లోక్సభలో ‘టీ’బిల్లు ఆమోదంపై నిరసన జ్వాలలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్ర విభజన బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంతో జిల్లావాసులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించొద్దంటూ ఏడు నెలలుగా ప్రజలు మొరపెట్టుకున్నా..వినకుండా విభజన చే యడాన్ని దుయ్యబడుతున్నారు. రాష్ట్ర ప్రజలను రెండుగా విడదీయాలని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ కంకణం కట్టుకుని పట్టువదలకుండా విడదీశారని ఆమెపై మండిపడుతున్నారు. సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో విభజన వద్దని రెండు నెలలపాటు ఆందోళనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ రెండు నెలల వేతనాన్ని పోగొట్టుకున్నారు. సమ్మె కాలా న్ని ఎర్న్డ్ లీవులుగా పరిగణించడంతో దాని ద్వారా వచ్చే ఆదాయం పోయింది. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు చేసిన ఆందోళనలు వృథాగా మారాయి. సీమాంధ్రలో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో అభివృద్ధి పనులన్నీ కుంటుపడే అవకాశం ఉంది.