పేటీఎం అంటే.. పే టు మోదీ!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. రోమన్ చక్రవర్తి నీరోలా వ్యవహరిస్తున్నారని, రోమ్ నగరం తగలబడిపోతుంటే ఆయన ఫిడేలు వాయించుకున్నట్లుగానే ఈయన వ్యవహారం ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పేటీఎం అంటే 'పే టు మోదీ' అన్నట్లుగా తయారైందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. పేటీఎం లాంటి ఈ వ్యాలెట్ కంపెనీలకు లాభం చేకూర్చడానికే ఆయన పెద్దనోట్లను రద్దుచేశారని ఆరోపించారు. నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాని 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసినప్పటి నుంచే పేటీఎం లాంటి ఈ వ్యాలెట్ కంపెనీల లావాదేవీలు ఒక్కసారిగా పెరిగిపోయాయని అన్నారు. నగదురహిత లావాదేవీల వల్ల కొద్దిమంది అత్యధిక ప్రయోజనం పొందుతున్నారని పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. లోక్‌సభలో తనను మాట్లాడినిస్తే ఈ కుంభకోణాన్ని బయటపెడతానన్నారు.
ప్రధాని కొన్ని కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. పెద్దనోట్లను రద్దుచేసిన తర్వాత.. అసలు నగదు అన్నదే దొరక్కపోవడంతో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మాత్రం నవ్వుతూనే ఉన్నారని మండిపడ్డారు. ఇది మూర్ఖపు చర్య అని, ఎవరినీ పరిగణనలోకి తీసుకోకుండా హడావుడిగా నిర్ణయం తీసేసుకున్నారని అన్నారు. పేదలు, రైతులు, రోజుకూలీల కుటుంబాల మీద దీనివల్ల తీవ్ర ప్రభావం పడిందన్నారు. తాను సభలో మాట్లాడాలనే అనుకుంటున్నానని, తన ఉపన్యాసం కూడా సిద్ధంగా ఉందని, బీజేపీ వాళ్లు వచ్చి సభ ప్రారంభిస్తే అప్పుడు తెలుస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రధానమంత్రి మోదీ లోక్‌సభకు రావాలని, తనను మాట్లాడనివ్వాలని, ఆ తర్వాత లోక్‌సభలోనే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్లు మాత్రం పెద్దనోట్ల రద్దుపై చర్చ జరిగినంతసేపు ప్రధాని మోదీ రాజ్యసభలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.