pdp bjp coallation
-
కశ్మీర్లో సంబరాలు
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు రావడంతో స్థానిక ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పీడీపీ నుంచి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం బీజేపీ ప్రకటించగా, మెహబూబా ముఫ్తీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై కశ్మీర్ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీనగర్, కుప్వారా, పహల్గాం జిల్లాలో ప్రజలు రోడ్డ మీదకు వచ్చి టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘పీడీపీ-బీజేపీ కూటమి అపవిత్రమైనది. పీడీపీ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాకు ఇష్టంలేదు. ఇప్పటికైన వారి కూటమి విడిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని స్థానికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కశ్మీర్ ప్రముఖ వ్యాపారవేత్త నసీర్ మాట్లాడుతూ.. ‘పీడీపీ-బీజేపీ కూటమి ఉత్తర, దక్షిణ ధ్రువాలు వంటి పార్టీలు. రెండు పార్టీల సిద్ధాంతాలు పూర్తిగా వ్యతిరేకమైనవి. బీజేపీకి కశ్మీర్ ప్రజల పట్ల ప్రేమ లేదు. వారి కూటమి వల్ల కశ్మీర్ చాలా నష్టపోయింద’ని అన్నారు. కొంత మంది ప్రజలు మాత్రం గవర్నర్ పాలనలో అవినీతి విపరీతంగా ఉంటుందని, రాష్ట్రంలో పరిస్థితి మరింతగా క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రంగంలోకి అమిత్‌షా.. ఏమైనా జరగొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రంగ ప్రవేశంతో జమ్ము కశ్మీర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మంగళవారం ఉదయం ఉన్నపళంగా రావాలంటూ జమ్ము కశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యేలకు సమన్లు జారీ చేయటంతో.. వారంతా హస్తిన చేరుకున్నారు. ఈ క్రమంలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)-బీజేపీ పొత్తు తెగదెంపుల దాకా వెళ్లిందా? అన్న కోణంలో జాతీయ మీడియాలో వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి. రంజాన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలానుసారం నెల రోజుల పాటు భారత సైన్యం కాల్పుల విరమణను పాటించింది. వేర్పాటువాదులతో చర్చలకు ఇదే మంచి తరుణమని జమ్ము కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ.. కేంద్రం నిర్ణయాన్ని ప్రశంసించారు. అయితే సరిగ్గా రంజాన్‌కు రెండు రోజుల ముందు 'ది రైజింగ్ కశ్మీర్' సంపాదకుడు సుజాత్ భుకారీ హత్య, ఆపై ఆర్మీ రైఫిల్ మ్యాన్ ఔరంగజేబును ఉగ్రవాదులు దారుణంగా హతమార్చారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఈ తరుణంలో కాల్పుల విరమణను పక్కనబెట్టి, చర్యలకు ఉపక్రమించాలని సైన్యానికి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది పీడీపీ వర్గాలకు ఏ మాత్రం సహించలేదు. కాల్పుల విరమణను మరికొంత కాలం పొడిగించి ఉంటే శాంతిచర్చలు ఓ కొలిక్కి వచ్చి ఉండేవేమోనని ఆమె భావించారు. కానీ, హఠాత్తుగా(తమను మాట వరుసకు కూడా సంప్రదించకుండా) కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ముఫ్తీ జీర్ణించుకోలేకపోయారు. కశ్మీర్లో పరిస్థితులు మళ్లీ అదుపు తప్పుతాయన్న ఆందోళనలో ఆమె ఉన్నారు. ఇప్పటికే చాలా అంశాల్లో పీడీపీ-బీజేపీల మధ్య విభేదాలు ఉండగా, కాల్పుల విరమణపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మెహబూబా ముఫ్తీ అసంతృప్తితో రగలిపోతున్నారు. ఈ తరుణంలో అమిత్ షా నుంచి పిలుపు అందుకున్న కశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యేలు.. భేటీ కావటం విశేషం. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి, భద్రతాంశాలపై ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ నేతలతో అమిత్ షా చర్చించనున్నట్లు బోగట్టా. అదే సమయంలో పీడీపీతో విడిపోతే వచ్చే పరిస్థితులపైనా చర్చించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వం సాగుతున్న తీరుపై బీజేపీ నేతల్లోనూ అసంతృప్తి పెరిగిపోయినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. -
ముఖ్యమంత్రి పదవా.. ఇప్పుడైతే నాకొద్దు!
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణించి ఇప్పటికి 23 రోజులు గడిచింది. కానీ ప్రస్తుత పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాత్రం అధికార పగ్గాలు చేపట్టడానికి ససేమిరా అంటున్నారు. వారం రోజుల సంతాప దినాలు ముగిసిన తర్వాత ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని అంతా భావించారు. దివంగత సీఎం కూడా తన ఆరోగ్యం బాగోవట్లేదని, తన కుమార్తెకు నాయకత్వం అప్పగించాలని భావిస్తున్నానని గతంలో చెప్పారు. దానికి అనుగుణంగానే పార్టీ వర్గాలు కూడా మెహబూబా ముఫ్తీనే తమ నాయకురాలిగా ఎన్నుకున్నాయి. అయితే.. ప్రస్తుతం కశ్మీర్లో ఉన్న పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మాత్రం ముందు అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా నడవట్లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని.. ఇలాంటి తరుణంలో తాను సీఎం అయితే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని మెహబూబా ముఫ్తీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 10 నెలల్లో కూటమి ఎజెండా అమలు కాలేదన్నది ఆమె అభిప్రాయం. తన తండ్రి, పార్టీ ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని ఆమె ఆందోళన చెందుతున్నట్లు పీడీపీ అగ్రనాయకులు చెబుతున్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ముందు అనుకున్నదాని కంటే మరింత ఉదారంగా ముందుకొచ్చి, జమ్ము కశ్మీర్ ప్రజలకు మరిన్ని వరాలు ప్రకటిస్తే తప్ప రాబోయే కాలంలో పాలన సవ్యంగా సాగడం కష్టమేనన్నది ఆమె భావనగా తెలుస్తోంది. మెహబూబాకు సుదీర్ఘ రాజకీయ కెరీర్ ముందుందని, అందువల్ల ఆమె తాత్కాలిక ప్రయోజనాల కోసం తొందరపడే మనిషి కారని పార్టీ నాయకుడు ఒకరు అన్నారు. వేర్పాటువాదులతో చర్చల పునరుద్ధరణ, ఆర్మీ ఆక్రమించుకున్న భూములు ఖాళీ చేయించడం, విద్యుత్ ప్రాజెక్టుల యాజమాన్యాన్ని రాష్ట్రానికి తిరిగి ఇవ్వడం లాంటి అంశాలపై గట్టి హామీ కావాలని ఆమె కోరుకుంటున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు ఏ కూటమికీ మద్దతు ఇవ్వడానికి సుముఖంగా లేకపోవడంతో.. ఇక అక్కడ మధ్యంతర ఎన్నికలు వచ్చినా తప్పు లేదని పరిశీలకులు అంటున్నారు. మొత్తం 87 మంది సభ్యులున్న కశ్మీర్ అసెంబ్లీకి 2014లో జరిగిన ఎన్నికల్లో పీడీపీకి 28 స్థానాలు రాగా, బీజేపీ 25 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12, సీపీఎంకు 1, పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు 2 స్థానాలు రాగా, మరో నాలుగు స్థానాల్లో ఇతరులు గెలిచారు.