సాక్షి , వరంగల్: వరంగల్ జిల్లాలో శనివారం జరిగిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ఆసక్తికర రాజకీయ చర్చకు దారి తీసింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మరో మారు భారీ మెజారిటీతో గెలిపించి మూడోసారికి అసెంబ్లీకి పంపాలంటూ సభికుల సాక్షిగా మాట్లాడిన కేటీఆర్... అదే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన బహిరంగసభలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు టికెట్‌పై మాత్రం అంతే క్లారిటీగా మాట్లాడలేకపోయారు.
ఆయా సభల్లో స్థానిక ఎమ్మెల్యేలను మరోసారి ఆశీర్వదించాలని చెబుతూ వస్తున్న మంత్రి కేటీఆర్ శనివారం వేర్వేరుగా జరిగిన సభల్లో రెండు రకాలుగా మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. గీసుకొండ మండలం కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ‘పరకాలలో ధర్మారెడ్డికి ఎదురు లేదు.. మళ్లీ ఆయననే గెలిపించాలి’ అని పిలుపునిచ్చిన కేటీఆర్.. వరంగల్ సభలో మాత్రం కేసీఆర్ ఆశీర్వాదం ఉంటే.. ప్రజల అండదండలుంటే మరోసారి మంచి మెజారిటీతో గెలిచిరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మాట్లాడారు. ఈ మాటలతో సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్‌కు ‘టికెట్’ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. బహిరంగ సభ వేదిక మీద తన పేరును ప్రకటిస్తారని భావించిన నరేందర్, ఆయన అనుచరులు కేటీఆర్ మాటలతో సందిగ్ధంలో పడినట్లయ్యింది. .
ఆసక్తి రేపుతున్న ఎర్రబెల్లి వ్యాఖ్యలు...
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన ప్రసంగంలో కేసీఆర్, కేటీఆర్‌ల ఆశీర్వాదంతో వరంగల్ పట్టణం బాగుపడిందని చెప్పారు. వరంగల్ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని పొగిడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఇంకోవైపు ఆయన పేరు ప్రస్తావించకుండా వరంగల్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తామని చేసిన వ్యాఖ్యలు నరేందర్ అనుచరుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వరంగల్ తూర్పులో వర్గ పోరు ఉండడం.. కేటీఆర్ క్లారిటీ ఇవ్వకపోవడంతో వచ్చే ఎన్నికల్లో నరేందర్ అభ్యర్థిత్వం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment