pembarti
-
పెంబర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
జనగామ: పొగమంచు.. అతివేగంతో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. జనగామ మండలం పెంబర్తి శివారు పెట్రోల్ బంకు ఏరియాలో హైవేపై మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటలకు జరిగిన ప్రమాదంలో వేర్వేరు కుటుంబాలకు చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇనుప సామాను స్క్రాప్ వ్యాపారం చేసే సూర్యాపేట జిల్లా తిర్మలగిరికి చెందిన వాటం రాజశేఖర్(33), భువనగిరిలో ఉంటున్న డీసీఎం క్లీనర్ ఎండీ అబ్దుల్‌రహీంఖాన్(38) స్క్రాప్ లోడ్ తీసుకుని డీసీఎంలో సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు సోమవారం రాత్రి బయలుదేరారు. జనగామ మండలం పెంబర్తి శివారు పెట్రోలు బంకు ఏరియాకు చేరుకునే సమయంలో డీసీఎం టైరు పంక్చర్ అయింది. టైరు మార్చుకునే క్రమంలో డీసీఎంను రోడ్డు పక్కన నిలిపి... పార్కింగ్ లైట్లు వెలిగించి సెక్యూరిటీగా టైరును అడ్డంగా ఉంచారు. తిరుపతి నుంచి వరంగల్‌కి రైలులో వచ్చిన బేగంపేట బ్రాంచ్ హెచ్డీబీ బ్యాంకు మేనేజర్ మిర్యాల దేవేందర్‌రెడ్డి కారులో తాను నివాసం ఉంటున్న హైదరాబాద్ కేబీహెచ్‌కే కాలనీకి తన భార్య శ్రావణి, కూతురు శ్రీనిత (7)తో బయలుదేరారు. తెల్లవారుజామున 5.30గంటల సమయంలో పొగమంచు కారణంగా రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎంను గమనించని దేవేందర్‌రెడ్డి.. సెక్యూరిటీగా ఉంచిన టైరును వేగంగా ఢీకొట్టాడు. దీంతో గాల్లో పల్టీలు కొట్టిన కారు... టైరు పంక్చర్ చేస్తున్న క్లీనర్ ఎండీ అబ్దుల్ రహీం ఖాన్, రాజశేఖర్‌పై పడి... మరో 200 మీటర్ల దూరం దూసుకుపోయింది. నుజ్జునుజ్జయిన ఆ ఇద్దరూ అక్కడకక్కడే మృతి చెందగా... కారులో కూర్చున్న శ్రీనిత.. ముందు అద్దం పగలడంతో రోడ్డుపై ఎగిరి పడింది. తలకు బలమైన గాయాలు కావడంతో...ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. సీటు బెల్ట్ ధరించడంతో తప్పిన ప్రాణాపాయం దేవేందర్‌రెడ్డి, శ్రావణి సీటు బెల్ట్ ధరించడంతో స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ప్రమాద సమయంలో డీసీఎం డ్రైవర్ మహబూబ్ కాస్త దూరంగా ఉండడంతో.. త్రుటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నాడు. దేవేందర్‌రెడ్డిపై కేసు నమోదు... మృతుడు రాజశేఖర్ భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కారు యజమాని(డ్రైవర్) దేవేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ప్రమాద సమయంలో డీసీఎం రోడ్డు పక్కగా ఉందని, అటుగావచ్చే వాహనాలు గమనించేలా పార్కింగ్ లైట్లు కూడా వేశారని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
చేతిలో కళ ఉన్నా.. బతుకులో ‘కళ’ సున్నా!
సాక్షి, జనగామ : తమ అద్భుతమైన హస్తకళా నైపుణ్యంతో అందరి మన్ననలందుకొన్న పెంబర్తి కళాకారులు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రపంచ గుర్తింపు పొందిన నగిషీలను తయారు చేస్తున్న కళాకారులకు ప్రభుత్వ ఆదరణ కరువవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దళారుల ఆర్డర్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చేతినిండా పనిలేకపోవడంతో పొట్ట నింపుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. హస్తకళల ఐకాన్‌గా పేరుగాంచిన జనగామ జిల్లా పెంబర్తి కళాకారుల కష్టాలపై ‘సాక్షి’ కథనం.. తగ్గిపోతున్న కళాకారులు.. నిజాం కాలం నుంచి జనగామలోని పెంబర్తి గ్రామం హస్తకళా నైపుణ్యానికి పెట్టింది పేరుగా ఉంది. గతంలో పెంబర్తిలో 80 కుటుంబాలు హస్తకళపై ఆధారపడి జీవనం సాగించేవి. ప్రతి ఇంట్లో హస్తకళా నగిషీలను తయారుచేసి ఇచ్చేవారు. కాలక్రమంలో రెడీమేడ్‌గా లభించే నకిలీ నగిషీల అమ్మకం పెరిగింది. కళాకారులు తయారు చేసిన వస్తువులకు డిమాండ్ తగ్గి, ఆదరణ లేకుండా పోయింది. దీంతో కొన్ని కుటుంబాల వారు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. ప్రస్తుతం గ్రామంలో 25 కుటుంబాలు మాత్రమే హస్తకళను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. పెంబర్తి బ్రాండ్‌తో సొమ్ము.. హస్తకళలకు బహిరంగ మార్కెట్లో ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్ని ఆసరా చేసుకుని కొందరు ప్రైవేట్ వ్యా పారులు షోరూంలు ఏర్పాటు చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. నగిషీలు కావాలని వచ్చే వారి నుంచి మధ్యవర్తులు ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు తీసుకుంటున్నారు. వారు గ్రామంలో ఉన్న కళాకారులకు కూలీల చొప్పున చెల్లిస్తున్నారు. ఒక్కో కళాకారుడికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేలకు మించి రావడం లేదంటే ఏ విధంగా దోచుకుంటున్నారో తెలుసుకోవచ్చు. అలాగే, పెంబర్తి కళాకారులు నాలుగు పదుల వయస్సుకే ముసలితనానికి గురవుతున్నారు. మెటల్ వాడకంలో వెలువడే రసాయనాలతో కళాకారులు రోగాల బారిన పడుతున్నారు. అట్టెం (లక్క) కరిగించడం, నైట్రిక్ యాసిడ్ రసాయనాలతో గుండె, శ్వాసకోశ వ్యాధులు, దృష్టి లోపంతోపాటు, వెన్నునొప్పికి కారణమవుతోంది. ప్రభుత్వం గీత, చేనేత, బీడీ కార్మికులకు ఆసరా పథకం కింద నెలకు రూ.1000 చొప్పున పింఛన్లు అందిస్తోంది. కానీ, పెంబర్తి కళాకారులకు ఆ సౌకర్యం లేక పోవడంతో రెక్కలు ముక్కలు చేసుకుంటేనే పూట గడవని పరిస్థితి ఉంది. కుటుంబ పోషణ భారమై.. ఈ ఫొటోలో కనిపిస్తున్న కళాకారుడి పేరు రాగి వెంకటేశ్వర్లు. ఈయనది పెంబర్తి గ్రామం. 32 ఏళ్ల నుంచి గ్రామంలో హస్తకళల తయారీ పనులు చేస్తున్నారు. ఇతడిపై భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఆధారపడి ఉన్నారు. హస్తకళతో నెలకు రూ.10 వేలు మాత్రమే సంపాదించగలడు. గిరాకీ రాకుంటే అవీ రావనీ, పూటపూటకూ కష్టమేనని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేయూత అందిస్తేనే తమ జీవితాలు బాగుపడుతాయంటున్నాడు. కూలి పనికి వెళ్లలేకనే... ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు కూరోజు అన్నపూర్ణ. పెంబర్తి గ్రామం. తన తండ్రి వారసత్వంగా నేర్చుకున్న హస్తకళతో భర్త సంపతాచారితో కలసి 30 ఏళ్ల నుంచి నగిషీలు తయారు చేస్తుంది. పెట్టుబడికి డబ్బులు లేక కూలీ పని మాత్రమే చేస్తున్నారు. ఇద్దరూ కష్టపడినా నెలకు రూ.10 వేలకు మించి రావడం లేదు. తాము బయటి పనులకు వెళ్లలేకే ఈ పని చేస్తున్నామని అన్నపూర్ణ చెబుతోంది. కళ్లు, ఉపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది. ప్రభుత్వ షోరూంను ఏర్పాటు చేయాలి 35 ఏళ్ల నుంచి నగిషీలను తయారు చేస్తున్నా. ఆర్డర్లపైనే ఆధారపడి పనులు చేస్తున్నాం. ప్రైవేట్ వ్యక్తుల కారణంగా గిరాకీలు రావడం లేదు. కళాకారులు తయారు చేసే నగిషీలను విక్రయించడానికి పెంబర్తిలో ప్రభుత్వమే షోరూం ఏర్పాటుచేయాలి. 50 ఏళ్లకే పింఛన్పాటు హెల్త్ కార్డులిస్తే మా కుటుంబాలు బాగుపడతాయి. – ఐల సదానందాచారి, కళాకారుడు -
పెంబర్తి బ్రాస్ సొసైటీకి రూ.1.80 కోట్లు
జనగామ : హస్తకళలకు పుట్టినిల్లయిన పెంబర్తి బ్రాస్ సొసైటీకి భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తన నిధుల నుంచి రూ.10 లక్షలు, కేంద్రం నుంచి మరో రూ.1.70 కోట్లు మంజూరు చేయించారు. ఈవిషయాన్ని ఆయన మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ నిధులను సాధించేందుకు గత ఆరు నెలలుగా తాను చేసిన ప్రయత్నాలు ఫలించాయని అభిప్రాయపడ్డారు. కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రాను కలిసి పెంబర్తి హస్తకళల పరిశ్రమ గురించి, ఇక్కడి కార్మికుల స్థితిగతులను వివరించానన్నారు. ఈ– మార్కెటింగ్ ద్వారా హస్తకళా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు నిధులను వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపామన్నారు. -
పెంబర్తి చెక్‌పోస్టులో రూ.7 లక్షలు స్వాధీనం
జనగామ: వరంగల్ జిల్లా జనగామ మండలం పెంబర్తి చెక్‌పోస్ట్ పోలీసులు శనివారం ఓ కారులో తరలిస్తున్న రూ.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. తుమ్మల కీర్తివర్ధన్రెడ్డి అనే వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి వెళుతుండగా పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద రూ.7 లక్షలను గుర్తించారు. నల్లగొండ జిల్లా ఆలేరు మండలం మాటూరు గ్రామంలో భూమి కొనుగోలుకు సంబంధించి ఈ డబ్బులు తీసుకెళుతున్నట్టు కీర్తివర్ధన్రెడ్డి చెప్పగా, అందుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
పెంబర్తి చెక్‌పోస్ట్ వద్ద రూ. 10 లక్షలు స్వాధీనం
వరంగల్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లాలో పోలీసులు శనివారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. పెంబర్తి చెక్‌పోస్ట్ వద్ద రూ. 10 లక్ష నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదును సీజ్ చేసి.... కారును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే శుక్రవారం పోలీసుల తనిఖీల్లో భాగంగా హసన్‌పర్తి మండలం అన్నాసాగర్ వద్ద కారులో తరలిస్తున్న రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకుని... సీజ్ చేసిన సంగతి తెలిసిందే.