Parliamentary Secretary
-
న్యూజిలాండ్‌తో కలసిపనిచేస్తాం: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలసి పనిచేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో న్యూజిలాండ్ ఎత్నిక్ ఎఫైర్స్ శాఖ పార్లమెంటరీ కార్యదర్శి ప్రియాంక రాధాక్రిష్ణన్ భేటీ అయ్యారు. న్యూజిలాండ్, తెలంగాణలో రాజకీయ వ్యవస్థల పనితీరుపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. తెలంగాణలో వ్యవసాయ సాంకేతికత (అగ్రిటెక్), ఆవిష్కరణలు, స్టార్టప్ రంగాల్లో కలసి పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. స్టార్టప్, ఇన్నొవేషన్ రంగాల్లో తెలంగాణ దేశం లోనే ముందు వరుసలో ఉందని, టీ హబ్, వీ హబ్ వంటి ఇంక్యుబేటర్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు. త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ రెండో దశను ఏర్పాటు చేస్తున్నామని, విదేశీ స్టార్టప్ వ్యవస్థలతో కలసి పనిచేసేందుకు ఉద్దేశించిన ‘టీ బ్రిడ్జ్’ను బలోపేతం చేస్తామన్నారు. టీ బ్రిడ్జ్‌లో భాగంగా న్యూజిలాండ్ స్టార్టప్‌లతోనూ పనిచేసే అవకాశం ఏర్పడుతుందన్నారు. అందుబాటులోకి వస్తున్న సాగునీటితో వ్యవసాయం, ఫుడ్ ప్రాసె సింగ్ పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ దిశగా ఇక్రిశాట్‌తో కలసి పనిచేస్తున్న విషయాన్ని వివరించారు. న్యూజిలాండ్ ప్రధాని జస్సిండా ఆర్డన్ పనితీరును కేటీఆర్ ప్రశంసించారు. మా దేశానికి రండి..: తెలంగాణ వ్యవసాయ వర్సిటీతో కలసి పనిచేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ప్రియాంక వెల్లడించారు. న్యూజిలాండ్ పార్లమెంటు సభ్యురాలినైన తాను అక్కడి ప్రధానితో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయిస్తానని, తమ దేశానికి రావాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించారు. తమ దేశంలో తెలంగాణ ఎన్నారైలతో కలసి పనిచేస్తున్నామని, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ ఎన్నారై విభాగం కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పాల్గొన్నారు. -
ఇక సీఎం రిప్రజెంటేటివ్స్..!
పార్లమెంటరీ కార్యదర్శుల పేరు మార్చే యోచనలో ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: పార్లమెంటరీ కార్యదర్శుల పేరును సీఎం రిప్రజెంటేటివ్స్ (ముఖ్యమంత్రి ప్రతినిధులు)గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పదవులకు సంబంధించిన జీవో చెల్లదని, పార్లమెంటరీ కార్యదర్శుల పదవులను రద్దు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వీటిని కొనసాగించాలా.. వద్దా.. అనే విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో ఉంది. సీఎం సూచనల మేరకు న్యాయపరమైన చిక్కుల్లేకుండా కొత్త జీవో తీసుకువచ్చేందుకు ఫైలు సిద్ధం చేసింది. మంత్రుల హోదా అనే పదం లేకుండా జీవో జారీ చేయడంతోపాటు పార్లమెంటరీ కార్యదర్శులకు బదులు అసెంబ్లీ సెక్రెటరీ, లేదా సీఎం రిప్రజెంటేటివ్స్ పేరుతో ఈ పదవులను కొనసాగించాలని యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ కొత్త నియామకాల వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. -
ఫణిగిరిని అభివృద్ధి చేస్తా
