సాక్షి, జనగామ : తమ అద్భుతమైన హస్తకళా నైపుణ్యంతో అందరి మన్ననలందుకొన్న పెంబర్తి కళాకారులు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రపంచ గుర్తింపు పొందిన నగిషీలను తయారు చేస్తున్న కళాకారులకు ప్రభుత్వ ఆదరణ కరువవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దళారుల ఆర్డర్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చేతినిండా పనిలేకపోవడంతో పొట్ట నింపుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. హస్తకళల ఐకాన్‌గా పేరుగాంచిన జనగామ జిల్లా పెంబర్తి కళాకారుల కష్టాలపై ‘సాక్షి’ కథనం..
తగ్గిపోతున్న కళాకారులు..
నిజాం కాలం నుంచి జనగామలోని పెంబర్తి గ్రామం హస్తకళా నైపుణ్యానికి పెట్టింది పేరుగా ఉంది. గతంలో పెంబర్తిలో 80 కుటుంబాలు హస్తకళపై ఆధారపడి జీవనం సాగించేవి. ప్రతి ఇంట్లో హస్తకళా నగిషీలను తయారుచేసి ఇచ్చేవారు. కాలక్రమంలో రెడీమేడ్‌గా లభించే నకిలీ నగిషీల అమ్మకం పెరిగింది. కళాకారులు తయారు చేసిన వస్తువులకు డిమాండ్ తగ్గి, ఆదరణ లేకుండా పోయింది. దీంతో కొన్ని కుటుంబాల వారు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. ప్రస్తుతం గ్రామంలో 25 కుటుంబాలు మాత్రమే హస్తకళను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి.
పెంబర్తి బ్రాండ్‌తో సొమ్ము..
హస్తకళలకు బహిరంగ మార్కెట్‌లో ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్ని ఆసరా చేసుకుని కొందరు ప్రైవేట్ వ్యా పారులు షోరూంలు ఏర్పాటు చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. నగిషీలు కావాలని వచ్చే వారి నుంచి మధ్యవర్తులు ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు తీసుకుంటున్నారు. వారు గ్రామంలో ఉన్న కళాకారులకు కూలీల చొప్పున చెల్లిస్తున్నారు. ఒక్కో కళాకారుడికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేలకు మించి రావడం లేదంటే ఏ విధంగా దోచుకుంటున్నారో తెలుసుకోవచ్చు.
అలాగే, పెంబర్తి కళాకారులు నాలుగు పదుల వయస్సుకే ముసలితనానికి గురవుతున్నారు. మెటల్ వాడకంలో వెలువడే రసాయనాలతో కళాకారులు రోగాల బారిన పడుతున్నారు. అట్టెం (లక్క) కరిగించడం, నైట్రిక్ యాసిడ్ రసాయనాలతో గుండె, శ్వాసకోశ వ్యాధులు, దృష్టి లోపంతోపాటు, వెన్నునొప్పికి కారణమవుతోంది. ప్రభుత్వం గీత, చేనేత, బీడీ కార్మికులకు ఆసరా పథకం కింద నెలకు రూ.1000 చొప్పున పింఛన్లు అందిస్తోంది. కానీ, పెంబర్తి కళాకారులకు ఆ సౌకర్యం లేక పోవడంతో రెక్కలు ముక్కలు చేసుకుంటేనే పూట గడవని పరిస్థితి ఉంది.
కుటుంబ పోషణ భారమై..
ఈ ఫొటోలో కనిపిస్తున్న కళాకారుడి పేరు రాగి వెంకటేశ్వర్లు. ఈయనది పెంబర్తి గ్రామం. 32 ఏళ్ల నుంచి గ్రామంలో హస్తకళల తయారీ పనులు చేస్తున్నారు. ఇతడిపై భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఆధారపడి ఉన్నారు. హస్తకళతో నెలకు రూ.10 వేలు మాత్రమే సంపాదించగలడు. గిరాకీ రాకుంటే అవీ రావనీ, పూటపూటకూ కష్టమేనని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేయూత అందిస్తేనే తమ జీవితాలు బాగుపడుతాయంటున్నాడు.
కూలి పనికి వెళ్లలేకనే...
ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు కూరోజు అన్నపూర్ణ. పెంబర్తి గ్రామం. తన తండ్రి వారసత్వంగా నేర్చుకున్న హస్తకళతో భర్త సంపతాచారితో కలసి 30 ఏళ్ల నుంచి నగిషీలు తయారు చేస్తుంది. పెట్టుబడికి డబ్బులు లేక కూలీ పని మాత్రమే చేస్తున్నారు. ఇద్దరూ కష్టపడినా నెలకు రూ.10 వేలకు మించి రావడం లేదు. తాము బయటి పనులకు వెళ్లలేకే ఈ పని చేస్తున్నామని అన్నపూర్ణ చెబుతోంది. కళ్లు, ఉపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది.
ప్రభుత్వ షోరూంను ఏర్పాటు చేయాలి
35 ఏళ్ల నుంచి నగిషీలను తయారు చేస్తున్నా. ఆర్డర్లపైనే ఆధారపడి పనులు చేస్తున్నాం. ప్రైవేట్ వ్యక్తుల కారణంగా గిరాకీలు రావడం లేదు. కళాకారులు తయారు చేసే నగిషీలను విక్రయించడానికి పెంబర్తిలో ప్రభుత్వమే షోరూం ఏర్పాటుచేయాలి. 50 ఏళ్లకే పింఛన్‌పాటు హెల్త్ కార్డులిస్తే మా కుటుంబాలు బాగుపడతాయి. – ఐల సదానందాచారి, కళాకారుడు
Comments
Please login to add a commentAdd a comment