PET Teachers
-
విజిల్స్ మోత.. దారులు మూసివేత
పంజగుట్ట(హైదరాబాద్): కట్టుదిట్టమైన భద్రత.. బారులుగా బారికేడ్లు.. ఒక్కసారిగా విజిల్స్ మోత.. హోరెత్తిన నినాదాలు.. అటుగా దూసుకొచ్చిన యువతీయువకులు.. ప్రధాన ద్వారం వైపు పరుగులు.. ద్వారాలు, దారులు మూసివేత... అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ అడ్డగింపు.. ఇదీ ప్రగతిభవన్ వద్ద సోమవారం చోటుచేసుకున్న సన్నివేశం. గురుకుల వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురుకుల పీఈటీ అభ్యర్థులు సోమవారం ఇక్కడి ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, విజిల్ సౌండ్లతో ప్రగతిభవన్ వద్దకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గురుకుల పీఈటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాదగోని సైదులుగౌడ్ మాట్లాడుతూ 616 గురుకుల వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు 2017 ఏప్రిల్ 20న నోటిఫికేషన్ విడుదల చేయగా, 2017 సెప్టెంబర్ 17, 18వ తేదీల్లో అర్హత పరీక్షలు రాశామని తెలిపారు. 2018 మే 17న ఒక్క పోస్టుకు ఇద్దరు చొప్పున 1,232 మంది అభ్యర్థులను ఎంపిక చేసి, 2018 మే 18 నుండి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశారని, తర్వాత కోర్టు తీర్పు పేరుతో నియామకాలు ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నియామకాలు చేపట్టాలని కోరారు. పీఈటీ టీచర్ల పోరుకు బీసీ సంఘం సంఘీభావం వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ హైదరాబాద్ (గన్‌ఫౌండ్రీ): పీఈటీ ఉపాధ్యాయులకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం ప్రగతిభవన్ ముట్టడికి యత్నించి అరెస్టయి గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉన్న పీఈటీ ఉపాధ్యాయులను ఆయన కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా పీఈటీ టీచర్ల ఆందోళనకు సంఘీభావం ప్రకటించి కృష్ణయ్య మాట్లాడారు. 1,232 మంది పీఈటీ ఉపాధ్యాయులుగా ఎంపికై మూడేళ్లు గడిచినా నేటికీ పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టింగ్ వచ్చిందనే ఆశతో ఇతర పనులకు వెళ్లలేక, పోస్టింగ్ రాక ఎంపికైన వారు ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను ఒక పథకం ప్రకారం ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఖాళీగా ఉన్న పోస్టులకు వెంటనే ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ప్రతినిధులు వేముల రామకృష్ణ, ఉదయ్, సుధాకర్ పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న బీసీ సంఘం నాయకులు -
భాషా పండితులు, పీఈటీలు.. ఇక స్కూల్ అసిస్టెంట్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు(పీఈటీ) ఏళ్ల తరబడి సాగిస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. పదోన్నతులు, సమాన పనికి సమాన వేతనం కోసం ఎదురు చూసిన వేలాది మంది పండితులు, పీఈటీల కల నెరవేరింది. స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నతీకరణ అయిన భాషా పండితులు, పీఈటీ పోస్టుల్లోకి భాషా పండితులు, వ్యాయమ ఉపాధ్యాయులకు పదోన్నతులకు అవకాశం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ గతంలో ఉత్తర్వులు జారీచేయగా, వాటి అమలుపై జీవో నం.77 ఇచ్చారు. ఈ ఉత్తర్వులతో రాష్ట్రంలోని 12,827 మంది భాషా పండితులు, పీఈటీలలో అత్యధికులకు ప్రయోజనం చేకూరనుంది. 1983లో పోస్టుల అప్‌గ్రేడేషన్ ఉత్తర్వులు జారీ అయినప్పటినుంచి భాషా పండితులు, పీఈటీల పోరాటం కొనసాగుతూనే ఉంది. తమ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 17న 10,224 భాషా పండితులు, 2,603 పీఈటీల పోస్టులను ఉన్నతీకరిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో నం.91 విడుదల చేసింది. కానీ, సాకులు చెబుతూ ఆ జీవోను అమలు చేయలేదు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక వీరి సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎస్ఏలుగా ఉన్నతీకరణ అయిన పండిత, పీఈటీ పోస్టుల్లోకి భాషాపండితుల, పీఈటీలకు పదోన్నతులు కల్పించింది. అర్హతలుండే సెకండరీ గ్రేడ్ టీచర్లకు సైతం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చి, వారికి న్యాయం చేకూర్చింది. భాషా పండితులు, పీఈటీల కుటుంబాల్లో ఆనందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, భాషా పండితులు, పీఈటీల సమస్య తీవ్రతను వివరించగానే, వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. ఉన్నతీకరణ ఉత్తర్వులు విడుదల చేయడమే కాకుండా కౌన్సెలింగ్‌ను ఏర్పాటుచేసి భాషా పండితులు, పీఈటీ కుటుంబాల్లో ఆనందాన్ని నింపారన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, యస్.యల్.టి.ఎ. వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్ధయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆటంకాలు
