people attack
-
మంటగలిసిన మానవత్వం..!
రాయగడ : ప్రజలంతా కలిసి చనిపోయేలా చితకబాది వదిలేసిన వ్యక్తికి ఆస్పత్రిలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. కనీస వైద్యం కూడా అందించడానికి వైద్యులు ముందుకు రాకపోవడం చూస్తే మానవత్వం మంటగలిసిందా? అని పలువురు వాపోతున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాయగడలోని మెయిన్ రోడ్డు జగన్నాథ మందిరం వీధి ప్రాంతంలో భాష రాని, మాటలు లేని మతిస్థిమితం లేని వ్యక్తి తిరుగుతుండగా పిల్లలను దొంగిలించే వ్యక్తిగా ప్రజలు అనుమానించి ప్రాణాలు పోయేలా చితకబాది పడవేశారు. ప్రజలు కొట్టిన దెబ్బలతో తలకు తగిలిన గాయంతో ఆ వ్యక్తి అచేతనంగా పడి ఉండగా ఒంటినిండా పురుగులు చేరి కొరుక్కుని తినడం చూసిన పోలీసులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో 3రోజులుగా ఉన్న వ్యక్తికి వైద్య సిబ్బంది కనిసం ప్రాథమిక చికిత్స కానీ, ఎటువంటి వైద్యం అందించక పోవడంతో మితిస్థిమితం లేని వ్యక్తి అలాగే పడి ఉన్నాడు. ఆ వ్యక్తి అలా పడి ఉంటే వైద్య సిబ్బందికి కనీసం హృదయం కరగలేదని స్థానికులు వాపోతున్నారు. రాయగడలో కొద్ది నెలలుగా ఏ ఒక్క పిల్లాడు దొంగతనానికి గురి కాకపోయినా వాట్సాప్ పుకార్ల ద్వారా, మూఢనమ్మకాల ద్వారా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన మతి స్థిమితం లేని, భాష తెలియని వ్యక్తులపై ప్రజలు దాడులు చేసి చితక బాదుతున్నారు. జిల్లా అధికారులు ప్రజలను చైతన్యం చేయడంలో సంపూర్ణంగా విఫలమవుతున్నారు. -
మద్యం మత్తులో మహిళ హల్చల్
నెక్కొండ : మద్యం మత్తులో ఓ మహిళ అర్ధరాత్రి హల్చల్ చేయడంతో గ్రామస్తులు ఆమెను పట్టుకుని కట్టివేసి చితకబాదిన సంఘటన మండలంలోని పనికర గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ గ్రామంలోని ఓ ఇంటి తలుపులు కొట్టి శబ్దం చేసింది. దీంతో మేల్కొన్న ఇంట్లోవారు దొంగాదొంగా అంటూ కేకలు వేశారు. దీంతో గ్రామస్తులు మేల్కొని మద్యం మత్తులో ఉన్న మహిళను పట్టుకొని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. తనతోపాటు మరో ఐదుగురు ఉన్నారని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులకు సైతం తనది చింతనెక్కొండ, బంజరుల్లి, కొండాపురం, అమీన్‌పేట గ్రామమనని వేర్వేరు సమాధానాలు చెప్పింది. మహిళ దగ్గర ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేసి చింతనెక్కొండకు పంపించారు. ఈ విషయమై ఎస్సై నవీన్‌కుమార్‌ను వివరణ కోరగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
కారేపల్లిలో పట్టుబడిన బెంగాలీ దొంగ
కారేపల్లి: ఓ వైపు బిహార్ దొంగలు ఇంట్లోకి చొర బడి పిల్లలను ఎత్తుకెళ్లిపోతున్నారు, అడ్డు వచ్చిన వారిని హతమార్చుతున్నారు..అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అపోహలు పెరిగిపోయి.. రాత్రి వేళల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పుకార్లుతో ప్రజలు బెంబేలెత్తి పోతుంటే...! తాజాగా కారేపల్లిలో ఓ బెంగాలీ యువకుడు ఆది వారం తెల్లవారు జామున ఆటోను దొంగిలిస్తూ పట్టు పడిన ఘటనతో కారేపల్లిలో మరొక్కసారి అలజడి ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో కారేపల్లిలో నాటు వైద్యం పేరుతో ఇద్దరు మహిళలు పట్టపగలే ఇంటి తలుపులు కొడుతూ.. మీకు ఆ రోగం తగ్గిస్తాం, ఈ రోగం తగ్గిస్తాం అంటూ అనుమానాస్పదంగా తిరిగి, చివరికి గ్రామస్తుల చేతికి చిక్కి పోలీసులకు అప్పగించిన ఘటన మరువక ముందే..ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఈ బెంగాల్ దొంగ ఘటన ప్రజల్లో మరోక్క సారి భయాందోళనను రేకెత్తించింది. పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లా చెందిన మోహన్ బిస్వాల్ అనే యువకుడు గత నెల 30వ తేదీన పశ్చిమ బెంగాల్ నుంచి తమ బ్యాచ్ (ముఠా)తో కలిసి హైదరాబాద్‌లోని షేరులింగం పల్లి వద్ద కాంట్రాక్టర్ ఇమ్రాన్ అహ్మద్ వద్ద కన్స్ట్రక్షన్ పనుల్లో భాగంగా హెల్పర్‌గా పని చేసేందుకు వచ్చాడు. దీనికి సంబంధించి డిసెంబర్ 31వ తేదీ వరకు వ్యాలిడిటీతో అతని వద్ద సరోవర్ జెనిత్ కంపెనీలో పని చేసేందుకు కార్డు సైతం ఉంది. ఇదిలా ఉండగా..తన ముఠాతో పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్ వచ్చిన మోహన్ బిస్వాల్..తప్పిపోయి హైదరాబాద్‌లోని కాకతీయ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కాడు. తన ముఠా కన్పింక క పోవటంతో..తనకు వచ్చిన బెంగాళీ బాషలో అడ్రస్ చెప్పాలంటూ ట్రైన్లో సైతం ప్యాసింజర్లను విసిగించటం, శనివారం అర్థ రాత్రి వరకు ఆ బోగీలో ఉన్న వారిని సైతం లేపి ఇబ్బందులకు గురి చేయటంతో అతన్ని..కారేపల్లి రైల్వే స్టేషన్ వద్దకు రాగానే ఆదివారం తెల్లవారుజాము 3 గం టల సమయంలో బలవంతంగా దింపివేశారు. దీంతో అయోమయానికి గురైన మోహన్ బిస్వాల్ ఏమి చేయాలో తోచక..కారేపల్లిలో ఒంటరిగా కలియతిరుగుతూ..భారత్‌నగర్‌కు చేరు కున్నాడు. ఈ క్రమంలో ఏమిచేయాలో తోచని మోహన్ బిస్వాల్ రోడ్డు ప్రక్కనే ఉన్న ఆటోను నెట్టుకుంటూ..రోడ్డు పైకి తెచ్చాడు. ఆటోలో ఎటేపైన వెళ్దామనుకున్నాడో..ఏమో తెలియని బిస్వాల్ ఆటో ఎంతకు కదలక పోవటంతో..అదే ఇంటిలోని కుంటుంబ సభ్యులను నిద్ర లేపి..తనకు వచ్చిన బెంగాలి బాషతో వారిని బెంబేలెత్తించాడు. దీంతో దొంగ దొంగ అని అరవటంతో..చుట్టు ప్రక్కల వాళ్లు అక్కడికి చేరుకొని..ఇతడు దొంగేనని తలంచి దేహశుద్ది చేశారు. అనంతరం తాళ్లతో కట్టివేసి కారేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. -
అతను దొంగ కాదు
అక్కన్నపేట(హుస్నాబాద్): బుధవారం మాల్‌చెర్వు తండాలో స్థానికులు దొంగగా భవించి పట్టుకున్న వ్యక్తికి మతిస్థిమితం లేదని పోలీసులు తేల్చారు. సైకాలజిస్టు, డాక్టర్ సహాయంతో పోలీసులు సుదీర్ఘంగా విచారణ చేశారు. చివరికి అతను దోపిడి దొంగలు, హంతక ముఠాలకు చెందిన అతను కాదని మతి స్థిమితం లేని వ్యక్తని నిర్ధారణకు వచ్చారు. పుకార్లు నమ్మొద్దు.. అక్కన్నపేట మండలంలో పిల్లలను ఎత్తుకెళ్లే వారు, దోపిడి దొంగలు సంచరిస్తున్నారన్న వార్తల్లో వాస్తవం లేదని హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ జీ అన్నారు. బుధవారం మాల్‌చెర్వుతండాలో స్థానికులు పిల్లలను ఎత్తుకెళ్లే దొంగగా భావించి పట్టుకున్న వ్యక్తికి మతిస్థిమితం లేక తప్పిపోయి వచ్చాడన్నారు. బీహార్‌కు చెందిన ముఠాలు సంచరిస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్ని ఉత్త పుకార్లే అని కొట్టిపారేశారు. ఆయన వెంట ఎస్ఐ పాపయ్యనాయక్ ఉన్నారు. మానవత్వం చాటిన పోలీసులు.. మాల్చెర్వుతండా వాసులు పట్టుకున్న మతి స్థిమితం వ్యక్తికి పోలీసులు కటింగ్, స్నానం చేయించి, కొత్త బట్టలు వేయించి మానవత్వం చాటారు. అనంతరం భువనగిరి జిల్లాలోని చౌటుపల్లిలోని అమ్మానాన్న ఆశ్రమానికి సొంత ఖర్చులతో తరలించారు. -
వణికిస్తున్న వదంతులు
