
బుధవారం ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ను కలసిన న్యూజిలాండ్ ఎత్నిక్ ఎఫైర్స్ శాఖ పార్లమెంటరీ కార్యదర్శి ప్రియాంక రాధాక్రిష్ణన్
సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలసి పనిచేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో న్యూజిలాండ్ ఎత్నిక్ ఎఫైర్స్ శాఖ పార్లమెంటరీ కార్యదర్శి ప్రియాంక రాధాక్రిష్ణన్ భేటీ అయ్యారు. న్యూజిలాండ్, తెలంగాణలో రాజకీయ వ్యవస్థల పనితీరుపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. తెలంగాణలో వ్యవసాయ సాంకేతికత (అగ్రిటెక్), ఆవిష్కరణలు, స్టార్టప్ రంగాల్లో కలసి పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. స్టార్టప్, ఇన్నొవేషన్ రంగాల్లో తెలంగాణ దేశం లోనే ముందు వరుసలో ఉందని, టీ హబ్, వీ హబ్ వంటి ఇంక్యుబేటర్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు.
త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ రెండో దశను ఏర్పాటు చేస్తున్నామని, విదేశీ స్టార్టప్ వ్యవస్థలతో కలసి పనిచేసేందుకు ఉద్దేశించిన ‘టీ బ్రిడ్జ్’ను బలోపేతం చేస్తామన్నారు. టీ బ్రిడ్జ్‌లో భాగంగా న్యూజిలాండ్ స్టార్టప్‌లతోనూ పనిచేసే అవకాశం ఏర్పడుతుందన్నారు. అందుబాటులోకి వస్తున్న సాగునీటితో వ్యవసాయం, ఫుడ్ ప్రాసె సింగ్ పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ దిశగా ఇక్రిశాట్‌తో కలసి పనిచేస్తున్న విషయాన్ని వివరించారు. న్యూజిలాండ్ ప్రధాని జస్సిండా ఆర్డన్ పనితీరును కేటీఆర్ ప్రశంసించారు.
మా దేశానికి రండి..: తెలంగాణ వ్యవసాయ వర్సిటీతో కలసి పనిచేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ప్రియాంక వెల్లడించారు. న్యూజిలాండ్ పార్లమెంటు సభ్యురాలినైన తాను అక్కడి ప్రధానితో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయిస్తానని, తమ దేశానికి రావాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించారు. తమ దేశంలో తెలంగాణ ఎన్నారైలతో కలసి పనిచేస్తున్నామని, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment