peeleru
-
కోవిడ్ కారాగారంగా పీలేరు సబ్‌జైల్
పీలేరు రూరల్ : పీలేరు సబ్‌జైల్‌ను కోవిడ్ కారాగారంగా మార్చినట్లు జిల్లా జైళ్లశాఖ అధికారి హుస్సేన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన పీలేరు సబ్‌జైల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హుస్సేన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పలు జైళ్ల నుంచి 138 మంది ఖైదీలను ఇక్కడకు తరలించామన్నారు. వీరిలో ఇప్పటి వరకు 83 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. నెగటివ్ వచ్చినవారిలో 50మందిని మదనపల్లెకు, 15మందిని చిత్తూరుకు, నలుగురిని సత్యవేడుకు, ఏడుగురిని తిరుపతి జైళ్లకు తరలించామని వివరించారు. మిగిలిన ఖైదీలకు కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అనంతరం సబ్‌జైల్ రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో జైలర్ ఫణికుమార్, సబ్‌జైల్ సూపరింటెండెంట్ రవిశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఉప్పు ప్యాకెట్లు+రేషన్ బియ్యం = బంగారం రెడీ!
ఉప్పు ప్యాకెట్లు+రేషన్ బియ్యం+పూజా సామగ్రి = బంగారం రెడీ! ఇప్పటివరకు ఎవరూ కనుగొనని బంగారం తయారీ ఫార్ములా ఇది!! ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? నిరీక్షణ ఫలిస్తే కిలోల కొద్దీ బంగారమే అంటూ.. బంగారం అని ఎగిరి గంతేసిన బంగారం పిచ్చోళ్ల ఆశని క్యాష్ చేసుకుంది అక్షర జ్ఞానంలేని ఓ మహిళ. ఈ ఫార్ములాతో ఉద్యోగస్తులు, విద్యావంతుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేసి జంప్ అయ్యింది. చివరకు మిగిలింది..ఉప్పూ.. బియ్యం..ఇటుకలేనని గగ్గోలు పెట్టడం బాధితుల వంతైంది. మీకూ ఈ ఫార్ములా కావాలంటే... సాక్షి, పీలేరు(చిత్తూరు): బంగారు నిధి ఇస్తానంటూ ఓ మహిళ పలువురినీ ఆకర్షించి, లక్షలకు లక్షలు వసూలు చేసి ఉడాయించిన సంఘటన పీలేరులో వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.2కోట్ల పైచిలుకు దండుకుని ఆమె అదృశ్యమైంది. బాధితుల కథనం..స్థానిక సైనిక్ నగర్లో మల్లిక (55) అనే మహిళ కొన్నేళ్లుగా నివసిస్తోంది. ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆ వృత్తిపై విరక్తి పుట్టిందేమో మరి.. తనకు వచ్చిన కొత్త ఆలోచన, కలలకు రెక్కలు తొడిగింది. తనకు నిధి దొరికిందని, అందులో కొంత ఇస్తానని కొందరికి నమ్మబలికింది. ఇందుకోసం కొంతకాలం పాటు పూజలు చేయాలని, ఈ పనిగా ఇతర రాష్ట్రాల నుంచి కొందరు స్వామీజీలు వస్తున్నారని, దొరికిన నిధికి శాంతి పూజలు చేసిన తర్వాతే ఆ బంగారాన్ని కరిగించే పనులు చేస్తామని చెప్పింది. ఆ తర్వాత బిస్కెట్ల రూపంలో మార్చి బంగారం ఇస్తానని చెప్పడంతో అందరూ బంగారు కలల్లో విహరించారు. పూజల కోసం లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. దీంతో మొదటి అంకం పూర్తయ్యింది. నెలలు దాటినా ఆమె బంగారం ఇవ్వకపోవడంతో కొందరు ఆమెపై ఒత్తిడి చేశారు. దీంతో ఆమె రెండో అంకానికి తెరతీసింది. వారికి ట్రంకు పెట్టెలు, సూటుకేసులు ప్లాస్టిక్ సంచుల్లో ఫుల్‌గా ప్యాక్ చేసి ఇచ్చింది. వీటిలో నిధి భద్రపరిచానని, తమ పూజలు పూర్తయ్యాకే వాటిని తెరవాలని, ఈలోపు వాటిని తెరిస్తే పెట్టెల్లోని బంగారు నిధి బొగ్గులా మారిపోతుందని హెచ్చరించింది. పైగా ఆమె ఇచ్చిన సూట్‌కేసులు కూడా 10 నుంచి 20 కిలోల వరకూ బరువు ఉండడంతో అబ్బో! ఎంత నిధి ఉందో? ఇందులో అని సంబరపడ్డారు. వాటిని తీసుకెళ్లి ఇంట్లో పూజగదిలో భద్రపరిచారు. వారు సైతం నిత్యం ఆ ట్రంకుపెట్టెలు, సూట్‌కేసులకు రోజూ అగరుబత్తీలు వెలిగించి, కర్పూర హారతులు ఇచ్చి, పూజలు చేయడం మొదలెట్టారు. ఎన్నో అమావాస్యలు దాటాయి.. నెలలూ కరిగిపోయినా ఇంకా పూజల పేరిట మల్లిక దాటవేస్తుండటంపై అనుమానించారు. చివరకు ఓపిక నశించి ఏదైతే కానీలెమ్మని సూట్‌కేసులు, ట్రంకు పెట్టెలు తెరచి చూడాలని నిశ్చయించుకున్నారు. అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఎప్పటిలాగే వాటికి పూజలు చేశారు. పెట్టెల్లో నిధి ఏ రూపంలో కనిపిస్తుందోనని! తొలుత సూట్‌కేసులు ఉన్న ప్లాస్టిక్ గోనె సంచుల కుట్లను కత్తితో కట్ చేశారు. ఆ సంచుల నుంచి సూట్‌కేసులను జాగ్రత్తగా బయటకు తీశారు. తాళం తీసి చూశారు. అంతే! అందరి కళ్లూ బైర్లు కమ్మినట్లైంది. బంగారానికి బదులు పూజాసామగ్రి, దాని కింద ఐదు రూపాయల ఉప్పు ప్యాకెట్లు..ఆ తర్వాత రేషన్ బియ్యం..ఇటుకలు..ఇలా వన్ బై వన్ ఉండడం చూసి గొల్లుమన్నారు. ఆ సూట్‌కేసులతో మల్లిక ఇంటికి పరుగులు తీశారు. అయితే ఇంటికి తాళం వేసి ఉండటం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె జంప్ అయ్యిందని తెలుసుకున్నారు. తమను నిలువునా మోసగించిందని గ్రహించారు. ఇది దావాలనంలా వ్యాపించడంతో మరికొందరు బాధితులు ఆందోళన చెందారు. ఇళ్లకు పరుగులు తీసి సూట్‌కేసులు తెరిచారు. ఈ పర్యాయం గగ్గోలు పెట్టడం వీరి వంతైంది!! బాధితులు కొందరు పోలీసులను ఆశ్రయించారు. మరికొందరు చెప్పుకుంటే పరువు పోతుందని కిమ్మనకుండా ఉన్నారు. కొందరు పోలీసులు కూడా బంగారు నిధికి ఆశపడి రూ.20లక్షల వరకూ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తానికి పీలేరులో ఇది చర్చనీయాంశమైంది. రూ.50లక్షలు ఇచ్చా బంగారం ఇస్తానని చెప్పడంతో మేము కూడా రూ.50 లక్షలు ఇచ్చాం. అత్యాశకు పోయి, అప్పులు చేసి నిండా మునిగిపోయాం. బంధువులందరి దగ్గర అప్పు చేసి ఇచ్చాం. ఇప్పుడు ఏమి చెయ్యాలో దిక్కుతోచడం లేదు. – క్రిష్ణారెడ్డి, గోరంట్లపల్లె రూ.15లక్షలు ఇచ్చి మునిగా నాకు రూ.3 కోట్ల విలువైన బంగారం ఇస్తానని చెప్పడంతో నా కుమారునికి తెలియకుండా బంగారం తాకట్టుపెట్టి, కొంత అప్పులు చేసి రూ.15 లక్షలు ఇచ్చి నిండా మోసపోయా. పోలీసులు మాకు న్యాయం చేయాలి. – సరస్వతమ్మ, పీలేరు చదవండి : భక్తులను రెచ్చగొట్టడమే టీడీపీ ధ్యేయం -
కిరణ్ రాక ఆంతర్యం ?