ఫణిగిరి..బౌద్ధం పరిఢవిల్లిన నేల..వంద ఏళ్లనాటి చర్రితకు ఎన్నో ఆనవాళ్లు....తవ్వకాల్లో వెలుగుచూసిన నిర్మాణాలు, చిహ్నాలు, శాసనాలు ఎన్నెన్నో... కానీ గత పాలకుల నిర్లక్ష్యం, పురావస్తు శాఖ అధికారుల అలసత్వంతో ఈ ప్రాచీన సంపదకు రక్షణ కరువైంది. పర్యాటక కేంద్రంగా మార్చుతామనే పాలకుల హామీలు నీటిమీద రాతలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఫణిగిరి గ్రామాన్ని పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్ సందర్శించారు. సాక్షి తరఫున రిపోర్టర్‌గా మారి..అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. గాదరి కిషోర్: మీపేరేమిటి..ఇక్కడి బౌద్ధారామం పరిస్థితి ఎలా ఉంది. పానుగంటి నర్సింహారెడ్డి: మా ఊరిలోని బౌద్ధారామానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే దీనిని పర్యాటక కేంద్రంగా మార్చుతామని పాలకులు గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఇంత వరకు ఎలాంటి అభివృద్ది జరగలేదు. గాదరి: అన్నా...ఏం సమస్యలు ఉన్నాయె..? ఉప్పలయ్య: ఫణిగిరిలో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో ఎంతో విలువైన ప్రాచీనసంపద బయల్పడింది. కానీ దీనికి రక్షణ లేదు. ఈ సంపదనంతా ఓ పాతభవనంలో పడవేశారు. గాదరి : ఈ భవనంలో ఎప్పడి నుంచి పనిచేస్తున్నావు. వీరయ్య (సెక్యూరిటీగార్డు) : నేను పది సంవత్సరాలుగా ప్రాచీన సంపదను ఉంచిన భవనానికి కాపలాగా ఉంటున్నాను. నాకు నెలకు మూడు వేల రూపాయల జీతం ఇస్తున్నారు. తెలంగాణ వచ్చింది కదా...ఈ ప్రభుత్వంలోనైనా నా ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలి. గాదరి : అన్న సమస్య ఎందో చెప్పు.. యాదయ్య: మా ఊర్లోన్ని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి వందల ఎకరాల భూములు ఉన్నాయి. అయినా ఆలయం ధూపదీపనైవేద్యాలకు దూరమైంది. గుడిలో గుప్తనిధుల కోసం విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నారు. గాదరి : మండలంలో ఉన్న సమస్యలేమిటి ? కొమ్మినేని సతీష్: గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బోర్లలో ఫ్లోరిన్ అధికంగా ఉండడంతో ఆ నీటిని ప్రజలు తాగి రోగాల పాలవుతున్నారు. గాదరి : అవ్వా... పింఛన్ వస్తుందా ? యాదమ్మ: సారూ...మూడు నెలల సంది పింఛన్లు రావడం లేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. గాదరి: ఏం తాత.. నీసమస్య ఏంటి ? గుగులోతు కాలు: నేను ముసలివాడిని అయ్యా. మాకుటుంబానికి భూమి లేదు. వ్యవసాయానికి ప్రభుత్వ భూమి ఇప్పించాలి. గాదరి: అమ్మా నీ సమస్య... యాదమ్మ: నాకు 65 ఏళ్ల వయస్సు ఉన్నా పింఛన్ రావడం లేదు. రేషన్‌కార్డులో తక్కువ వయస్సువేశారు. మీరైనా పింఛన్ ఇప్పించండి. గాదరి: అన్నా మీ ప్రాంత సమస్యలు ఏంటో చెప్పండి. దాయం విక్రంరెడ్డి: తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయింది. ఎలాంటి సాగునీటి వసతి లేదు. ఎస్సారెస్పీ కాలువలు తీసినా నీళ్లు రావడం లేదు. గాదరి : అక్కా సమస్యలేంటి. పేరాల పూలమ్మ: తండాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. సమస్య పరిష్కారానికి ముందస్తుగా నిధులు మంజూరు చేయించాలి. గాదరి: సార్ బాగున్నారా...అంతా కులాసేనా.. ఓరుగంటి సత్యనారాయణ: ఈ ప్రాంతంలో కరెంటు సమస్య తీవ్రంగా ఉంది. లోఓల్టేజీతో పంటలు ఎండిపోతున్నాయి. గాదరి : జనార్దన్‌గారు చెప్పండి మీసమస్య సుంకరి జనార్దన్: తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఈవిద్యా సంవత్సరం నుంచే ప్రారంభిచేలా చూడాలి. గాదరి : ఆ వీరప్రసాద్ ఇక్కడ పరిస్థితి ఏమిటో... దావుల వీరప్రసాద్: అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనారసింహస్వామి దేవాలయ భూముల సమస్యలు పరిష్కరించాలి. 750 ఎకరాల భూములున్నా ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు కష్టమవుతుంది. రైతులకు ఆమోదయోగ్యమైన ధరకు భూమిని అమ్మి పట్టాలు ఇవ్వాలి. దర్గాను కూడా అభివృద్ధి చేయాలి. గాదరి : అశోకన్న నీ సమస్య చెప్పు మూల అశోక్‌రెడ్డి: తిరుమలగిరి మండల కేంద్రంలో బస్‌డిపో ఏర్పాటు చేయాలి. గాదరి : మీ ఊరు సమస్య లేమిటి ఎ. మధుసూదన్‌రెడ్డి: రైతులకు పంట రుణాలు పూర్తిగా మాఫీ చేసి ఒకేసారి ఎక్కువ మొత్తంలో రుణాలందజేయాలి. తుంగతుర్తిని జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా మార్చుతా గత పాలకుల నిర్లక్ష్యంతో తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుబడిపోయింది. ఫణిగిరి బౌద్ధక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా, సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని రెండో భద్రాద్రిగా మార్చడానికి పక్క గ్రామానికి చెందిన మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాం. ఎస్సారెస్పీ రెండో దశ కాలువ పనులు పూర్తి చేయించి ఈప్రాంతానికి సాగు, తాగు నీరందిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు, ఆహార భద్రతా కార్డులు వందశాతం ఇప్పిస్తాం. ఒంటరి, మహిళలు, అభయహస్తం పింఛన్‌దారుల సమస్యలపై ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుని నెలకు రూ. 1000 పింఛన్ ఇస్తుంది. ఫణిగిరిలో తవ్వకాల్లో బయల్పడిన ప్రాచీన సంపద కోసం మ్యూజియం ఏర్పాటు చేసి భద్రపరుస్తాం. తాగునీటి అవసరాలకు గ్రామాగ్రామానికి కృష్ణాజలాలు అందించడానికి కృషి చేస్తా. నియోజకవర్గంలోని రోడ్లను బీటీగా మార్చడానికి రూ. 229 కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తాం. -
పార్లమెంటరీ కార్యదర్శిగా జలగం బాధ్యతలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులైన టీఆర్ఎస్కు చెందిన కొత్తగూడెం శాసనసభ్యుడు జలగం వెంకటరావు శుక్రవారం హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. సహాయ మంత్రి హోదా కలిగిన ఈ పదవి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు. వెంకటరావు బాధ్యతలు స్వీకరించడంతో జిల్లాకు చెందిన ఇద్దరు నెలలోపే అమాత్యులుగా బాధ్యతలు స్వీకరించినట్లయింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన వెంకటరావును జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిపై అవగాహన కలిగిన వెంకటరావు ఈ హోదాలో పలు కీలక ప్రభుత్వ శాఖలను పర్యవేక్షించే అవకాశం రావడంతో జిల్లా అభివృద్ధి మరింత వేగవంతమయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. -
పార్లమెంటరీ కార్యదర్శిగా కిషోర్
తిరుమలగిరి : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ను పార్లమెంటరీ కార్యదర్శిగా పదవి వరిం చింది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా గాదరి కిషోర్ గుర్తింపు పొందారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తూనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థి నాయకులకు టికెట్ ఇవ్వాలని సంకల్పించి కిషోర్‌కు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించారు. కేసీఆర్ అంచనాలకనుగుణంగా విజయఢంకా మోగించారు. అతి చిన్నవయస్సులో ఎమ్మెల్యేగా గెలిచారు. అనతికాలంలోనే పార్లమెంటరీ పదవి వరించడంతో స్థానిక నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.అయితే కిషోర్‌కు ఆరోగ్యశాఖ కేటాయించారు. జిల్లాకు నాలుగు పదవులు.. కేసీఆర్ కేబినెట్లోకి తొలివిడతతోనే జిల్లాకు బెర్త్ దక్కింది. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని విద్యాశాఖ వరించింది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన మునుగోడుకు చెందిన కర్నె ప్రభాకర్‌కు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ప్రభాకర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. ఆపై ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు విప్‌గా అవకాశం దక్కింది. తాజాగా కిషోర్‌ను పార్లమెంటరీ సెక్రటరీ పదవి వరించింది.