ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ఒకరు మృతి
కామేపల్లి: ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని తాళ్లగూడెం పెద్దమ్మతల్లి గుడి సమీపంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సంధ్య (19) తీవ్రంగా గాయపడటంతో ఆమెను హైదరాబాద్ తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది. ఆటో డ్రైవర్ ఎస్కే దస్తగిరితో పాటు ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామేపల్లికి చెందిన ఆటో ఖమ్మం వెళ్తోంది. ఆ ఆటోలో వచ్చవాయి వీరయ్య, దొడ్డిగొర్ల కోటయ్య, కొప్పుల సంధ్య వెళ్తున్నారు. తాళ్ళగూడెం స్టేజీ వద్ద ఆ గ్రామానికి చెందిన పుచ్చకాయల కనకదుర్గ, బస్వమ్మ, మండ గోపి, ఎల్లబోయిన మల్లమ్మ ఖమ్మం వెళ్ళేందుకు ఎక్కారు. ఆటో పెద్దమ్మ తల్లి గుడి సమీపంలోకి రాగానే ఇల్లెందు నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సు వేగంగా దూసుకొచ్చింది. ఆటోను క్రాస్ చేసే సమయంలో బస్సు వెనుక భాగం ఆటోకు తగిలింది. వెంటనే ఆటో పల్టీలు కొట్టింది. కొప్పుల సంధ్యకు తీవ్రగాయాలై స్పృహ కోల్పోయింది. ఆటో డ్రైవర్‌తో పాటు 7 గురికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు ఆగకుండానే వెళ్ళిపోయింది. తీవ్రగాయాలపాలైన క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంధ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కామేపల్లి ఎస్సై జి.రంజిత్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆటోను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆగకుండా వెళ్ళిన బస్సును పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. బస్సు డ్రైవర్ చాగంటి సురేష్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.