మనజిల్లా అంత విస్తీర్ణం కలిగిన దేశాలు సైతం ఒలంపిక్స్‌లో సత్తాచాటుతున్నాయి.. మనం మాత్రం జాతీయస్థాయిని దాటి ముందుకు వెళ్లలేని పరిస్థితి. 125 కోట్లకు పైగా జనం అందులో 60 శాతం దాకా యువత ఉన్న మనదేశంలో గత ఒలంపిక్స్‌లో వచ్చిన పతకాల సంఖ్య రెండు.. పతకాల పట్టికలో 57వ స్థానం. మన జిల్లాకు సమానంగా ఉండే చిన్న చిన్న దేశాలు సైతం పతకాల పంట పండిస్తుంటే ప్రతిభ ఉన్నా.. ప్రోత్సాహం.. సరైన శిక్షణ, సౌకర్యాలు లేకపోవడంతో మన క్రీడాకారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29న జాతీయ క్రీడాదినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.. ఈ నేపథ్యంలో జిల్లాలోని క్రీడల పరిస్థితులపై ప్రత్యేక కథనం.. కడప స్పోర్ట్స్: రాష్ట్రంలోని ఏకైక క్రీడాపాఠశాల డాక్టర్ వైఎస్ఆర్ క్రీడాపాఠశాల కడప నగరంలోనే ఉన్నప్పటికీ ఈ పాఠశాల నుంచి ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయస్థాయి పతకం కూడా రాకపోవడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన శిక్షణ, వసతులు, క్రీడాసామగ్రి లేకపోవడంతో ఉన్నంతలోనే కాస్తో కూస్తో రాణిస్తున్నారే తప్ప ఒలంపిక్ స్థాయిలో పతకాలు సాధించే క్రీడాకారులు కనిపించకపోవడం గమనార్హం. క్రీడాపాఠశాల ఏర్పాటై దాదాపు 12 సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు కనీసం ఒక్క క్రీడాకారుడు కూడా అంతర్జాతీయస్థాయిలో పాల్గొనలేదు. దీనికి తోడు తీరా పతకాలు సాధించే సమయంలో ఇంటర్మీడియట్ గ్రూపును తీసివేయడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. దీంతో 7 సంవత్సరాల పాటు సాధన చేసినప్పటికీ ఫలితాలు వచ్చే సమయానికి బయటకు పంపేస్తుండటంతో అంతర్జాతీయ పతకాలు కలగానే మిగిలాయి. డీఎస్ఏ మైదానం.. తిరోగమనం కడప నగరంలోని ఏకైక క్రీడామైదానం ప్రకాశం పంతులు జిల్లా క్రీడాప్రాథికార సంస్థ మైదానం. 1963లో దాదాపు 8 ఎకరాల్లో ఏర్పాటైన ఈ మైదానం నేడు తిరోగమనంలో పయనిస్తోంది. వర్షం వస్తే మడుగులా మారడంతో పాటు ఇటీవల మైదానం మధ్యలో హెలీప్యాడ్ ఏర్పాటు చేయడంతో మైదానం ధ్వంసమైంది. తర్వాత పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అధ్యాన్నస్థితికి చేరుకుంది. వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం ఆవరణం సైతం చినుకు రాలితే.. మడుగులా మారుతోంది. పాఠశాలస్థాయిలో పరిస్థితులు ఇలా.. జిల్లాలో దాదాపు 4376 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో కేవలం 1,151 పాఠశాలలు అనగా మూడోవంతు పాఠశాలల్లో తప్ప మిగతా పాఠశాలలు మైదానం లేకుండానే నెట్టుకొస్తున్నాయి. ఆటస్థలాలు ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను వేళ్లమీద లెక్కగట్టవచ్చు. పేరుకే వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం చేపట్టి విద్యార్థులకు ప్రతిరోజూ డ్రిల్, ఆటలు నిర్వహించాలి. ఇది నిబంధన కూడా. కానీ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేరుకే వ్యాయామ ఉపాధ్యాయులు ఉంటున్నారు. ఒక్కరోజు కూడా డ్రిల్ చేయించిన పాపాన పోవడం లేదు. రోగాల ఉత్పత్తి కేంద్రాలు చదువు పేరుతో ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలను పుస్తకాల పురుగులుగా మార్చివేస్తున్నారు. పిల్లల ఇష్టాఇష్టాలను పట్టించుకోకుండా తల్లిదండ్రుల అభిప్రాయాలు, ఆశయాలను పిల్లలపై రుద్దేస్తూ ఎప్పుడూ చదువుపైనే ధ్యాస ఉంచు అంటూ ఊదరగొడుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు రోగాల ఉత్పత్తి కేంద్రంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధుల భారం.. ఆటలకు దూరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించే సత్తా ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. వారికి తగిన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చతికిలపడుతోంది. దీంతో విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి రాకుండా మరుగున పడిపోతోంది. క్రీడలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో మైదానాలన్నీ బోసిపోతున్నాయి. జీఓ నెం. 63 ప్రకారం 2012లో అప్పటి ప్రభుత్వం వ్యాయామవిద్యను తప్పనిసరి చేస్తూ జీఓ నెం.63 జారీచేసింది. ఈ ఉత్వర్వు ప్రకారం ప్రభుత్వ, గుర్తింపు పొందిన అన్ని పాఠశాలల్లో వ్యాయామవిద్యను తప్పనిసరిగా నిర్వహించాలి. దీని అమలు చేయడంతో పాటు ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలను రూపొం దించి ఒక పీరియడ్‌ను నిర్వహించాలి. ఈ ఉత్వర్వుల ప్రకారం వారంలో 6 పీరియడ్లు అమలుచేయాల్సి ఉన్నా ఎక్కడా అమలుకావడం లేదు. 51వ జీఓ ప్రకారం 2003 మే 7వ తేదీన అప్పటి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు జీఓ నెంబర్ 51 జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు, వారికి శిక్షణ ఇచ్చే వ్యాయామ ఉపాధ్యాయులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం. జాతీయ పోటీల్లో బంగారు పతకం సాధిస్తే రూ. 4.5 లక్షలు, రజతం సాధిస్తే 3 లక్షలు, కాంస్యపతకం సాధిస్తే 1.5లక్షలు నగదు బహుమతిగా ఇవ్వాల్సి ఉంది. పాఠశాల స్థాయి నుంచే ఈ ప్రోత్సాహకాలు అమలుకావాలి. కానీ ఎక్కడా ఇటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. అమలు కాని క్రీడా సమయం చదువుతో పాటు ఆటలకు సమయం కేటాయించాలన్న ప్రతిపాదన కేవలం నీటిమీద రాతల్లాగా మారింది. ఆటలను చుట్టేసి.. చదువు, ర్యాంకులు, జీపీఏలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం తగ్గి మరమనుషుల్లా మారుతున్నట్లు సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. 45 నిమిషాల పాటు ఆటలు ఆడటం ద్వారా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గి చలాకీగా ఉంటారని.. శారీరకంగా ఎదుగుదల సక్రమంగా జరిగి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఏ ఒక్క పాఠశాలల్లోను క్రీడలకంటూ ప్రత్యేక సమయం కేటాయించడం లేదు. 9, 10 తరగతుల విద్యార్థులైతే మైదానం వైపు చూసేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. స్పెషల్‌క్లాసులు, ఐఐటీ ఫౌండేషన్ ఇలా చదువులకే పరిమితం చేస్తున్నారు. ఇరుకైన మైదానాల్లోనే.. జిల్లాలో ఆటస్థలాలు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలల్లో మైదానాలు ఉండాలన్న నిబంధనలు చాలాచోట్ల కనిపంచడం లేదు. దీంతో ఇరుకైన మైదానంలోనే విద్యార్థులు ఆటలు ఆడాల్సి వస్తోంది. రోజురోజుకు విద్యార్థుల సంఖ్య పెరగడంతో అదనపు తరగతుల నిర్మాణం చేపడుతుండటంతో ఉన్న స్థలం కాస్తా తగ్గుతూ వస్తోంది. ఫలితంగా ప్రార్థన చేసుకోవడానికి కూడా స్థలం సరిపోవడం లేదు. ఇక పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఎక్కడ ఉంటుంది. మరిక్నొ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేక పిల్లలు క్రీడల్లో వెనుకబడుతున్నారు. -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తాం
కడప స్పోర్ట్స్: వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య అన్నారు. ఆదివారం నగరంలోని డీసీఈబీ సమావేశ మందిరంలో ఏపీ పీఈటీ, ఎస్ఏ (పీఈ) అసోసియేషన్ వైఎస్ఆర్ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులు ఒక్క విజిల్‌తో పాఠశాలను క్రమశిక్షణలో ఉంచగలిగే సమర్థులన్నారు. అప్‌గ్రేడేషన్ ప్రక్రియ త్వరలో పూర్తికానుందని, దీనికి సంబంధించి అమలు ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కరీముల్లారావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సంఘాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. నవ్యాంధ్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకుడు రవీంద్రారెడ్డి మాట్లాడుతూ సమస్యల పోరాటంలో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ షామీర్‌బాషా, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు ఎలియాస్‌రెడ్డి, నాయకులు శివశంకర్‌రాజు, కాంతారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక.. ఏపీ పీఈటీ, ఎస్ఏ (పీఈ) అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా శివశంకర్‌రాజు, అధ్యక్షుడిగా బి. నిత్యప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా కె. రమేష్‌యాదవ్, కోశాధికారిగా ప్రతాప్‌రెడ్డి, సహ అధ్యక్షుడుగా రామచంద్రయ్య, ఉపాధ్యక్షులుగా రెడ్డ య్య, ఇజ్రాయిల్, వెంకటసుబ్బయ్య, విజయలక్ష్మి, సంయుక్త కార్యదర్శిగా సుబ్రమణ్యం, సాగర్, రామ్మూర్తి, స్టేట్ కౌన్సిలర్లుగా ఎస్.సాజిద్, నగేష్‌లను ఎన్నుకున్నారు.