patalaganga
-
బయటపడ్డ పురాతన మండపం
శ్రీశైలం: శ్రీశైలం జలాశయం నుంచి కొన్ని రోజుల కిత్రం రివర్ స్లూయిస్గేటు ద్వారా నీటివిడుదల చేయడంతో పాతాళగంగలో మునిగి ఉన్న పురాతన విశ్రాంతి మండపం మంగళవారం పూర్తిగా బయటపడింది. ఈ మండపాన్ని క్రీ.శ. 1393–96 మధ్య కాలంలో విఠలాంబ నిర్మించినట్లు చారిత్రక అధారాలు ఉన్నాయి. ఒకప్పుడు పాతాళగంగలో భక్తులు స్నానాలాచరించడానికి వీలుగా మెట్ల మార్గాన్ని విఠలాంబా నిర్మించారని తెలుస్తోంది. పాతమెట్ల మార్గాన్ని రెడ్డిరాజులు నిర్మించగా..ఎంతో లోతైన ప్రదేశం కావడంతో మార్గమధ్యలో విశ్రమించడానికి వీలుగా ఈ మండపాలను నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. డ్యాం నిర్మాణంలో భాగంగా అనేక మండపాలు, కట్టడాలు మునిగిపోయాయి. కొన్నింటిని మాత్రమే పునర్నిర్మించడానికి ఆ నిర్మాణపు రాళ్లను పాతాళగంగ మెట్ల పై భాగానికి చేర్చారు. అవి కూడా తిరిగి పునర్నిర్మాణానికి నోచుకుండానే అక్కడక్కడ ఏర్పాటు చేసిన రాతిస్థంభాలుగా మిగిలిపోయాయి. ప్రస్తుతం పాతాళగంగ నీటిమట్టం తగ్గిపోవడంతో బయటపడ్డ ఈ మండపం సుమారు 1990–95 మధ్యకాలంలో బయటపడింది. ఆ సమీపంలో ఉన్న వీరభద్రుడి విగ్రహాన్ని దేవస్థానం నీటి సరఫరా విభాగం వారు మెట్ల పై భాగానికి చేర్చి పునఃప్రతిష్టించారు. తిరిగి సుమారు 20 ఏళ్ల తరువాత గత ఏడాది ఇదే నెలలో ఈ మండపం బయటపడింది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నీటిమట్టం 775 అడుగులకు చేరుకోవడంతో మండపం పూర్తిస్థాయిలో బయటపడిందని స్థానికులు చెబుతున్నారు. -
ఆధ్యాత్మికత, ఆహ్లాదాన్ని పెంపొందించండి
- ఉద్యానవనాలను అభివృద్ధి చేయండి - పంచ మఠాలను అందుబాటులోకి తేవాలి - ప్రిన్సిపల్ ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ శ్రీశైలం: జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు పచ్చదనాన్ని పెంచి ఆహ్లాదాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన ఈఓ నారాయణ భరత్‌గుప్త, దేవాదాయ సీఈ సుబ్బారావు, దేవస్థానం ఇంజినీరింగ్, హార్టికల్చర్ ఏడీ వెంకటరావు, తదితర విభాగాల సిబ్బందితో కలిసి క్షేత్ర పర్యటన చేశారు. ఇందులో భాగంగా మల్లమ్మతోట, సర్వతోభద్ర వనం, మల్లమ్మకన్నీరు, భ్రామరీ పుష్పవనం, ఘంటామఠం తదితర ప్రదేశాలు, ఉద్యాన వనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లమ్మతోటలో స్వామిఅమ్మవార్ల నిత్య కైంకర్యానికి అవసరమైన నందివర్థనం, గరుడ వర్థనం, కనకాంబరం, మల్లె, మందారం, గులాబి, గన్నెరు, బంతి తదితర మొక్కలను పెంచాలని సూచించారు. పాతాళగంగ మార్గంలోని సర్వతోభద్రవనంలో నర్సరీ నిర్వహణకు తగిన ప్రణాళిక రూపొందించి చర్యలు చేపట్టాలన్నారు. మల్లమ్మ కన్నీరు దిగువ భాగాన ఉన్న దాదాపు 2.5 ఎకరాల íవిస్తీర్ణంలో దేవస్థానం నిర్వహిస్తున్న భ్రామరీ పుష్పవనంలో స్వామిఅమ్మవార్ల నిత్య కైంకర్యానికి పుష్పాలను పెంచాలని సూచించారు. అరుదైన వృక్ష జాతులు, దేవతా వృక్షాలు, మొక్కల పెంపకం తదితర వాటిపై భక్తులలో అవగాహన కల్పించేందుకు క్షేత్రంలోని వృక్షవనాన్ని (బొటానికల్ గార్డెన్) ఏర్పాటు చేయాలని చెప్పారు. భక్తులు ఆయా ఉద్యానవనాలను వీక్షించేందుకు నడక దారులను ఏర్పాటు చేయాలని, దేవస్థానం నర్సరీల మొక్కల గురించి, దేవతా వృక్షాలపై భక్తులు, యాత్రికులలో అవగాహన కల్పించే విధంగా సూచికలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి ఉద్యానవనంలో పశువుల పేడతో సహజసిద్ధమైన ఎరువు తయారీకి చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యానవనాలను అవసరమైన మేర నీటిసరఫరాకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఆయన ఘంటామఠ ం పునర్నిర్మాణాన్ని పరిశీలించారు. క్షేత్రంలోని పంచమఠాల పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేసి వీటన్నింటిని కలుపుతూ అనుసంధాన కాలిబాటలు ఏర్పాటు చేసి భక్తులందరికీ పంచమఠాలను క్రమపద్ధతిలో దర్శించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. -
మనసు కేరింత.. తనువు తుళ్లింత
– పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లకు భక్తుల రద్దీ – పనిచేయని మెటల్ డిటెక్టర్లు – ఘాటు వద్ద సేకరించిన చెత్తను పక్కనే పడేస్తున్న వైనం – వసతి సౌకర్యం లేక ఆలయం ముందే బస – అధికారుల హాజరుకు బయోమెట్రిక్ అమలు – భక్తులకు అన్నం వడ్డించిన కలెక్టర్ శ్రీశైలం నుంచి సాక్షి ప్రతినిధి: మనసులో శివున్ని తలచుకుంటూ.. కృష్ణా నదిలో మునకేస్తూ.. చల్లని కొండగాలి పీలుస్తూ పుష్కరస్నానంతో పునీతులవుతున్న భక్లు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సెలవు దినాలు కావడంతో పుష్కరాల మూడవ రోజు ఆదివారం జిల్లాలోని ఐదు ఘాట్లలో భక్తుల సంఖ్య లక్ష దాటినట్లు అధికారుల అంచనా. రెండు రోజుల పాటు పాతాళగంగ ఘాట్‌లో పలుచగా ఉన్న భక్తుల సంఖ్య కాస్తా ఆదివారం నాటికి భారీగా పెరిగింది. రోప్‌వేను అనుమతించడంతో పాతాళగంగలో స్నానం చేసేందుకు వచ్చే భక్తుల సంఖ్య అమాంతంగా అధికం కాగా.. లింగాలగట్టు, సంగమేశ్వరంలో పుష్కర హోరు కొనసాగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి పాతాళగంగలో పుణ్యస్నానం చేసి పిండ ప్రదానం చేశారు. ఇక కలెక్టర్, డీఐజీ, ఎస్పీలు ఘాట్లను పర్యవేక్షిస్తూ భక్తుల ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు అధికమవుతున్నాయి. బట్టలు మార్చుకునేందుకు గదులు లేక, మరుగుదొడ్ల డోర్లు విరిగిపోవడంతో ప్రధానంగా స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక భక్తులను చెకింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లు సరిగా పనిచేయలేదు. లింగాలగట్టు వద్ద చార్జింగ్ లేక డిటెక్టర్లు మొరాయించాయి. సిబ్బంది అంతా విధులకు హాజరవుతున్నారా? లేదా అని పర్యవేక్షించేందుకు ట్యాబ్‌ల ద్వారా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. లింగాలగట్టు వద్ద వచ్చే భక్తులకు వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదానం వద్ద కలెక్టర్ విజయమోహన్ స్వయంగా భక్తులకు అన్నం వడ్డించారు. రోప్వేకు తాకిడి.. పాతాళగంగకు వెళ్లే మార్గంలో రోప్వేకు అనుమతించారు. దీంతో పాతాళగంగలో స్నానం ఆచరించే భక్తుల సంఖ్య రెండు రోజులతో పోలిస్తే ఆదివారం భారీగా పెరిగింది. ఫలితంగా రోప్వేకు తాకిడి అధికమయింది. ఈ నేపథ్యంలో రోప్‌వేతో పాటు పాతాళగంగకు వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా జీపులను వేశారు. పాతాళగంగ ఘాటు వద్ద పిండ ప్రదానానికి, బట్టలు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన గదుల వద్దకు వెళ్లే మార్గంలో హడావుడిగా ఏర్పాటు చేసిన నాపరాతి బండలను తొలగించారు. ఈ స్థానంలో