peetam
-
వైభవంగా శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం
-విజయదుర్గా పీఠం 45వ వార్షికోత్సవాలు ప్రారంభం గురుహోరలో రాజమహేంద్రవరం విజయదుర్గా జూనియర్ కళాశాల కరస్పాండెంట్ పెదపాటి సత్యకనకదుర్గ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. పీఠంలో కొలువైన విజయదుర్గా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భద్రాచలం నుంచి వచ్చిన వేదపండితుడు సీతారామాంజనేయుల ఆధ్వర్యంలో అక్కడి ఆలయంలో మాదిరిగా శ్రీరామ సామ్రాజ్య పాదుకా పట్టాభిషేకాన్ని అర్చకులు వంశీకృష్ణ, సుదర్శనాచార్యులు, సి.మాధవాచార్యులు నిర్వహించారు. పాదుకా సమర్పణ, రాజముద్రిక, రాజదండకం, నందక, ఛత్రచామర, ఆభరణాల సమర్పణ, నదీజలాలు, తీర్థాలు, చతుర సముద్రాధి జలాలతో అభిషేకం, మంగళశాసనం తదితర పూజలను నిర్వహించారు. ఆలయ పురోహితులు శ్రీరామచంద్రుల వారు నాడు ధర్మబద్ధంగా అందించిన పాలనను, సామ్రాజ్య పాదుకా పట్టాభిషేక ఘట్టాలను వివరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. తొలుత స్వామి వారికి కళ్యాణం, అర్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు పీఠంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. స్టేట్ ఇనిస్టిట్యూట్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరు చిలకపాటి రాఘవాచార్యులు, విశాఖకు చెందిన వ్యాపారవేత్త ద్రోణంరాజు లక్ష్మీనారాయణ, నెల్లూరుకు చెందిన కోట అసోసియేట్స్ అధినేత కోట సునీల్‌కుమార్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి రీజనల్ కో ఆర్డినేటర్ కందర్ప హనుమాన్, వివిధ ప్రాంతాల ప్రముఖులు పూజల్లో పాల్గొన్నారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపిరాజు, పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన జరిగింది. -
మనిషి మూడు రకాల రుణాలతో జన్మిస్తాడు
శంకర విజయేంద్ర సరస్వతి రాజమహేంద్రవరం కల్చరల్ : ప్రతి మనిషి దేవరుణం, రుషి రుణం, పితృరుణం అనే మూడు రకాల అప్పులతో జన్మిస్తాడని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్రసరస్వతి అన్నారు. రాజమహేంద్రవరం నగరంలోని నందం గనిరాజు సెంటరులో కందుకూరి శివానందమూర్తి సత్సంగం ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. తపస్సు ద్వారా దేవతల రుణాన్ని, వేదాధ్యయనం ద్వారా రుషి రుణాన్ని, సంతానం ద్వారా పితృరుణాన్ని తీర్చుకోవాలన్నారు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే తాపత్రాయాలతో మనిషి జీవితం గడుపుతాడు కానీ, సత్సంగాన్ని మనిషి అలవరుచుకోవాలని హితవు చెప్పారు. ఆత్మనియంత్రణ, ఆత్మపరిశోధన చాలా అవసమని, ఆత్మానుభూతి కలిగితే, ఇక లోకంతో పని ఉండదన్నారు. సర్వసంగ పరిత్యాగం అందరికీ కుదరదని, దేశభక్తి, దైవభక్తి, సంస్కృతభాషాభిమానం, సదాచారంపై ఆసక్తి తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. సత్సంగం నిర్వాహకులు వాడ్రేవు మల్లపరాజు దంపతులు, వాడ్రేవు వేణుగోపాల్ దంపతులు, ప్రముఖ ఆడిటర్ వి.భాస్కరరామ్, డాక్టర్ టీవీ నారాయణరావు, ప్రముఖ న్యాయవాది మామిడన్న శేషగిరిరావు పాల్గొన్నారు. వేద విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన వేదవిద్యార్థులతో శంకర విజయేంద్ర సరస్వతి ముఖాముఖి మాట్లాడారు. అగ్నికార్యమంత్రాలు విద్యార్థులు చదువుతుంటే ఆసక్తిగా విన్నారు. మేధావీ భూయాసం, తేజస్వీభూయాసం ఇత్యాదులను పలుకుతున్నప్పుడు, వేళ్లతో శిరస్సును, ఇతర అంగాలను ఎలా తాకాలో చూపించారు. -
16 నుంచి విజయదుర్గా పీఠం 44వ వార్షికోత్సవాలు
వెదురుపాక (రాయవరం) : వెదురుపాక విజయదుర్గాపీఠం 44వ వార్షికోత్సవాలను ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న ట్లు పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపిరాజు, పీఆర్వో వి.వేణుగోపాల్(బాబి) తెలిపారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం (గాడ్) సమక్షంలో శనివారం విలేకరు లతో మాట్లాడుతూ 1972 ఆగస్టు 18న గాడ్ మంత్రోపదేశం పొందారని, 1989 ఆగస్టు 16న శృంగే రీ పీఠాధిపతులు శ్రీభారతీతీర్థస్వామి శ్రీవిజయదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ చేశారని చెప్పారు. 16న ఉదయం 8.05 గంటలకు వార్షికోత్సవాలు ప్రారంభమవుతాయని, తిరుత్తణికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థాన పండితులు సుబ్రహ్మణ్యస్వామి దివ్య కల్యాణం, సుబ్రహ్మణ్య త్రిశతి హోమాన్ని నిర్వహిస్తారన్నారు. 17న ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు, 18న శ్రీదేవి, భూదేవి సమేత విజయవెంకటేశ్వరస్వామి వారికి దివ్య కల్యాణోత్సవాలు జరుగుతాయన్నారు.