శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు రావడంతో స్థానిక ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పీడీపీ నుంచి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం బీజేపీ ప్రకటించగా, మెహబూబా ముఫ్తీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై కశ్మీర్ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీనగర్, కుప్వారా, పహల్గాం జిల్లాలో ప్రజలు రోడ్డ మీదకు వచ్చి టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
‘పీడీపీ-బీజేపీ కూటమి అపవిత్రమైనది. పీడీపీ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాకు ఇష్టంలేదు. ఇప్పటికైన వారి కూటమి విడిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని స్థానికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కశ్మీర్ ప్రముఖ వ్యాపారవేత్త నసీర్ మాట్లాడుతూ.. ‘పీడీపీ-బీజేపీ కూటమి ఉత్తర, దక్షిణ ధ్రువాలు వంటి పార్టీలు. రెండు పార్టీల సిద్ధాంతాలు పూర్తిగా వ్యతిరేకమైనవి. బీజేపీకి కశ్మీర్ ప్రజల పట్ల ప్రేమ లేదు. వారి కూటమి వల్ల కశ్మీర్ చాలా నష్టపోయింద’ని అన్నారు. కొంత మంది ప్రజలు మాత్రం గవర్నర్ పాలనలో అవినీతి విపరీతంగా ఉంటుందని, రాష్ట్రంలో పరిస్థితి మరింతగా క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment