pathankot air force base
-
ఆ ఎస్పీ తీరుపై అనుమానాలు!
పఠాన్‌కోట్: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి ఘటనలో గురుదాస్‌పుర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయనను అదుపులోకి తీసుకొని విచారించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) భావిస్తోంది. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిపై ఎన్ఐఏ బుధవారం అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది. ఈ దాడి విషయంలో సల్వీందర్ సింగ్ తీరు అసబద్ధంగా ఉందని ఎన్ఐఏ డీజీ శరద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి ముందు ఎస్పీ సల్వీందర్ సింగ్ ప్రయాణిస్తున్న అధికారిక వాహనాన్ని ఉగ్రవాదులు అడ్డగించారు. అందులో ఉన్న ఎస్పీతోపాటు ఉన్న అతని స్నేహితుడు రాజేశ్‌వర్మ, వంటమనిషిని తాడుతో కట్టేసి చితకబాదారు. ఆ తర్వాత ఎస్పీ అధికారిక వాహనాన్ని హైజాక్ చేసి.. తమతోపాటు వర్మను బంధించి తీసుకెళ్లారు. ఉగ్రవాదుల నుంచి తప్పించుకున్న ఈ ముగ్గురు ఘటన గురించి తరచూ భిన్నమైన ప్రకటనలు చేస్తుండటం, ముఖ్యంగా ఎస్పీ సల్వీందర్ సింగ్ వైఖరి తరచూ మారుతుండటంతో ఆయన ఉగ్రవాదులకు సహకరించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ సల్వీందర్ సింగ్‌తోపాటు రాజేశ్‌వర్మ, వంటమనిషిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని ఎన్ఐఏ భావిస్తోంది. -
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది మేమే
పఠాన్‌కోట్ : పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌పై దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్ ప్రేరేపిత యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ ప్రకటించుకుంది. వైమానిక స్థావరంపై దాడిలో కాశ్మీరీ తీవ్రవాదులే పాల్గొన్నారని ఆ సంస్థ వెల్లడించారు. వివిధ తీవ్రవాద గ్రూపులతో ఏర్పాటైన కశ్మీర్ ఉగ్రవాద సంస్థ యునైటెడ్ జిహాద్ కౌన్సిల్‌కు ఉగ్రవాది సయ్యద్ సలాహుద్దీన్ చీఫ్‌గా ఉన్నాడు. తమకు చెందిన హైవే స్క్వాడ్ దాడులు చేసినట్లు యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ పేర్కొంది. అయితే ఈ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం మాత్రం కొట్టిపారేసింది. మూడోరోజు కూడా పఠాన్ కోట్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ భద్రతా బలగాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా పఠాన్‌కోట్ వైమానిక స్థావరాన్ని ఉగ్రవాదులు ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. భారత్-పాక్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వైమానిక స్థావరం. పాకిస్థాన్ నుంచి భారత్‌పై దాడి జరిగితే మొదటి రక్షణ కవచం ఇది. జమ్మూ కశ్మీర్లో నిర్వహించే ఆపరేషన్స్‌కు ఇది సపోర్టుగా ఉంటుంది. 75 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ వైమానిక స్థావరంలో మిగ్ -21 ఫైటర్ విమానాలు 108 మంది స్వ్కాడ్రన్ లీడర్స్ ఉంటారు. 125 హెలికాప్టర్ యూనిట్ గ్లాడియేటర్స్‌కు కూడా ఇది స్థావరం 1965 యుద్ధం నుంచి పాకిస్థాన్ పఠాన్‌కోట్‌ను టార్గెట్ చేసింది. 1971లో జరిగిన యుద్ధంలో ఇక్కడి రన్ వే కొంచెం దెబ్బతింది. ఈ ఎయిర్ బేస్‌ను 'ప్రైడ్ ఆఫ్ ఇండియా'గా చెప్పుకుంటారు.