దేవుడికే పంగనామాలు!
మంగళగిరి (గుంటూరు): ఓ అర్చకుడు రూ.4 కోట్ల విలువైన ఆలయ భూమికి తన పేరుతో పాస్‌పుస్తకం పుట్టించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి సర్వే నంబర్ 14లో 13.20 ఎకరాల భూమి ఉంది. అందులో 3.40 ఎకరాలను సాగు చేసుకునే హక్కును అర్చకుడికి దేవదాయ శాఖ కల్పించింది. అయితే ఆలయ అర్చకుడు నిడమానూరు కృష్ణమూర్తి 1998లో తన పేరున పాస్‌పుస్తకానికి దరఖాస్తు చేసుకున్నారు. 1.71 ఎకరాలకు అప్పటి రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకం మంజూరు చేశారు. ఆ భూమి విలువ సుమారు రూ.4 కోట్లు. దేవాలయం పేరిట ఉన్న భూమిని రెగ్యులర్ ఖాతాలో ఆన్లైన్ చేయాలని ఇటీవల ఆలయ ఈఓ దరఖాస్తు చేశారు.
అర్చకుడు కృష్ణమూర్తి కూడా పాస్‌పుస్తకం ఇచ్చి తన భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను కోరాడు. తహసీల్దార్ జి.వి.రామ్‌ప్రసాద్ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా అర్చకుడికి అనుభవించే హక్కు మాత్రమే ఉందని తేలింది. అయితే అతని పేరుతో 1998లో పట్టాదారు పాసుపుస్తకం మంజూరైందని వెల్లడైంది. అర్చకుడి పేరుతో ఇచ్చిన పాసుపుస్తకాన్ని రద్దుచేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. కాజ గ్రామంలో 11 ఎకరాల పీర్ల మాన్యం, నూతక్కిలో 80 సెంట్ల దేవదాయ శాఖ భూమి ఆక్రమణకు గురైనట్టు గుర్తించి నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. మండలంలోని ఆక్రమణలకు గురైన భూములన్నింటినీ గుర్తించేందుకు రీసర్వే ఉపయోగపడుతుందని, రికార్డులను పరిశీలించి ఒక్క సెంటు భూమిని కూడా వదలకుండా స్వాదీనం చేసుకుంటామని తెలిపారు.
చదవండి: ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి
ప్రముఖ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య