సాక్షి, తిరుపతి: మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరు పర్యటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా పర్యటన సాగుతుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. కిరణ్ 28న సొంతగ్రామమైన నగరిపల్లి వస్తున్న సంగతి తెలసిందే.. చాలా రోజుల క్రితమే రావాలని భావించారాయన. తమ్ము డు కిషోర్‌కుమార్‌రెడ్డి వైఖరి వల్ల ఆలస్యం చేశారు. కిషోర్ టీడీపీలో చేరినప్పటి నుంచి వారి మధ్య అంతరం పె రిగింది. తమనాయకుడు చంద్రబాబేనని సోదరుడు తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో ఎలాగైనా గ్రామంలో మూడు రోజులు ఉండాలని ఆయన వర్గీయులు పట్టుబట్టారు. పంచాయతీరాజ్ అతిథిగృహంలో బస ఏర్పాటు చేశారు. ఆయన రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సోదరుడు అడ్డుకుంటున్నా కిరణ్ పర్యటనకేమొగ్గు చూపడం ఆసక్తి కలిగిస్తోంది. రాజకీయ సమీకరణాలే లక్ష్యంగా? తాను పదవుల్లో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి ఇంటికి వస్తుంటే రాకుండా సోదరుడు అడ్డుకోవటాన్ని కిరణ్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. పీలేరు నియోజకవర్గంలో కిరణ్ లేకపోతే కిషోర్ అనే వ్యక్తి ఎవ్వరికీ తెలిసే ప్రసక్తి లేదని స్థానికంగా మాజీ సీఎం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనను కిరణ్, ఆయన వర్గీయులు సవాలుగా తీసుకున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పర్యటన సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో పొత్తులున్నా, లేకపోయినా కిరణ్ పీలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. నేరుగా కిరణ్ పోటీ చేయకపోతే మరో తమ్ముడు సంతోష్‌ని బరిలో దింపాలని అలోచనలో ఉన్నట్లు తెలిసింది. అలా కాని పక్షంలో తన కుమారుడు అమరనాథ్‌రెడ్డిని కిరణ్ బరిలోకి దించాలని యోచిస్తున్నారని భోగట్టా. గతంలో ఎన్నికల సమయంలో ప్రచారం కూడా చేసిన అనుభవం ఉంది. ఆ ఇద్దరూ కాకపోతే పలవల రెడ్డప్పను పోటీ చేయించి సత్తా చాటుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. పొత్తులున్నా పోటీనే ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీ పొత్తుపెట్టుకుంటే పీలేరు అసెంబ్లీ టికెట్ కిరణ్‌కుమార్‌రెడ్డిని కాదనే పరిస్థితి ఉండదు. సీఎంగా పనిచేసిన వ్యక్తి పీలేరు టికెట్ అడిగితే అటు కాంగ్రెస్ కానీ, ఇటు టీడీపీ అడ్డుచెప్పే అవకాశమే లేదు. అదే జరిగితే కిషోర్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వస్తుందని రాజ కీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో కిరణ్ పర్యటనలో ఎవ్వరూ పాల్గొన వద్దని ఆయన అనుచరులకు కిషోర్ చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కిరణ్ మొదటి నుంచి ఏ విషయంలో అయినా గోప్యత పాటించేవారు. అదే గోప్యతను ఇప్పుడు కూడా పాటిస్తుండటం గమనార్హం. -
ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు..
ఓ విద్యాకుసుమం రాలిపోయింది. శ్రమ.. పట్టుదలతో ఉన్నత విద్యలో సోపానాలు అధి రోహించిన ఓ యువ వైద్యురాలి కథ విషాదాంతమైంది. వేధింపుల పర్వమే ఆమె హృదయాన్ని కలచివేసి చివరికి మృత్యువు ఎదుట తలవొంచేలా చేసింది. పీలేరుకు చెందిన డాక్టర్ శిల్ప (31) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హృదయాలను ద్రవింపజేసింది. ఆమె మృతిలో తిరుపతి వైద్యకళాశాలలో నిరసన ఎగిసింది. రుయా ఆస్పత్రి హెడ్ డాక్టర్ రవికుమార్ ఈ సంఘటనకు సంబంధించి సస్పెండయ్యారు. చిత్తూరు, పీలేరు: పీలేరులో డాక్టర్ శిల్ప ఆత్మహత్య సంఘటన సంచలనం సృష్టించింది. పట్టణానికి చెందిన రాధ, రాజగోపాల్ దంపతుల కుమార్తె శిల్ప తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివింది. అదే సమయంలో తిరుపతికి చెందిన రూపేష్‌కుమార్ రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకుంది. వైద్యవిద్యలో శిల్ప ప్రతిభ కనబర్చింది. పట్టభద్రురాలయ్యాక ప్రభుత్వ డాక్టర్గాఎంపికైంది. తంబళ్లపల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించేది. సర్వీసులో ఉండగానే పీడియాట్రిక్స్‌లో ఎండీ కోర్సు సీటు వచ్చింది. 2015–16 తిరుపతి రుయాలో చేరింది. పీజీ చేస్తుండగానే నాలుగు నెలల క్రితం ప్రొఫె సర్లు రవికుమార్, కిరీటి, శశికుమార్ తనను వేధిస్తున్నారని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసేదని భోగట్టా. స్థానికంగా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఫలితం లేకపోవడంతో గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు సంఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. గవర్నర్ ఆదేశాల మేరకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసి విచారణ జరిపింది. మానసిక స్థితి సక్రమంగా లేదంటూ ఆ కమిటీ భావిస్తున్నట్లు తెలుసుకుని డాక్టర్ శిల్ప తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. కమిటీ నివేదిక రహస్యంగా ఉంచడం, తనను వేధించిన ప్రొఫెసర్లపై ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో కుంగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే నెలాఖరులో విడుదలైన పీజీ పరీక్షల్లో ఫెయిలైంది. చదువులో ఉన్నతంగా రాణిస్తున్నా ప్రొఫెసర్లు ఫెయిల్ చేశారని శిల్ప ఆవేదన చెందేదని కుటుంబ çసభ్యులు చెబుతున్నారు. మరోమారు జవాబుపత్రాల దిద్దుబాటు చేయిం చినా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో శిల్ప మంగళవారం తానుంటున్న ఫ్లాట్‌లో ఉరివేసుకొని ఆత్మహ్యతకు పాల్పడింది. శిల్ప తండ్రి రాజగోపాల్ పీలేరులోని బరోడా బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తూ ఇటీవలే గుజరాత్‌కు బదిలీపై వెళ్లారు. తల్లి గృహిణి. చెల్లెలు శ్రుతి బెంగళూర్‌లో బీటెక్ చదివింది. ప్రాథమిక స్థాయి నుంచి శిల్ప బాగా చదివేది. ఎలాగైనా డాక్టర్ కావాలని లక్ష్యం పెట్టుకుంది. అనుకున్నట్లుగా ఎంబీబీఎస్ సీటు సాధించింది. వైద్యురాలైంది. భర్త రూపేష్‌కుమార్‌రెడ్డి మదనపల్లెలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో పనిచేసేవారు. రెండు సంవత్సరాల క్రితం పీలేరులోని చిత్తూరు మార్గంలో రుషి ఆర్ఢో అండ్ ట్రామా కేర్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ డాక్టరు దంపతులకు నాలుగు సంవత్సాల కుమారుడున్నాడు. అనూహ్య రీతిలో డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు దిగ్భ్రాం తికి గురయ్యారు. ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదు... వేధింపులకు భయపడకుండా ఎంతో ధైర్యంతో ప్రొఫెసర్లపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన శిల్ప ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని బంధువులంటున్నారు. శిల్ప మృతిపై వీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వేధింపులకు గురిచేసిన ప్రొఫెసర్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు.. మృతురాలి సోదరి శ్రుతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు ఇన్చార్జి సీఐ సిద్ధతేజమూర్తి, ఎస్ఐ పీవీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ల వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. నేడు విచారణ కమిటీ. యూనివర్సిటీ క్యాంపస్: శిల్ప మృతితో వేసిన విచారణ కమిటీ బుధవారం కళాశాలలో విచారణ చేపట్టనుంది. కమిటీ విద్యార్థులను, అధ్యాపకులను, ఇతర అధికారులను రహస్యంగా విచారించనుంది. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఎవరూ భయపడవద్దని అధికారులు చెబుతున్నారు. -
కత్తి మహేష్‌కు మరో చేదు అనుభవం!
సాక్షి, తిరుపతి : శ్రీరాముడిపై తరుచూ వివాదస్పద వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలతో సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై ఇదివరకే ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ విధించిన విషయం విధితమే. అయితే తన సొంతూరుకు వెళ్లాలనుకున్న కత్తి మహేష్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. అతడిని స్వగ్రామానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడం గమనార్హం. చిత్తూరు జిల్లా ఎర్రవారిపల్లి మండలంలోని తన స్వగ్రామం యలమందకు వెళ్తున్నట్లు పీలేరు పోలీసులకు కత్తి మహేష్ తెలిపారు. ఈ మేరకు పీలేరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆయనను పోలీసులు వద్దని వారించారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా కత్తి మహేష్ యలమందకు వెళితే అక్కడ హిందూ ధార్మిక సంఘాలు దాడి చేసే అవకాశముందని పోలీసులు హెచ్చరించారు. అయినా కత్తి మహేష్ వెనక్కి తగ్గకపోవడంతో.. బలవంతంగా జీపు ఎక్కించారు పీలేరు పోలీసులు. అక్కడినుంచి ఆయనను బెంగళూరుకు తరలించారు. కాగా, కత్తి మహేష్‌పై వేటు వేసిన తర్వాత స్వామి పరిపూర్ణానందను సైతం పోలీసులు హైదరాబాద్ నగరం నుంచి ఆరు నెలలపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా, కత్తి మహేష్‌ను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిషేధించాలంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేటు పడ్డ తర్వాత శ్రీరాముడిపై కత్తి మహేష్ పాడిన శ్లోకం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంబంధిత కథనాలు కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు! అమోఘం: కత్తి మహేష్ నోట శ్రీరాముడి శ్లోకం! -
పీలేరు సబ్‌జైలులో ఖైదీల ఘర్షణ
సాక్షి, పీలేరు: చిత్తూరు జిల్లాలోని పీలేరు సబ్‌జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. కాయిన్‌బాక్స్ వద్ద ఫోన్ చేసుకునే విషయమై ఖైదీల మధ్య గొడవ జరిగింది. కలికిరి మండలానికి చెందిన నారాయణరెడ్డి అనే ఖైదీ కాయిన్‌బాక్స్ వద్ద ఫోన్ మాట్లాడుతుండగా.. ఎంత సేపు మాట్లాడతావంటూ తోటి ఖైదీలు వాదనకు దిగారు. ఈ విషయమై ఖైదీల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. నారాయణరెడ్డిపై తోటి ఖైదీలు దాడికి దిగారు. వెంటనే స్పందించిన జైలు అధికారులు ఖైదీలను వారించి అక్కడి నుంచి పంపివేశారు. -
ఈ ఘాతుకానికి బాధ్యులెవరు?
సాక్షి, చిత్తూరు : రాష్ట్రంలో ఒకవైపు మాఫియా ప్రకృతి వనరులను కొల్లగొడుతుంటే, మరోవైపు వేటగాళ్లు వణ్యప్రాణును హరిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు బలైపోయిన చిరుతపులి కళేబరాన్ని సిబ్బంది గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. పీలేరు మండలం తలుపుల గ్రామపంచాయితీ పరిధిలోని సళ్లవాండ్లపల్లి అటవీ ప్రాంతంలో మరణించిన చిరుత పులిని అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. ఉచ్చులోపడ్డ చిరుతను చంపి, దాని కాలిగోర్లను కత్తిరించి, కళేబరాన్ని ఓ గుంతలో విసిరేసి వెళ్లారు. చనిపోయిన చిరుత వయసు సుమారు ఎనిమిదేళ్లు ఉండొచ్చని అధికారులు చెప్పారు. పోస్ట్‌మార్టం అనంతరం ఖననం : గుంతలో లభించిన చిరుత కళేబరాన్ని అటవీ శాఖ సిబ్బంది బయటకు తీయగా, పశువైద్యుడు పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం చిరుతను సమీప ప్రాంతంలో ఖననం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరనేదానిపై విచారణ చేపట్టామని అధికారులు చెప్పారు. -
ఈ ఘాతుకానికి బాధ్యులెవరు?
-
పీలేరులో వ్యక్తి దారుణ హత్య
పీలేరు(చిత్తూరు జిల్లా): పీలేరులో తిరుపతి వెళ్లే మార్గంలో వీఎస్ఆర్ కల్యాణ మండపం వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తలను మొండెం నుంచి వేరు చేశారు. చనిపోయిన వ్యక్తి వయసు 35 నుంచి 40 మధ్య ఉండవచ్చు. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులోకి దూసుకెళ్లిన సుమో: ఒకరి మృతి
పీలేరు : చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం సొరకాయలపేటలోని ఓ చెరువులోకి ప్రమాదవశాత్తూ సుమో దూసుకెళ్లింది. ఈ ఘటనలో పీలేరు పట్టణం ఆర్టీసీనల్లగుట్ట వీధికి చెందిన మెహదీన్ పాషా(55) అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటన అనంతరం సుమో డ్రైవర్ పరారయ్యాడు. పీలేరు నుంచి రాయచోటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాషా రోజూ పీలేరు నుంచి తిమ్మాపూర్‌కు ఎక్స్ఎల్ ద్విచక్రవాహనంపై వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లేవాడు. బుధవారం పాషా ఎక్కిన సుమో కేవీపల్లె వద్ద ప్రమాదానికి గురైంది. చెరువులోకి దూసుకెళ్లడంతో ఊపిరాడక ప్రాణాలొదిలాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమోను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఇంట్లో చోరీ జరిగిందంటూ ఎస్ఐ ఫిర్యాదు
చిత్తూరు : పీలేరు ఎస్ఐ రాజశేఖర్ ఇంట్లో చోరీ జరిగింది. తన భార్య శోభారాణి, ఆమె బంధువులు మరో ఏడుగురు కలిసి చోరీకి పాల్పడినట్లు రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పీలేరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పీలేరు ఎస్ఐ, ఆయన భార్య మధ్య వివాదాలున్నాయి. కాగా తాను విధి నిర్వహణలో భాగంగా చిత్తూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి.. తిరిగొచ్చేసరికి ఇంట్లోని రూ.46 వేల బంగారు ఆభరణాలు, కెమెరా, సర్టిఫికెట్లు చోరీకి గురైనట్లు ఎస్ఐ రాజశేఖర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన భార్య శోభారాణి, సమీప బంధువులు కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్ర, రాములమ్మ, నాగవేణి, పుష్ప, సులోచన, లక్ష్మి, హైదరాబాద్‌కు చెందిన సుజాతలపై ఆయన ఫిర్యాదు ఇచ్చారు. తాను పనిచేస్తున్న పోలీసు స్టేషనలోనే ఫిర్యాదు ఇవ్వడం గమనార్హం. దీనిపై ఏఎస్ఐ సురేష్‌బాబు ఆదివారం కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, రెండు రోజుల కిందట ఎస్ఐ రాజశేఖర్ భార్య శోభారాణి కర్నూలు జిల్లాలో ఎస్ఐ బంధువులు, స్నేహితులపై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదయింది. అంతేకాకుండా శోభారాణి సోమవారం చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ అన్నపూర్ణారెడ్డిని కలిశారు. ఎస్ఐ రాజశేఖర్ తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశారు. కొంత కాలంగా కిడ్నాప్ చేయడం, కుటుంబ సభ్యులను మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆమెకు ఏఎస్పీ కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఎస్ఐ రాజశేఖర్‌ను పిలిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. -
పీలేరులో కిరణ్ వర్గీయుల రిగ్గింగ్
-
పీలేరులో దారుణ హత్య : నగలు, నగదు చోరీ
-
పీలేరులో దారుణ హత్య : నగలు, నగదు చోరీ
చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం పీలేరు దుర్గానగర్‌లో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయురాలు యశోదమ్మను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. దుండగులు నగలు, నగదు తీసుకొని పారిపోయారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగిగారు. జాగిలాలతో దుండగుల కోసం గాలిస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాల కోసం పరిశీలిస్తున్నారు. అయితే దుండగులు ఆధారాలు దొరకకుండా జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. అయినా క్లూస్ టీమ్ తమ పంధాలో ఆధారాల కోసం ప్రయత్నిస్తోంది. యశోదమ్మ కూతురు,అల్లుడు ఉద్యోగం చేస్తున్నారు. వారు వచ్చిన తరువాత మాత్రమే ఎంత నగదు, నగలు పోయిందో తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. చుట్టుపక్కల ఎవరో తెలిసినవారే ఈ హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆమెకు ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా? అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.