parking spaces
-
ఎస్టేట్స్ దివాలా
విజయవాడ సెంట్రల్ : ‘సందడి ఎక్కువ.. సంపాదన తక్కువ’ చందంగా ఎస్టేట్స్ విభాగం పనితీరు తయారైంది. కోట్లాది రూపాయల ఆదాయానికి అక్రమార్కులు వ్యూహాత్మకంగా గండికొడుతున్నారు. పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో కింది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు కేసులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌ల్లోని షాపులు, కూరగాయల మార్కెట్, కమ్యూనిటీ హాళ్లు, పార్కింగ్ ప్రదేశాలకు టెండర్లు పిలిచేందుకు కమిషనర్ జి.వీరపాండియన్ కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఫైల్‌ను సిద్ధం చేశారు. ఎప్పటివలే ఈసారీ టెండర్లు ఓ ఫార్సుగా మిగులుతాయా.. ఆశించిన స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెడతాయా అనే చర్చ నడుస్తోంది. నీరసంగా వసూళ్లు.. మూడు సర్కిళ్ల పరిధిలో డిమాండ్ రూ.15,53,90,305 కాగా కలెక్షన్ రూ. 3,10,48,513. రావాల్సిన బకాయిలు రూ.12,43,41,792.26 కేసులకు సంబంధించి 593 షాపులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. వస్త్రలతకు సంబంధించిన కేసులే అధికంగా ఉన్నాయి.నగరంలోని వివిధ కాంప్లెక్స్‌ల్లో 183 షాపులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. తెగని వివాదం వస్త్రలత కాంప్లెక్స్ నుంచి రూ.11 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. అసోసియేషన్ ప్రతినిధులతో ఎంపీ కేశినేని నాని, మేయర్ కోనేరు శ్రీధర్ రెండు విడతలుగా చర్చలు సాగించారు. రూ.4 కోట్లకు మించి ఒక్క రూపాయి కూడా కట్టలేమని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనను కమిషనర్ తిరస్కరించారు. 90 శాతం బకాయిలు చెల్లిస్తే 10 శాతం రాయితీ ఇస్తామని చెప్పారు. అయినా బకాయిల బండ ముందుకు కదలడం లేదు. దిక్కులేని దివాణం అధికారులు విజిటింగ్ ప్రొఫెసర్లలా ఎస్టేట్స్‌కు వచ్చిపోతున్నారు. పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో ఈ విభాగం దిక్కులేని దివాణంలా మారింది. గతంలో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉండే ఎస్టేట్స్ సెక్షన్‌ను గదుల కొరత కారణంగా సర్కిల్-2 కార్యాలయానికి తరలించారు. కమిషనర్, మేయర్ల పర్యవేక్షణ కొరవడింది. ఎస్టేట్స్ అధికారి విక్టర్‌బాబు నాలుగు నెలలుగా సెలవులో ఉన్నారు. అసలు వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి. డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మి కొన్ని నెలలు ఇన్చార్జిగా వ్యవహరించారు. మొక్కుబడిగానే ఆమె ఎస్టేట్స్ ఫైళ్లు చూసేవారని సమాచారం. కేజీ మార్కెట్ సెల్లార్ విషయంలో అక్రమాలకు పాల్పడడంతో సూపరింటెండెంట్, ఆర్ఐలను కమిషనర్ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత డీసీఆర్‌ను ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. రీజినల్ ఫైర్ ఆఫీసర్ చౌదరికి ప్రస్తుతం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఎస్టేట్స్ పద్మవ్యూహాన్ని ఛేదించడం ఆషామాషీ వ్యవహారం కాదు. గాడిలో పెట్టేందుకు విక్టర్‌బాబు తనవంతు కృషి చేశారు. షాపుల ఖాళీలు, కోర్టు కేసులపై దృష్టిసారించారు. శృతిమించి రాజకీయ ఒత్తిళ్లు రావడంతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారని తెలుస్తోంది. పూర్తిస్థాయి అవగాహన ఉంటే కానీ కింది ఉద్యోగులతో పనిచేయించలేని పరిస్థితి. ఎస్టేట్స్ రాజకీయాల్లో చౌదరి ఎంతవరకు నెగ్గుకొస్తారో వేచిచూడాలి. -
‘మెట్రో’ స్టేషన్లలో నిరంతర నిఘా
సాక్షి,సిటీబ్యూరో: ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెట్రో స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటుతో పాటు బెంగళూరు, ఢిల్లీ నగరాలకు దీటుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్టు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి తెలిపారు. బుధవారం నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో మెట్రో స్టేషన్లలో భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు ఉన్నతాధికారులు, ఎల్అండ్టీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మెట్రో స్టేషన్లు, ట్రాక్, ఫ్లాట్‌ఫారాలు, టిక్కెట్ కేంద్రాలు, పార్కింగ్ స్థలాలు, స్కైవాక్‌లు, వయాడక్ట్ సెగ్మెంట్లు, మెట్రో ట్రాక్ పరిసరాలు, ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ విభాగాల వద్ద సీసీటీవీల నిఘాతోపాటు, భద్రతా బలగాలతో నిరంతర పహారా ఏర్పాటు చేస్తామన్నారు. పహారా లేని ప్రాంతాల్లో సెన్సార్లు, బ్యాగేజీ తనిఖీ యంత్రాలు, మెటల్ డిటెక్టర్లు, సెక్యూరిటీ అలారాల ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. రైలు బోగీల్లోనూ వీడియో రికార్డు ఉంటుందన్నారు. నగరంపై ఉగ్రవాద పడగనీడ ఉన్న నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, కౌంటర్ టైజం నిపుణుడు కె.సి.రెడ్డి, అడిషనల్ కమిషనర్ అంజనీకుమార్, జితేందర్, సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్, ఎల్అండ్టీ ప్రాజెక్టు డెరైక్టర్ ఎం.పి.నాయుడు తదితరులు పాల్గొన్నారు.