
పరకాల : ‘కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు’ పుస్తక రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్య వాహనాన్ని వైశ్య సంఘాలు అడ్డుకోవడంతో వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాలలో శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది.
తమ కులంపై అభ్యంతరకర వ్యాఖ్యాలతో పుస్తకం రాయడాన్ని నిరసిస్తూ కొందరు వైశ్యులు.. ఐలయ్య ప్రయాణిస్తోన్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టి, భద్రత నిమిత్తం ఐలయ్యను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రొఫెసర్ ఐలయ్య భూపాలపల్లిలో జరిగిన టీమాస్ సభకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఐలయ్యపై సుప్రీం కోర్టుకు వెళ్తాం..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘సామాజిక స్మగ్లర్లు కోమట్లు’ అనే పుస్తకం ద్వారా ఉన్నతమైన ఆర్యవైశ్యుల మనోభావాలను కించపరచిన కంచె ఐలయ్యపై పై తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు ప్రపంచ ఆర్యవైశ్యమహాసభ (వామ్) అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ తెలిపారు. శుక్రవారం వామ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కంచె ఐలయ్య ఒక్క ఆర్యవైశ్యులనే కాదు, బ్రాహ్మణులను, ఏక మొత్తంగా హిందూమతాన్ని నీచపదజాలంతో దూషిస్తూ పుస్తకాలు వెలువరించినట్లు తెలిపారు. అంతేకాకుండా, ఉగ్రవాదులను ఉరితీసినపుడు సానుభూతి సభలను ఆయన నిర్వహించారని ఆరోపించారు. భారత్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కోరుతూ రచనలు సాగించినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. కంచె ఐలయ్యలోని సైకో, కులాల మధ్య చిచ్చుపెట్టడం వంటి దుర్మార్గమైన అనేక నైజాలను వెలికి తీయాల్సిందిగా కోరుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇదే విషయంలో కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలవబోతున్నామని రామకృష్ణ చెప్పారు.