కొత్తగా సిమెంట్ రోడ్డును రాత్రికి రాత్రి సిద్ధం చేశారు. పాము కలకలం పాతాళగంగ ఘాటు వద్ద పాము కలకలం రేపింది. ఘాటు వద్ద పాము కనిపించడంలో భక్తులు ఆందోళనకు లోనయ్యారు. అయితే, మరోవైపు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్స కేంద్రంలో తేలు, పాముకాటుకు గురైతే వెంటనే చికిత్స అందించేందుకు మందులు అందుబాటులో లేకపోవడం ఏదయినా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటనే చర్చకు తావిచ్చింది. కేవలం జ్వరం, ఒళ్లునొప్పులు, గాయాలకు మాత్రమే మందులు అందుబాటులో ఉంచారు. ఇవీ పుష్కర ఇబ్బందులు – భక్తులందరికీ వసతి కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. ఇదే అదనుగా కొద్ది మంది మధ్యవర్తులు భక్తులను దోచుకుంటున్నారు. మాములు గదికి రూ.1700 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇంత అధిక మొత్తం చెల్లించలేని భక్తులు ఆలయం ముందే నిద్రిస్తున్నారు. – లింగాలగట్టు ఘాట్ వద్ద సేకరించిన చెత్తను పక్కనే పడేస్తున్నారు. ఇది గాలికి మళ్లీ తిరిగి వచ్చి ఘాటుకు వస్తోంది. – ఘాట్ల వద్ద అన్ని శాఖల అధికారులు సక్రమంగా హాజరుకావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదయం 8 గంటలకే ఏర్పాటు చేయాల్సి ఉన్న ఆయుష్, హోమియో స్టాల్స్ 9 గంటల 40 నిమిషాలకు కానీ ఏర్పాటు కాలేదు. -
సా...గుతూనే!
– పూర్తికాని పుష్కర పనులు – ముంచుకొస్తున్న గడువు – ఘాట్లకు తొలగని విఘ్నాలు – శ్రీశైలం పురవీధుల్లో దర్శనమిస్తున్న బండరాళ్లు సాక్షి ప్రతినిధి,కర్నూలు: – శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని పాతాళగంగ ఎగు వఘాట్. ఈ ఘాట్‌లో ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. మెట్ల పనులు సాగుతున్నాయి. ఇరువైపులా ఇంకా రక్షణకు చర్యలు కూడా తీసుకోలేదు. – సమయం.. శనివారం ఉదయం 8 గంటలు. ఘాటు పనులు పూర్తికాలేదు. రాత్రింబవళ్లు పనిచేయాలని స్వయంగా జిల్లా ఉన్నతాధికారి కలెక్టర్ ఆదేశాలు. అయితే, లింగాలగట్టులోని ఎగువఘాటు వద్ద మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ ఘాటు వద్ద పనిచేస్తూ ఏ ఒక్కరూ కనిపించలేదు. – పాతాళగంగకు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగి పడిన ప్రాంతం. ఇక్కడ రక్షణ చర్యలను వెంటనే తీసుకోవాలని స్వయంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సూచించింది. అయితే, రక్షణ చర్యల పనులు ఇంకా ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. ఎప్పుడు ఏ చరియ విరిగిపడుతోందననే ఆందోళనతోనే కింద మాత్రం పనులు కానిచ్చేస్తున్నారు. – సున్నిపెంటలో ఏర్పాటు చేయతలపెట్టిన పుష్కరనగర్ ప్రాంతం. ఇక్కడ భూమిచదును పనులు మినహా ఏ ఒక్క పనీ మొదలుకాలేదు. మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న కష్ణా పుష్కరాల పుష్కరాల పనులు మాత్రం ఇంకా సాగు..తూనే ఉన్నాయి. గడువు మీద గడువు... వాస్తవానికి పుష్కరాల పనులన్నింటికీ జూలై చివరినాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈలోగా పనులు పూర్తిచేయకపోతే చర్యలూ తప్పవని హెచ్చరించారు. అయితే, ఎక్కడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. స్వయంగా జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీచేశారు. అయితే పనుల్లో మాత్రం వేగం పుంజుకోలేదు. ఈ నేపథ్యంలో 5వ తేదీ నాటికి ఘాట్ పనులను పూర్తిచేయాలని తాజాగా గడువు విధించారు. అయినప్పటికీ పనుల్లో కొంచెం వేగం పెరిగినప్పటికీ పూర్తికావాల్సిన పనులు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. తాజాగా ఈ గడువు కాస్తా 8వ తేదీకి పెరిగింది. అప్పటికీ పూర్తవుతాయనే నమ్మకం మాత్రం కలగడం లేదు. సబ్కాంట్రాక్టులతోనే సమస్య పుష్కరాల పనుల్లో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా దోచేసుకుంటున్నారు. అసలు కాంట్రాక్టర్‌ను కాదని... తమ అనుచరులకు సబ్ కాంట్రాక్టు పేరుతో పనులు తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారపార్టీకి దగ్గరగా ఉండే కాంట్రాక్టర్లు... అసలు కాంట్రాక్టు సంస్థ నుంచి కొంత మొత్తం పర్సంటేజీ ఇచ్చి పనులు తీసేసుకున్నారు. వాస్తవానికి ఈ పనులను చేసేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం కానీ, మనుషులు కానీ లేకపోవడంతోనే వీరందరూ టెండరులో పాల్గొనలేదు. అయినప్పటికీ అధికారపార్టీ ప్రాపకంతో సబ్ కాంట్రాక్టు పేరుతో పనులు సంపాదించుకున్నారు. వీరికి అనుభవం లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీశైలంలోనూ ఇదే పరిస్థితి... పుష్కరాలకు ఒకవైపు శ్రీశైలం ముస్తాబవుతోంది. అయితే, గతంలో బహత్తర ప్రణాళిక కింద చేపట్టిన పనులు ఇంకా పూర్తికాలేదు. ఇప్పుడు హడావుడిగా చేస్తున్న పనులను నిలిపివేశారు. ఇదే విధంగా నీటి సరఫరా వ్యవస్థ కోసం శ్రీశైలం పురవీధుల్లో తవ్విన రోడ్లను తాత్కాలికంగా పూడ్చేశారు. ఇక్కడ ఇప్పటివరకు రోడ్లు వేయలేదు. దీంతో పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా మట్టితో పూడ్చిన తర్వాత మిగిలిన బండరాళ్లు ఎక్కడికక్కడ ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి. -
పాతాళగంగలో మునిగి యువకుడి మృతి
శ్రీశైలం (కర్నూలు జిల్లా) : శ్రీశైలం పాతాళగంగలో మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. హైదరాబాద్ నుంచి శనివారం నలుగురు యువకులు శ్రీశైలం వెళ్లారు. వారు దైవ దర్శనం అనంతరం పాతాళగంగలో ఈత కొడుతుండగా ఓంకార్(20) అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. మిగిలిన ముగ్గురు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో ఓంకార్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. మృతుడు హైదరాబాద్ బషీర్‌బాగ్‌కు చెందిన వాడని అతని స్నేహితులు తెలిపారు. -
పాతాళగంగలో దూకి దంపతుల ఆత్మహత్య
శ్రీశైలం: శ్రీశైలంలోని పాతాళగంగలో దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పాతాళగంగలో మృతదేహలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు మృతదేహలను వెలికితీశారు. వివరాలు.. దంపతులిద్దరు కండువా సహాయంతో ఒకరిని ఒకరు కట్టుకుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాల పరిస్థితి బట్టి దంపతులు సోమవారమే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చిన పోలీసులు భావిస్తున్నారు. మృతుల వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా ప్రకాశం జిల్లా పాతనేనిపల్లికి చెందిన రమణ దంపతులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. వీరి మృతికి గత కారణాలు తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతుంది.