Road Accident At Pembarti A Car Hits DCM Van - Sakshi
Sakshi News home page

పెంబర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Feb 7 2023 7:40 AM | Updated on Feb 8 2023 2:20 AM

Road Accident At  Pembarti A Car Hits DCM Van - Sakshi

జనగామ: పొగమంచు.. అతివేగంతో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. జనగామ మండలం పెంబర్తి శివారు పెట్రోల్‌ బంకు ఏరియాలో హైవేపై మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటలకు జరిగిన ప్రమాదంలో వేర్వేరు కుటుంబాలకు చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇనుప సామాను స్క్రాప్‌ వ్యాపారం చేసే సూర్యాపేట జిల్లా తిర్మలగిరికి చెందిన వాటం రాజశేఖర్‌(33), భువనగిరిలో ఉంటున్న డీసీఎం క్లీనర్‌ ఎండీ అబ్దుల్‌రహీంఖాన్‌(38) స్క్రాప్‌ లోడ్‌ తీసుకుని డీసీఎంలో సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు సోమవారం రాత్రి బయలుదేరారు.

జనగామ మండలం పెంబర్తి శివారు పెట్రోలు బంకు ఏరియాకు చేరుకునే సమయంలో డీసీఎం టైరు పంక్చర్‌ అయింది. టైరు మార్చుకునే క్రమంలో డీసీఎంను రోడ్డు పక్కన నిలిపి... పార్కింగ్‌ లైట్లు వెలిగించి సెక్యూరిటీగా టైరును అడ్డంగా ఉంచారు. తిరుపతి నుంచి వరంగల్‌కి రైలులో వచ్చిన బేగంపేట బ్రాంచ్‌ హెచ్‌డీబీ బ్యాంకు మేనేజర్‌ మిర్యాల దేవేందర్‌రెడ్డి కారులో తాను నివాసం ఉంటున్న హైదరాబాద్‌ కేబీహెచ్‌కే కాలనీకి తన భార్య శ్రావణి, కూతురు శ్రీనిత (7)తో బయలుదేరారు.

తెల్లవారుజామున 5.30గంటల సమయంలో పొగమంచు కారణంగా రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎంను గమనించని దేవేందర్‌రెడ్డి.. సెక్యూరిటీగా ఉంచిన టైరును వేగంగా ఢీకొట్టాడు. దీంతో గాల్లో పల్టీలు కొట్టిన కారు... టైరు పంక్చర్‌ చేస్తున్న క్లీనర్‌ ఎండీ అబ్దుల్‌ రహీం ఖాన్, రాజశేఖర్‌పై పడి... మరో 200 మీటర్ల దూరం దూసుకుపోయింది. నుజ్జునుజ్జయిన ఆ ఇద్దరూ అక్కడకక్కడే మృతి చెందగా... కారులో కూర్చున్న శ్రీనిత.. ముందు అద్దం పగలడంతో రోడ్డుపై ఎగిరి పడింది. తలకు బలమైన గాయాలు కావడంతో...ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. 

సీటు బెల్ట్‌ ధరించడంతో తప్పిన ప్రాణాపాయం 
దేవేందర్‌రెడ్డి, శ్రావణి సీటు బెల్ట్‌ ధరించడంతో స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ప్రమాద సమయంలో డీసీఎం డ్రైవర్‌ మహబూబ్‌ కాస్త దూరంగా ఉండడంతో.. త్రుటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నాడు. 

దేవేందర్‌రెడ్డిపై కేసు నమోదు... 
మృతుడు రాజశేఖర్‌ భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కారు యజమాని(డ్రైవర్‌) దేవేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ప్రమాద సమయంలో డీసీఎం రోడ్డు పక్కగా ఉందని, అటుగావచ్చే వాహనాలు గమనించేలా పార్కింగ్‌ లైట్లు కూడా వేశారని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement