మినీ ఇండియా
సాక్షి, పటాన్చెరు : అసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన పటాన్చెరు వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికుల సంగమంగా విరాజిల్లుతోంది. గతంలో సంగారెడ్డి నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న ఈ ప్రాంతం 2008లో పటాన్చెరు కేంద్రంగా శాసనసభ స్థానంగా రూపుదిద్దుకుంది. అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లోనూ కార్మిక సంఘాల నేతలే శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు.
పటాన్చెరు నియోజకవర్గ ముఖచిత్రం..
మొత్తం ఓటర్లు : 2,73,210
పురుషులు: 1,40,988
మహిళలు: 1,32,168
ఇతరులు: 54
పోలింగ్ స్టేషన్లు: 340
2009లో తొలి సారి ఎన్నికలు
2009లో తొలి సారిగా పటాన్చెరు నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. నియోజకవర్గాల పునర్విభజనలో పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం మండలాలను కలుపుతూ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి టి. నందీశ్వర్‌గౌడ్ ఎన్నికయ్యారు. తన సమీప అభ్యర్థి ఎం.సపాన్‌దేవ్‌పై నందీశ్వర్ విజయం సాధించారు. 2014లో నిర్వహించిన ఎన్నికల్లో వైసీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన గూడెం మహిపాల్‌రెడ్డి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సపాన్‌దేవ్‌కు 55100 ఓట్లు రాగా మహిపాల్‌రెడ్డికి 73986 ఓట్లు వచ్చాయి. సంగారెడ్డి నియోజకవర్గంలో పటాన్చెరు అంతర్భాంగా ఉన్న సమయంలో పటాన్‌చెరుకు చెందిన దివంగత నాయకులు నర్సింహ్మారెడ్డి(స్వతంత్ర–1978), సదాశివరెడ్డి(టీడీపీ–1994) ఎమ్మెల్యేలుగా పని చేశారు. 1999లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ప్రపంచ స్థాయి కీర్తి..
పటాన్చెరు ప్రాంతం నిజాం కాలంలో సుభా కేంద్రంగా పట్టణ రూపురేఖలను సంతరించుకుంది. ఇక్కడ గొప్ప వ్యాపారం కేంద్రం ఉండేదని చరిత్రకారులు చెబుతుంటారు. గొల్కండ కోటకు మొత్తం ఏడు దర్వాజలు ఉండగా ఒక దాని పేరు పటాన్చెరు దర్వాజగా ఉంది. నిజాంకాలంలో పటాన్చెరు ప్రాంతం సుభా కేంద్రాంగా ఉంది. ఆ తర్వాత ఇక్రిశాట్, బీహెచ్ఈఎల్, బీడీఎల్ ఏర్పాటుతో పటాన్‌చెరుకు ప్రపంచè స్థాయి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. రాను రాను పటాన్చెరు అంటేనే పరిశ్రమల కేంద్రంగా పేరొందింది. ఇది ఇలా ఉంటే 2010 నాటికి ఈ ప్రాంతంలో 15 వందల పరిశ్రమలు మూత పడ్డాయి. ఈ ప్రాంతం భూలోక నరకంగా, కాలుష్యానికి చిరునామాగా మిగిలింది.
మిని ఇండియాగా..
దేశం నలుమూలల నుంచి వలస వచ్చి వివిధ పరిశ్రమల్లో పని చేస్తున్న వారితో ఈ ప్రాంతం మిని ఇండియాగా మారింది. పటాన్చెరు నియోజకవర్గం ప్రాంతంలోని పాశమైలారం పారిశ్రామికవాడ, బొల్లారం ప్రాంతంలోని పరిశ్రమల్లో దాదాపు అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలను చూడవచ్చు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. వివిధ దేశాలకు చెందిన పెట్టుబడిదార్లు ఇక్కడ ఉన్న తమ పరిశ్రమలను పరిశీలించేందుకు వచ్చి వెళ్తుంటారు. తాజాగా అమెజాన్, గ్రోఫర్స్ వంటి ఎంఎన్సీ ఆన్లైన్ వ్యాపార సంస్థలు ఇక్కడ తమ గిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నాయి. దేశంలో ఏ ప్రాంతానికైనా సరకులను సరఫరా చేసేందుకు నాగులపల్లిలో కంటేనర్ కార్పొరేషన్ సంస్థ ఇన్లాండ్ కంటేనర్ రావాణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. త్వరలో మూసాపేట(హైదరాబాద్)లోని కాంకార్డ్ను నాగులపల్లికి తరలించనున్నట్లు సమాచారం. పటాన్చెరు నియోజకవర్గ ప్రాంతంలో ఔటర్ రింగ్‌రోడ్డు దాదాపు 24 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
ఓఆర్ఆర్ ఏర్పాటుతో పటాన్చెరు ప్రాంతం రూపురేఖలు మారిపోయి పట్టణం విస్తరించింది. సమీప ప్రాంతాలకు సైతం పట్టణ రూపు వచ్చింది. రెండు దశాబ్ధాల క్రితం అమీన్పూర్లో ఎనిమిది వేల జనాభ ఉండేది. ప్రస్తుతం ఆ గ్రామంలో వందకు పైగా కాలనీలు వెలిశాయి. తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం ప్రాంతాలు పట్టణాలుగా రూపాంతరం చెందాయి. పాలన సౌలభ్యత కోసం ప్రభుత్వం వాటిని మున్సిపాల్టీలుగా మార్చింది. అవి మాత్రమే కాకుండా అన్ని గ్రామాల్లో కాలనీలు వెలిశాయి. జిన్నారంలోని కొన్ని ప్రాంతాలు మినాహా దాదాపు నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాలు నగర రూపును సంతరించుకున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూర గేటెడ్ కమ్యూనిటీలు వెలిశాయి.
కార్మిక వర్గాలే కీలకం
ప్రభుత్వ రంగ, ప్రైవేటు పరిశ్రమల్లో పని చేసే కార్మిక వర్గాల సమస్యలను పరిష్కరించే నాయకులకు ఇక్కడ ఆదరణ లభిస్తోంది. తాజా మాజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి గత ఎన్నికల్లో కార్మిక వర్గాల విశ్వాసాన్ని చురగొన్నారు. అంతకుముందు పటాన్చెరు తొలి ఎమ్మెల్యేగా పని చేసిన నందీశ్వర్‌గౌడ్ కూడ గతంలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇద్దరు కూడ దివంగత కాంగ్రెస్ నేత, కార్మిక, శ్రామిక వర్గాల నాయకుడిగా గుర్తింపు పొందిన పి.జనార్ధన్‌రెడ్డి శిష్యులుగా గుర్తింపు పొందారు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న పరిశ్రమల్లో పని చేసే వారంతా తెలంగాణాలోని ఇతర జిల్లాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారు.
ఈ ప్రాంతంలో ఆయా పరిశ్రమల పేరిట కాలనీలు ఏర్పడ్డాయి. ఆల్విన్, డిఫెన్స్, బీడీఎల్, బీరంగూడలోని ఐటీ డబ్లు్య, స్నిగ్నోడ్, ఎన్ఎస్ఎల్ కాలనీ ఇలా వందలాది కాలనీలు ఆయా పరిశ్రమల పేరిటే ఉన్నాయి. కార్మిక వర్గాలకు గతంలో ఇళ్లు ఇప్పించేందుకు నాయకులు కృషి చేశారు. ఇప్పుడు బీహెచ్ఈఎల్ కార్మిక సంఘాలు కూడ చౌకగా కార్మికులకు ఇళ్లు ఇప్పించేందుకు ప్రైవేటు భూములు కొనుగోలు చేసి ఇళ్లు కట్టిస్తున్నాయి.