
ఆస్పత్రిలో వైద్యం అందక మతిస్దిమితం లేని వ్యక్తి
రాయగడ : ప్రజలంతా కలిసి చనిపోయేలా చితకబాది వదిలేసిన వ్యక్తికి ఆస్పత్రిలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. కనీస వైద్యం కూడా అందించడానికి వైద్యులు ముందుకు రాకపోవడం చూస్తే మానవత్వం మంటగలిసిందా? అని పలువురు వాపోతున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాయగడలోని మెయిన్ రోడ్డు జగన్నాథ మందిరం వీధి ప్రాంతంలో భాష రాని, మాటలు లేని మతిస్థిమితం లేని వ్యక్తి తిరుగుతుండగా పిల్లలను దొంగిలించే వ్యక్తిగా ప్రజలు అనుమానించి ప్రాణాలు పోయేలా చితకబాది పడవేశారు.
ప్రజలు కొట్టిన దెబ్బలతో తలకు తగిలిన గాయంతో ఆ వ్యక్తి అచేతనంగా పడి ఉండగా ఒంటినిండా పురుగులు చేరి కొరుక్కుని తినడం చూసిన పోలీసులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో 3రోజులుగా ఉన్న వ్యక్తికి వైద్య సిబ్బంది కనిసం ప్రాథమిక చికిత్స కానీ, ఎటువంటి వైద్యం అందించక పోవడంతో మితిస్థిమితం లేని వ్యక్తి అలాగే పడి ఉన్నాడు.
ఆ వ్యక్తి అలా పడి ఉంటే వైద్య సిబ్బందికి కనీసం హృదయం కరగలేదని స్థానికులు వాపోతున్నారు. రాయగడలో కొద్ది నెలలుగా ఏ ఒక్క పిల్లాడు దొంగతనానికి గురి కాకపోయినా వాట్సాప్ పుకార్ల ద్వారా, మూఢనమ్మకాల ద్వారా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన మతి స్థిమితం లేని, భాష తెలియని వ్యక్తులపై ప్రజలు దాడులు చేసి చితక బాదుతున్నారు. జిల్లా అధికారులు ప్రజలను చైతన్యం చేయడంలో సంపూర్ణంగా విఫలమవుతున్నారు.