మనసు కేరింత.. తనువు తుళ్లింత
మనసు కేరింత.. తనువు తుళ్లింత
Published Mon, Aug 15 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
– పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లకు భక్తుల రద్దీ
– పనిచేయని మెటల్ డిటెక్టర్లు
– ఘాటు వద్ద సేకరించిన చెత్తను పక్కనే పడేస్తున్న వైనం
– వసతి సౌకర్యం లేక ఆలయం ముందే బస
– అధికారుల హాజరుకు బయోమెట్రిక్ అమలు
– భక్తులకు అన్నం వడ్డించిన కలెక్టర్
శ్రీశైలం నుంచి సాక్షి ప్రతినిధి:
మనసులో శివున్ని తలచుకుంటూ.. కృష్ణా నదిలో మునకేస్తూ.. చల్లని కొండగాలి పీలుస్తూ పుష్కరస్నానంతో పునీతులవుతున్న భక్లు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సెలవు దినాలు కావడంతో పుష్కరాల మూడవ రోజు ఆదివారం జిల్లాలోని ఐదు ఘాట్లలో భక్తుల సంఖ్య లక్ష దాటినట్లు అధికారుల అంచనా. రెండు రోజుల పాటు పాతాళగంగ ఘాట్‌లో పలుచగా ఉన్న భక్తుల సంఖ్య కాస్తా ఆదివారం నాటికి భారీగా పెరిగింది. రోప్‌వేను అనుమతించడంతో పాతాళగంగలో స్నానం చేసేందుకు వచ్చే భక్తుల సంఖ్య అమాంతంగా అధికం కాగా.. లింగాలగట్టు, సంగమేశ్వరంలో పుష్కర హోరు కొనసాగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి పాతాళగంగలో పుణ్యస్నానం చేసి పిండ ప్రదానం చేశారు. ఇక కలెక్టర్, డీఐజీ, ఎస్పీలు ఘాట్లను పర్యవేక్షిస్తూ భక్తుల ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు అధికమవుతున్నాయి. బట్టలు మార్చుకునేందుకు గదులు లేక, మరుగుదొడ్ల డోర్లు విరిగిపోవడంతో ప్రధానంగా స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక భక్తులను చెకింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లు సరిగా పనిచేయలేదు. లింగాలగట్టు వద్ద చార్జింగ్ లేక డిటెక్టర్లు మొరాయించాయి. సిబ్బంది అంతా విధులకు హాజరవుతున్నారా? లేదా అని పర్యవేక్షించేందుకు ట్యాబ్‌ల ద్వారా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. లింగాలగట్టు వద్ద వచ్చే భక్తులకు వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదానం వద్ద కలెక్టర్ విజయమోహన్ స్వయంగా భక్తులకు అన్నం వడ్డించారు.
రోప్‌వేకు తాకిడి..
పాతాళగంగకు వెళ్లే మార్గంలో రోప్‌వేకు అనుమతించారు. దీంతో పాతాళగంగలో స్నానం ఆచరించే భక్తుల సంఖ్య రెండు రోజులతో పోలిస్తే ఆదివారం భారీగా పెరిగింది. ఫలితంగా రోప్‌వేకు తాకిడి అధికమయింది. ఈ నేపథ్యంలో రోప్‌వేతో పాటు పాతాళగంగకు వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా జీపులను వేశారు. పాతాళగంగ ఘాటు వద్ద పిండ ప్రదానానికి, బట్టలు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన గదుల వద్దకు వెళ్లే మార్గంలో హడావుడిగా ఏర్పాటు చేసిన నాపరాతి బండలను తొలగించారు. ఈ స్థానంలో కొత్తగా సిమెంట్ రోడ్డును రాత్రికి రాత్రి సిద్ధం చేశారు.
పాము కలకలం
పాతాళగంగ ఘాటు వద్ద పాము కలకలం రేపింది. ఘాటు వద్ద పాము కనిపించడంలో భక్తులు ఆందోళనకు లోనయ్యారు. అయితే, మరోవైపు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్స కేంద్రంలో తేలు, పాముకాటుకు గురైతే వెంటనే చికిత్స అందించేందుకు మందులు అందుబాటులో లేకపోవడం ఏదయినా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటనే చర్చకు తావిచ్చింది. కేవలం జ్వరం, ఒళ్లునొప్పులు, గాయాలకు మాత్రమే మందులు అందుబాటులో ఉంచారు.
ఇవీ పుష్కర ఇబ్బందులు
– భక్తులందరికీ వసతి కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. ఇదే అదనుగా కొద్ది మంది మధ్యవర్తులు భక్తులను దోచుకుంటున్నారు. మాములు గదికి రూ.1700 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇంత అధిక మొత్తం చెల్లించలేని భక్తులు ఆలయం ముందే నిద్రిస్తున్నారు.
– లింగాలగట్టు ఘాట్ వద్ద సేకరించిన చెత్తను పక్కనే పడేస్తున్నారు. ఇది గాలికి మళ్లీ తిరిగి వచ్చి ఘాటుకు వస్తోంది.
– ఘాట్ల వద్ద అన్ని శాఖల అధికారులు సక్రమంగా హాజరుకావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదయం 8 గంటలకే ఏర్పాటు చేయాల్సి ఉన్న ఆయుష్, హోమియో స్టాల్స్ 9 గంటల 40 నిమిషాలకు కానీ ఏర్పాటు కాలేదు.
Advertisement