తాండూరు, బషీరాబాద్(రంగారెడ్డి) : కర్ణాటక సరిహద్దు మండలం బషీరాబాద్‌లో ఆదివారం అర్ధరాత్రి అలజడి రేగింది. కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వదంతులతో పల్లెలు వణికి పోతున్నాయి. దావానలంలా వ్యాపించిన నేరస్తుల పాత వీడియోలు, ఫొటోలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉక్కపోతతో ఇన్ని రోజులు ఆరుబయట పడుకున్న పల్లె జనం వదంతుల భయంతో గుంపులుగా గుమిగూడి జాగారం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా, బీదర్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చిన నేరస్తుల ముఠాలు రాత్రి వేళల్లో గ్రామాల్లో సంచరిస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. పిల్లలను, వృద్ధులను కిడ్నాప్ చేసి చంపేస్తున్నారనే పుకార్లు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో గుల్బర్గా జిల్లా సరిహద్దులోని నావంద్గి, ఇందర్‌చెడ్, క్యాద్గిర, ఎక్మాయి, మంతన్‌గౌడ్, మైల్వార్, కంసాన్పల్లి, నీళ్లపల్లి, జలాల్పూర్, మంతట్టిలో ప్రజలు నిద్ర కూడా పోవడం లేదు. నావంద్గిలో ఆదివారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని అగంతకులు సంచరించారనే అనుమానంతో గ్రామస్తులు రాత్రంతా గాలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారికి ధైర్యం చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు, ఫొటోలు నమ్మవద్దని, అవన్నీ ఫేక్ అని వివరించారు. వాట్సప్ గ్రూపుల్లో అలాంటివి వస్తే షేర్ చేయొద్దని సూచించారు. నీళ్లపల్లి గ్రామస్తులు అర్ధరాత్రి సర్పంచ్ ఉమాసుధాకర్‌రెడ్డి ఇంటి వద్ద గుమిగూడి, పోలీసులను పిలిపించాలని విన్నవించారు. అగ్గనూరులో అనుమానిత వ్యక్తిపై దాడి యాలాల (వికారాబాద్) : చిన్న పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చాడని భావిస్తూ ఓ వ్యక్తిపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ సంఘటన మండల పరిధిలోని అగ్గనూరులో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. ఇతని కదలికలు, వ్యవహారంపై అనుమానం వచ్చిన కొంతమంది అతన్ని పట్టుకుని వివరాలు అడిగారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో దేహశుద్ధి చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భయం వద్దు తాండూరులో చిన్నారులను అపహరించే ముఠా సంచరిస్తోందంటూ వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదు. ప్రజలు భయపడాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు, ఫొటోలను నమ్మవద్దు. కావాలనే కొందరు ప్రజలను భయబ్రాంతులను గురి చేసేందుకు ఇలాంటివి ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా చిన్నపిల్లల కిడ్నాప్ కేసులు నమోదు కాలేదు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. ఉపాధి కోసం వచ్చే అమాయకులపై దాడులు చేయొద్దు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి. – రామచంద్రుడు, డీఎస్పీ, సెల్: 94406 27353 -
తహశీల్దార్ కార్యాలయం దిగ్బంధం
నల్లగొండ: ఆహారభద్రత కార్డుల మంజూరులో అలక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ ప్రజలు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామస్తులు సుమారు 100 మంది మండల కేంద్రానికి తరలివచ్చారు. ఆహారభద్రత కార్డులను మంజూరు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. తహశీల్దార్ వీర ప్రతాప్‌ను కార్యాలయం లోనే బంధించి వారంతా కార్యాలయం వెలుపల బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. (తుర్కపల్లి)