సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చేనేత కళా నైపుణ్యానికి ప్రపంచ మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉందని అమెరికాకు చెందిన చేనేత, వస్త్ర పరిశోధకురాలు కైరా వెల్లడించారు. భారత్‌లో చేనేత ఉత్పత్తులు కేవలం చీరలకు మాత్రమే పరిమితం అవుతున్నాయన్నారు. ఇతర దుస్తులు, ఉత్పత్తులకు చేనేత, పట్టు పరిశ్రమను అనుసంధానించడం ద్వారా మార్కెటింగ్ విస్తృతి పెరుగుతుందని ఆమె తెలిపారు.
చేనేత, వస్త్ర రంగంపై పరిశోధనలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కైరా బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీ రామారావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యటనలో తాను అధ్యయనం చేసిన విషయాలను కేటీఆర్‌కు వివరించారు. మరమగ్గాల కార్మికులు డబుల్ జకార్డ్ వంటి వినూత్న టెక్నిక్‌తో వస్త్రాలను ఉత్పత్తి చేయడాన్ని ప్రశంసించారు.
రాష్ట్రంలోని పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, నారాయణపేట, గద్వాల ప్రాంతాల్లో జరుగుతున్న చేనేత వస్త్రాల ఉత్పత్తి, అక్కడి స్థితిగతులపై తాను అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. పరిశోధనలో భాగంగా ఇప్పటి వరకు 9 దేశాల్లో పర్యటించగా, చేనేత అధ్యయనానికి భారత్‌లో తెలంగాణను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకున్నట్లు కైరా చెప్పారు. చేనేత కళా నైపుణ్యం, వస్త్రాలపై ప్రేమతో దీర్ఘకాల పరిశోధన కోసం తన సమయాన్ని వెచ్చిస్తున్న కైరా ప్రయత్నాన్ని కేటీఆర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment