‘56’ ఛాతీ అక్కర్లేదు
పటేళ్లకు కోటా చాలు: హార్దిక్ బెయిల్‌పై విడుదలైన పటేళ్ల నేత
సూరత్ : ‘నాకు 56 అంగుళాల ఛాతీ అవసరం లేదు. మా సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించండి చాలు’ అని పటేల్ వర్గం కోటా ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ అన్నారు. యూపీని గుజరాత్‌లా మార్చాలంటే 56 అంగుళాల ఛాతీ కావాలని ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యల్ని ఎద్దేవా చేస్తూ హార్దిక్ ఇలా స్పందించారు. 9 నెలల జైలు నిర్బంధం అనంతరం గుజరాత్ హైకోర్టు తీర్పుతో హార్దిక్ శుక్రవారం లజ్‌పోర్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు.
జైలు వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఓబీసీ కోటాలో తమ సామాజిక వర్గానికి స్థానం కల్పించేంత వరకు ఆందోళనలను కొనసాగిస్తామని, ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు.ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమన్నారు. ఆరు నెలలు రాష్ట్రంలో ఉండరాదనే షరతుపై హార్దిక్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.