కెప్టెన్ అమరీందర్ సింగ్ సతీమణికి కాంగ్రెస్ షాక్..
న్యూఢిల్లీ: పంజాబ్ పాటియాల నియోజకవర్గం ఎంపీ, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సతీమణి పర్నీత్ కౌర్‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పర్నీత్ కౌర్‌పై పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుందని కాంగ్రెస్ తెలిపింది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ బీజేపీకీ ప్రయోజనం చేకూర్చుతున్నారని తరచూ ఫిర్యాదులు వస్తున్నందునే ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు చెప్పింది.
పర్నీత్ కౌర్ భర్త కెప్టెన్ అమరీందర్ సింగ్ 2021లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. దీంతో ఎన్నికల అనంతరం పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం కమలం పార్టీలోనే కొనసాగుతున్నారు.
చదవండి: నేను లాయర్.. నా ఇష్టం.. లోకల్ ట్రైన్లో యువతి రుబాబు..