ముఖ్యమంత్రి పదవా.. ఇప్పుడైతే నాకొద్దు!
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణించి ఇప్పటికి 23 రోజులు గడిచింది. కానీ ప్రస్తుత పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాత్రం అధికార పగ్గాలు చేపట్టడానికి ససేమిరా అంటున్నారు. వారం రోజుల సంతాప దినాలు ముగిసిన తర్వాత ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని అంతా భావించారు. దివంగత సీఎం కూడా తన ఆరోగ్యం బాగోవట్లేదని, తన కుమార్తెకు నాయకత్వం అప్పగించాలని భావిస్తున్నానని గతంలో చెప్పారు. దానికి అనుగుణంగానే పార్టీ వర్గాలు కూడా మెహబూబా ముఫ్తీనే తమ నాయకురాలిగా ఎన్నుకున్నాయి. అయితే.. ప్రస్తుతం కశ్మీర్‌లో ఉన్న పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మాత్రం ముందు అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా నడవట్లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని.. ఇలాంటి తరుణంలో తాను సీఎం అయితే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని మెహబూబా ముఫ్తీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 10 నెలల్లో కూటమి ఎజెండా అమలు కాలేదన్నది ఆమె అభిప్రాయం. తన తండ్రి, పార్టీ ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని ఆమె ఆందోళన చెందుతున్నట్లు పీడీపీ అగ్రనాయకులు చెబుతున్నారు.
కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ముందు అనుకున్నదాని కంటే మరింత ఉదారంగా ముందుకొచ్చి, జమ్ము కశ్మీర్ ప్రజలకు మరిన్ని వరాలు ప్రకటిస్తే తప్ప రాబోయే కాలంలో పాలన సవ్యంగా సాగడం కష్టమేనన్నది ఆమె భావనగా తెలుస్తోంది. మెహబూబాకు సుదీర్ఘ రాజకీయ కెరీర్ ముందుందని, అందువల్ల ఆమె తాత్కాలిక ప్రయోజనాల కోసం తొందరపడే మనిషి కారని పార్టీ నాయకుడు ఒకరు అన్నారు. వేర్పాటువాదులతో చర్చల పునరుద్ధరణ, ఆర్మీ ఆక్రమించుకున్న భూములు ఖాళీ చేయించడం, విద్యుత్ ప్రాజెక్టుల యాజమాన్యాన్ని రాష్ట్రానికి తిరిగి ఇవ్వడం లాంటి అంశాలపై గట్టి హామీ కావాలని ఆమె కోరుకుంటున్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు ఏ కూటమికీ మద్దతు ఇవ్వడానికి సుముఖంగా లేకపోవడంతో.. ఇక అక్కడ మధ్యంతర ఎన్నికలు వచ్చినా తప్పు లేదని పరిశీలకులు అంటున్నారు. మొత్తం 87 మంది సభ్యులున్న కశ్మీర్ అసెంబ్లీకి 2014లో జరిగిన ఎన్నికల్లో పీడీపీకి 28 స్థానాలు రాగా, బీజేపీ 25 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12, సీపీఎంకు 1, పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు 2 స్థానాలు రాగా, మరో నాలుగు స్థానాల్లో ఇతరులు గెలిచారు.