది -
వివాహితను పెళ్లి చేసుకుని.. మరో పెళ్లికి సిద్ధం..!!
పరకాల: భర్త నుంచి విడాకులు తీసుకున్న తనకు తోడుంటానని వెంటాడి ప్రేమించి పెళ్లి చేసుకొని..కూతురు పుట్టాక మరోపెళ్లికి సిద్ధపడుతున్నాడంటూ ఓ మహిళ తనను మోసం చేసిన వ్యక్తి ఇంటి ఎదుట బైఠాయించిన సంఘటన పరకాల పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని బాధితురాలిని పరకాల పోలీసుస్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాధితురాలి కథనం ప్రకారం... పరకాల పట్టణంలోని మల్లారెడ్డిపల్లె కాలనీకి చెందిన రాయబారపు నితీష్ సికింద్రాబాద్‌లో ప్రైవేటు కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ సమయంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబ గొడవలతో భర్త నుంచి విడాకులు తీసుకున్న చర్లపల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన హసీనాతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి తనకు తన వెంటపడుతుండగా మొదట నిరాకరించిన హసీనా నాలుగేళ్ల క్రితం ఒప్పుకుంది. పిల్లలు వద్దంటూ పుట్టిన కూతురును విక్రయించే ప్రయత్నం నితీష్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 2018 నవంబర్ 23న హసీనా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరింత కోపం పెంచుకున్నాడు. తల్లిదండ్రుల ఒత్తిడితో మరోపెళ్లికి సిద్ధపడుతూ తనకు అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తున్నాడంటూ శనివారం మధ్యాహ్నం నితీష్ ఇంటి ఎదుట బైఠాయించింది. బాధితురాలి ఆందోళనపై యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని చట్టపరంగా వెళితే న్యాయం జరుగుతుంది తప్పా ఆందోళనతో సమస్య పరిష్కారం కాదంటూ నచ్చజెప్పి పంపారు. తనకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని బాధితురాలు హసీనా తెలిపింది. యువకుడి తల్లిదండ్రులు రూ.2లక్షల ఇస్తాం తమ కొడుకు నుంచి దూరంగానే ఉండాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కోంది. పెళ్లి చేసుకున్న ఆధారాలను మాయం చేసి తనకు అన్యాయం చేయాలని చూస్తున్నాడని..నితీష్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూపించింది. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాక్షి, పరకాల రూరల్: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం వరికోల్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోర్తాల తిరుపతి (39) తనకున్న ఎకరం భూమితోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మూడేళ్లుగా పత్తి పంట సాగు చేస్తున్నాడు. పెట్టుబడి ఎక్కువ కావడం, దిగుబడి తగ్గడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పటికే రూ.2 లక్షల అప్పు ఉండగా ఈ ఏడాది మరో రూ.లక్ష అప్పు చేశాడు. దీంతో అప్పు ఎలా తీర్చాలి అని మనోవేదనకు గురైన తిరుపతి సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య సమ్మక్క, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ప్రొఫెసర్ ఐలయ్య అడ్డగింత.. ఉద్రిక్తత
పరకాల : ‘కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు’ పుస్తక రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్య వాహనాన్ని వైశ్య సంఘాలు అడ్డుకోవడంతో వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాలలో శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. తమ కులంపై అభ్యంతరకర వ్యాఖ్యాలతో పుస్తకం రాయడాన్ని నిరసిస్తూ కొందరు వైశ్యులు.. ఐలయ్య ప్రయాణిస్తోన్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టి, భద్రత నిమిత్తం ఐలయ్యను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రొఫెసర్ ఐలయ్య భూపాలపల్లిలో జరిగిన టీమాస్ సభకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఐలయ్యపై సుప్రీం కోర్టుకు వెళ్తాం.. సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘సామాజిక స్మగ్లర్లు కోమట్లు’ అనే పుస్తకం ద్వారా ఉన్నతమైన ఆర్యవైశ్యుల మనోభావాలను కించపరచిన కంచె ఐలయ్యపై పై తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు ప్రపంచ ఆర్యవైశ్యమహాసభ (వామ్) అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ తెలిపారు. శుక్రవారం వామ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కంచె ఐలయ్య ఒక్క ఆర్యవైశ్యులనే కాదు, బ్రాహ్మణులను, ఏక మొత్తంగా హిందూమతాన్ని నీచపదజాలంతో దూషిస్తూ పుస్తకాలు వెలువరించినట్లు తెలిపారు. అంతేకాకుండా, ఉగ్రవాదులను ఉరితీసినపుడు సానుభూతి సభలను ఆయన నిర్వహించారని ఆరోపించారు. భారత్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కోరుతూ రచనలు సాగించినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. కంచె ఐలయ్యలోని సైకో, కులాల మధ్య చిచ్చుపెట్టడం వంటి దుర్మార్గమైన అనేక నైజాలను వెలికి తీయాల్సిందిగా కోరుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇదే విషయంలో కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలవబోతున్నామని రామకృష్ణ చెప్పారు. -
పరకాలలో 100 మందికి అస్వస్థత
వరంగల్ రూరల్: వరంగల్ రూరల్ జిల్లా పరకాలలలో ఒక్కసారిగా వంద మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానిక సీఎస్ఐ కాలనీ వాసులు శుక్రవారం ఉదయం నుంచి వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. దీంతో వారిని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. కలుషిత తాగునీటి వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. -
వీరుల త్యాగాలను స్మరించుకునేందుకే తిరంగయాత్ర
పరకాల : భారతదేశానికి స్వేచ్ఛా వాయువులను అందించేందుకు ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకునేందుకే తిరంగ యాత్రను చేపట్టినట్లు మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి అన్నారు. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పరకాలలో తిరంగయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ నుంచి ఆర్టీసీ డిపో వరకు 200 మీటర్ల జాతీయ జెండాతో వందలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జంగారెడ్డి మాట్లాడుతూ 70 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు తిరంగయాత్రను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీ వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కానుగుల గోపినాథ్, ముస్కే సంతోష్, పల్లెబోయిన సురేష్, మేకల రాజవీరు, రామన్న, జయపాల్‌రెడ్డి, సర్పంచ్ భిక్షపతి, సంఘమేశ్వర్, లెక్చరర్లు, విద్యార్దులు పాల్గొన్నారు.